logo

హడలెత్తించి.. హమ్మయ్యా అనిపించి

అనపర్తి మెయిన్‌రోడ్డులో శుక్రవారం సాయంత్రం కొంతమంది నిరసనకారులు ఫ్లకార్డులు పట్టుకొని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. నిరసన వ్యక్తం చేశారు. ఈలోగా వాహనాలపై వచ్చిన పోలీసులు మొదటగా హెచ్చరికలు జారీచేశారు.

Published : 25 May 2024 03:47 IST

ఆందోళనకారులపై లాఠీఛార్జ్‌ చేస్తున్న పోలీసులు 

అనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: అనపర్తి మెయిన్‌రోడ్డులో శుక్రవారం సాయంత్రం కొంతమంది నిరసనకారులు ఫ్లకార్డులు పట్టుకొని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. నిరసన వ్యక్తం చేశారు. ఈలోగా వాహనాలపై వచ్చిన పోలీసులు మొదటగా హెచ్చరికలు జారీచేశారు. అయినా నిరసనకారులు వినిపించుకోకుండా దిష్టిబొమ్మ, టైర్లను దహనం చేశారు. దీంతో వారిపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. నిరసనకారులు తిరగుబాటు 
చేయడంతో బాష్ఫవాయువు (టియర్‌ గ్యాస్‌) ప్రయోగించారు. ఆందోళన కారులు చెల్లాచెదురయ్యారు. అయినప్పటికీ ఆందోళన కొనసాగిస్తుండడంతో రబ్బర్‌ బుల్లెట్లతో ఫైరింగ్‌ చేశారు. గాయపడినవారిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా ఇదంతా చూసిన ప్రజలు హడలిపోయారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఓట్ల లెక్కింపురోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తీసుకునే చర్యల్లో భాగంగానే మాబ్‌ ఆపరేషన్‌ మాక్‌ డ్రిల్‌ నిర్వహించారని తెలుసుకొని అంతా ఊపిరిపిల్చుకున్నారు. ఈ సందర్భంగా అనపర్తి సీఐ శివగణేష్‌ మాట్లాడుతూ.. ప్రజలందరి సహకారంతో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని, కౌంటింగ్‌ ప్రక్రియ సజావుగా నిర్వహించుకునేలా ప్రజలంతా సహకారం అందించాలని కోరారు. ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకొని విద్రోహ చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
ఆర్‌ఐ శ్రీనివాస్, ఎస్సై రామారావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని