logo

ఏమైంది ‘వీరికి!’.. రాజమహేంద్రవరంలో దంపతుల అనుమానాస్పద మృతి

దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన రాజమహేంద్రవరంలో శనివారం చోటుచేసుకుంది. బలవన్మరణానికి పాల్పడారా..

Published : 26 May 2024 06:02 IST

దేవి, శ్రీధర్‌(పాతచిత్రం) 

రాజమహేంద్రవరం నేరవార్తలు: దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన రాజమహేంద్రవరంలో శనివారం చోటుచేసుకుంది. బలవన్మరణానికి పాల్పడారా.. లేక విభేదాల కారణంగా భార్యను హతమార్చి భర్త ఉరేసుకున్నాడా అన్నది తేలాల్సి ఉంది. మూడో పట్టణ సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్‌ వివరాల మేరకు.. 
కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రాంతానికి చెందిన చక్రవర్తుల శ్రీధర్‌(28)కు అదే జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగికి చెందిన దేవి(24)తో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి బాబు(7) పాప(6). ఈ కుటుంబం మూడేళ్ల కిందట రాజమహేంద్రవరం వచ్చి ఆనందనగర్‌లో ఉంటోంది. శ్రీధర్‌ తాపిమేస్త్రీ. రెండేళ్లకు దంపతుల మధ్య విభేదాలు  మొదలయ్యాయి. దీంతో దేవి పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రుల వద్దే కొంతకాలంగా ఉంటోంది. వారం కిందట శ్రీధర్‌ అత్తారింటికి వెళ్లి వారితో మాట్లాడి పిల్లలను అక్కడే ఉంచి, భార్యను తీసుకుని శనివారం నగరానికి వచ్చాడు. సాయంత్రం స్థానిక బంధువు ఒకరు శ్రీధర్‌ ఇంటి వచ్చి అతడ్ని పిలిచేసరికి ఎటువంటి స్పందన లేదు. కిటికిల్లోంచి చూసేసరికి శ్రీధర్‌ ఫ్యానుకు ఉరేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులుకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరిశీలించారు. దేవి మెడకు చున్నీ బిగిసిపోయి గదిలో పడి మృతి చెంది ఉంది. శ్రీధర్‌ సీలింగ్‌ ఫ్యానుకు వేలాడుతూ మృతి చెంది ఉన్నాడు. ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడి ఉంటే ఒకరు నేలపై, మరొకరు ఫ్యానుకు వేలాడుతూ ఎలా ఉంటారనే అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశామని ఎస్సై నాగబాబు చెప్పారు. 

అనాథలైన చిన్నారులు

ఏడాది కిందట శ్రీధర్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ క్రమంలో అతడి రెండు కాళ్లలోను స్టీల్‌ ప్లేట్లు ఉంచడంతో దేవి తిరిగి కాపురానికి వచ్చిందని.. కొంతకాలం సజావుగా సాగిన అనంతరం తిరిగి వివాదాలు వస్తే పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయిందని ఆమె తరఫు బంధువులు తెలిపారు. శనివారం ఉదయం నగరానికి వచ్చిన శ్రీధర్‌ భార్యను ఇంట్లో దించి గంట తరువాత ఓ మద్యం సీసా తీసుకుని తిరిగి ఇంట్లోకి వెళ్లినట్లుగా స్థానికులు పోలీసులుకు వివరించారు. మద్యం మత్తులో శ్రీధర్‌ ఈ ఘాతుకం తలపెట్టాడా.. కావాలనే ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారా అన్నది తేలాల్సి ఉంది. అమ్మానాన్న మృతితో ఇద్దరు చిన్నారులు ఒంటరయ్యారని ఘటనా స్థలంలోని స్థానికులు, కుటుంబీకులు ఆవేదన చెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు