logo

ఇలా ఉంటే.. వానొస్తే మునగదా మరి!

చారిత్రాక నగరం చినుకుపడితే చాలు చిగురుటాకులా గజగజలాడిపోతోంది. తేలికపాటి వర్షం కురిసినా నగరంలోని పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తాయి.

Published : 26 May 2024 03:19 IST

లలితానగర్‌: కాలువ నిర్మాణం కారణంగా రోడ్డుపై పారుతున్న మురుగు, చెత్త

చారిత్రాక నగరం చినుకుపడితే చాలు చిగురుటాకులా గజగజలాడిపోతోంది. తేలికపాటి వర్షం కురిసినా నగరంలోని పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తాయి. గోదావరికి చెంతన ఉన్న ప్రాంతాలే కాకుండా దూరంగా ఉన్న కాలనీల్లో సైతం మోకాలి లోతు మురుగు చేరి నగరవాసుల రోజువారీ జీవనానికి ఆటంకం కలిగిస్తున్నాయి. రానున్నది వర్షాకాలం. ఇప్పటికీ నగరంలో పూర్తిస్థాయిలో పూడికలు తీయకపోవడంతో పలుచోట్ల మురుగు, వ్యర్థాలు రోడ్డెక్కి పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి వానలు కురవకముందే కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలని నగరవాసులు విన్నవిస్తున్నారు.

న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు

 చెత్త, పూడికతో తుమ్మలావ పెద్ద కాలువ

నగరం నడిబొడ్డున గోదావరికి సమీపాన ఉన్న శ్యామలసెంటర్‌తో పాటు గోదావరికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న వి.ఎల్‌.పురం వంటి ప్రాంతాలు సైతం వర్షానికి జలమయంగా మారుతున్నాయి. వర్షం వస్తే నగరంలో ముందుగా ముంపునకు గురయ్యే తుమ్మలావ, శ్యామల సెంటర్, కృష్ణనగర్, కంబాలచెరువు, హైటెక్‌ బస్టాండ్, చిరంజీవి బస్టాండ్, రైల్వే స్టేషన్‌ రోడ్డు, లలితానగర్‌ రోడ్డు, వి.ఎల్‌.పురం తదితర ప్రాంతాల్లోని కాలువల్లో పూడికతీత పనులు లేవు. పలు ప్రాంతాల్లో కాలువలు వ్యర్థాలతో నిండిపోయి మురుగు రోడ్డెక్కుతోంది. కొన్నిచోట్ల కాలువలకు గట్లు లేక మురుగు రహదారికి సమాంతరంగా ప్రవహిస్తోంది. ఇలాంటిచోట పారిశుద్ధ్య పరిస్థితి మెరుగుపర్చడంతో పాటు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సి అవసరముందని నగరవాసులు అభిప్రాయ పడుతున్నారు. 

లింగంపేట పెద్ద కాలువలో చెత్త ఉండడంతో రోడ్డుపైకి చేరిన మురుగు, చెత్త 


కాలువ నిర్మాణం త్వరగా పూర్తిచేయండి...

కాలువలు, రహదారుల నిర్మాణమంటూ మా ప్రాంతంలో నెల క్రితం ఉన్న కాలువలకు అడ్డుకట్ట కట్టారు. దీంతో కాలువలు పూర్తిగా నిండి మురుగు, చెత్త రోడ్డెక్కుతున్నాయి. అటువైపుగా సంచరించాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. పాదచారుల పరిస్థితి మరీ దారుణం. త్వరితగతిన నిర్మాణాలు పూర్తయ్యేలా అధికారులు చూడాలి.

మణికంఠ, లలితానగర్‌


వర్షం వస్తే అంతే..

ప్రధాన రైల్వే స్టేషన్‌ రోడ్డులో ఉన్న ఆల్క్‌ట్‌తోట ప్రాంతమంతా గంట వర్షానికే నీరు చేరి బస్సులు సైతం మునిగిపోతున్నాయి. మా వీధుల్లో ఇంట్లోకి సైతం మురుగు నీరు వస్తోంది. సామగ్రి కూడా పాడవుతోంది. మా ప్రాంతంలో కాలువలపై చాలావరకు పలకలు సరిగా ఉండవు. కాలువలు పూర్తిగా చెత్త, వ్యర్థాలతో నిండి వర్షాలకు అవన్నీ ఇంట్లోకి చేరుతున్నాయి. వర్షాలు పూర్తిగా మొదలవకముందే సంబంధిత అధికారులు పూడికలు, చెత్త వంటివి తొలగించాలి. 

సుబ్రహ్మణ్యం, ఆల్కట్‌తోట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని