logo

బడి బస్సు.. భారమే బాసు..!

రాష్ట్ర ప్రభుత్వం లారీలు, బస్సులు, ట్యాక్సీలతోపాటు పలు వాహనాలపై ఎడాపెడా పన్నుల భారం మోపడంతో రవాణా రంగం నానాటికీ కుదేలవుతోంది.

Published : 26 May 2024 03:12 IST

అమలాపురంలో బస్సు సామర్థ్యం పరీక్షిస్తున్న రవాణాశాఖ అధికారి 

  • అల్లవరం మండలం గోపాయిలంకకు చెందిన సీహెచ్‌.దుర్గాభవాని అమలాపురం పట్ణణంలోని కళాశాలకు వెళ్లివచ్చేందుకు ఏడాదికి రూ.16 వేలు బస్సు రుసుం చెల్లించేది. ప్రస్తుతం కళాశాల, పాఠశాల బస్సులపై ఇబ్బడిముబ్బడిగా పన్నులు పెంచేయడంతో ఈ ఏడాది యాజమాన్యం రవాణాకు రూ.22 వేలు చెల్లించాలని తెలిపింది.
  • ఉప్పలగుప్తం మండలం భీమనపల్లికి చెందిన బండారు సురేష్‌ అమలాపురం మండల పరిధిలోని ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్నాడు. ఇతని నుంచి ఇప్పటివరకు బస్సు రుసుం రూ.18 వేలు వసూలు చేసిన యాజమాన్యం ఈ ఏడాది నుంచి రూ.24 వేలు చెల్లించాలని తేల్చిచెప్పింది. 
  • ఇది వీరిద్దరి సమస్యే కాదు. జిల్లావ్యాప్తంగా ప్రైవేటు విద్యాసంస్థలు నడుపుతున్న బస్సుల్లో ప్రయాణించే విద్యార్థులందరిదీ.

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్‌: రాష్ట్ర ప్రభుత్వం లారీలు, బస్సులు, ట్యాక్సీలతోపాటు పలు వాహనాలపై ఎడాపెడా పన్నుల భారం మోపడంతో రవాణా రంగం నానాటికీ కుదేలవుతోంది. గతేడాది నుంచి ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ఆధ్వర్యంలో నడుస్తున్న బస్సులపై వైకాపా ప్రభుత్వం పన్నులను విపరీతంగా పెంచేసింది. దీంతో యాజమాన్యాలు ఆ భారాన్ని విద్యార్థులపై మోపుతున్నాయి. చివరకు ప్రభుత్వ విధానాల వల్ల ఇబ్బందులు పడుతున్నది పేద విద్యార్థుల తల్లిదండ్రులే కావడం గమనార్హం.

సీట్ల వారీగా పన్ను..

గతంలో మూడు నెలలకోసారి పన్ను చెల్లించేవారు. ఆ విధానానికి స్వస్తి పలికి గత సంవత్సరం మధ్యలో నుంచి సీట్ల వారీగా పన్ను వసూలుకు రాష్ట్ర ప్రభుత్వం తెరతీసింది. గతంలో ఏడు టన్నులలోపు బరువున్న పాఠశాల బస్సులకు మూడు నెలలకు రూ.725 చొప్పున పన్ను విధించేవారు. ఏడు టన్నులు దాటితే రూ.1,420 వసూలు చేసేవారు. గత విద్యా సంవత్సరం మధ్యలో నుంచి బరువుతో సంబంధం లేకుండా సీటుకు రూ.100 చొప్పున పన్ను విధిస్తున్నారు. బస్సులో ఎన్ని సీట్లుంటే అన్ని వందలు మూడు నెలలకోసారి చెల్లించాలి. ఇప్పటికే ఫీజుల బాదుడుతో సతమతమవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను బస్సుల ఛార్జీలు మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 8 ఇంజినీరింగ్‌ కళాశాలలు, 67 ప్రైవేటు ఇంటర్మీడియట్‌ కళాశాలలు, 250 వరకు ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు లక్ష మంది వరకు చదువుతున్నారు. పాఠశాల బస్సులపై పన్ను భారం మోపడం వల్ల పరోక్షంగా వీరందరిపైనా భారం పడనుంది.

ఇవి తప్పనిసరి..

ఏపీ మోటారు వాహన చట్టం ప్రకారం సూచించిన నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని అధికారులు చెబుతున్నారు. విద్యాసంస్థ పేరు, చరవాణి నంబరు, పూర్తి చిరునామా, బస్సు ఎడమవైపు, ముందు భాగంలో స్పష్టంగా కనిపించేలా ఉండాలి. బస్సుల్లో ప్రథమ చికిత్స పెట్టె తప్పక ఉండాలి. వాహన చోదకుడు విధుల్లో ఉన్న సమయంలో ఖాకీ దుస్తులే ధరించాలి. అతడికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. వాహనం నడిపే వ్యక్తి కంటిచూపు బాగుండాలి. 60 ఏళ్లు పైబడినవారిని వాహన చోదకులుగా నియమించకూడదు. అగ్నిమాపక పరికరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అందుబాటులో ఉండాలి.

మొదలైన సామర్థ్య పరీక్షలు

బడి బస్సులకు ఏటా సామర్థ్య ధ్రువీకరణ పత్రం(ఎఫ్‌సీ) విధిగా తీసుకోవాల్సిఉంటుంది. ఈ నెల 16వ తేదీనుంచి జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల బస్సులకు సామర్థ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. పలు పాఠశాలల బస్సులను ధ్రువీకరణ పత్రాల కోసం ఆర్టీఏ కార్యాలయాలకు తీసుకువస్తున్నారు. అధికారులు పూర్తి స్థాయిలో పరీక్షించిన తరువాత మాత్రమే వాటికి అనుమతులు మంజూరు చేస్తున్నామని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని