logo

ఏళ్లుగా తిరుగుతున్నా పరిహారం రాలేదు..

పోలవరం నిర్వాసితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు.

Published : 26 May 2024 03:24 IST

జ్యోతుల నెహ్రూ వద్ద పోలవరం నిర్వాసిత రైతు ఆవేదన

బాధితుడిని పరామర్శిస్తున్న జ్యోతుల నెహ్రూ 

ధవళేశ్వరం, టి.నగర్, ఏవీఏ రోడ్డు: పోలవరం నిర్వాసితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. పోలవరం పరిహారం అందలేదని ఉండమట్ల సీతారామయ్య అనే రైతు ధవళేశ్వరంలోని పోలవరం కార్యాలయం వద్ద శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. జ్యోతుల నెహ్రూ శనివారం ఆయనను పరామర్శించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే ఆయన పరిస్థితి తెలుసుకునేందుకు పోలవరం ప్రాజెక్టు కార్యాలయం నుంచి ఏ అధికారి రాలేదన్నారు. ప్రాజెక్టు పరిపాలనాధికారి సెలవులో ఉంటే డిప్యూటీ కలెక్టర్‌ను అయినా పంపాలన్నారు. మానవత్వం లేకుండా వ్యవహరించే అధికారులపై భవిష్యత్తులో చర్యలు తీసుకుంటామన్నారు. పరిహారం కోసం ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని సీతారామయ్య ఆవేదన వ్యక్తం చేశారన్నారు. 10 ఎకరాల భూమి ప్రాజెక్టు నిర్మాణానికి ఇచ్చారని, తీసుకున్న భూమికి ప్రభుత్వం పరిహారం చెల్లించలేదన్నారు. పోలవరం రైతులు కార్యాలయాల చూట్టూ తిరగలేక విసిగిపోతున్నారన్నారు. ఇటువంటి బాధితులు ఎంతోమంది వెలుగులోకి రాకుండా నిరాశతో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. నిర్వాసితులకు చంద్రబాబు హయాంలో తగిన న్యాయం జరుగుతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని