logo

నిధుల్లేవ్‌.. నీళ్లు అడగొద్దు

ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందించాలి.. ప్రతి ఒక్కరికీ రోజుకు 55 లీటర్ల రక్షిత జలాలు ఇవ్వాలి. ఈ పనులు 2024 మార్చిలోగా పూర్తవ్వాలి..

Updated : 26 May 2024 04:45 IST

ఇంటింటికీ కుళాయిల ఏర్పాటులో తీవ్ర జాప్యం
బిల్లుల బకాయిలే రూ.83 కోట్లు 
‘జల్‌ జీవన్‌ మిషన్‌’ పనుల్లో అంతా గడబిడే

ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందించాలి.. ప్రతి ఒక్కరికీ రోజుకు 55 లీటర్ల రక్షిత జలాలు ఇవ్వాలి. ఈ పనులు 2024 మార్చిలోగా పూర్తవ్వాలి.. ఇదీ కేంద్ర ప్రభుత్వం ‘జల్‌ జీవన్‌ మిషన్‌’ పథకానికి నిర్దేశించిన లక్ష్యం. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం చొప్పున వాటా నిధులతో పూర్తిచేయాల్సిన ఈ పథకం ప్రగతి చూస్తే నత్త గుర్తుకొస్తుంది. గడువు దాటినా పూర్తికాలేదు. చేసిన పనులకు బిల్లులు మంజూరుకాక.. కొత్త నిధులు కేటాయించక ఈ దుస్థితి ఎదురైంది.

  • బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 1,348.. కాకినాడ 667, తూర్పుగోదావరి జిల్లాలో 239 ఆవాస ప్రాంతాల్లో జల జీవన్‌మిషన్‌ (జేజేఎం) ద్వారా నీటి కష్టాలకు తెరదించాల్సిఉంది. రూ.5 లక్షల లోపు పనులు.. ఆ పైన ఉన్నవి విభజించి చేస్తున్నారు. గ్రామాల్లోని తాగునీరు, పారిశుద్ధ్య కమిటీల ద్వారా చేపట్టాల్సి ఉండగా.. ఈ పనుల్లో రాజకీయం వేలు పెట్టడంతో గుత్తేదారులతో చేయిస్తున్నారు. అవీ గంపగుత్తగా కొందరికే కేటాయించడంతో ఆశించిన రీతిలో ముందుకు సాగడంలేదు.

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో జల్‌ జీవన్‌ మిషన్‌ నిధులతో ఏర్పాటుచేసిన కుళాయి


రాజానగరం మండలంలో జల్‌ జీవన్‌ మిషన్‌ నిధులతో రక్షిత పథకం నిర్మాణం 

ఈనాడు, కాకినాడ: అయిదేళ్ల క్రితం ప్రారంభమైన జల్‌ జీవన్‌ మిషన్‌ పనులకు నేటికీ మోక్షం దక్కలేదు. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు సవ్యంగా ఇవ్వక.. చేసినవాటికి  బిల్లులు చెల్లించకపోవడం ఇందుకు కారణం. ఇన్నాళ్లూ నత్తనడకన సాగిన పనులు ఎన్నికల కోడ్‌తో పూర్తిగా పడకేశాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చేసిన పనుల బిల్లులు ఏకంగా రూ.83 కోట్లు బకాయిలు ఉండడంతో గుత్తేదారులు మొండికేశారు. ఇటీవల విజయవాడలో సమావేశమై బిల్లులు ఇవ్వకపోతే పనులు నిలిపివేయాలని నిర్ణయించడంతో నీలి నీడలు కమ్ముకున్నాయి. వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నవి అటుంచితే.. ఇంకా ప్రారంభం కానివాటి పరిస్థితేమిటో అర్థంకావడంలేదు.


లక్ష్యానికి, అమలుకు ఎంతో తేడా

  • జల జీవన్‌ మిషన్‌ పనులు వాస్తవంగా ఈ ఏడాది మార్చినాటికి పూర్తికావాలి.. క్షేత్రస్థాయి ప్రతికూలతలతో 2025 జూన్‌ నాటికి పూర్తిచేయాలని కొత్తగా లక్ష్యం నిర్దేశించుకున్నారు. జిల్లాలో గతంలోనే తాగునీటి పథకాలు, కుళాయిల వ్యవస్థ చాలావరకు ఏర్పాటవడంతో.. లక్ష్యం పూర్తికి ఈ ఏడాది డిసెంబర్‌ గడువు నిర్దేశించుకున్నారు. అవి ఊపందుకోవాలంటే వాటా నిధులు, బకాయిలు విడుదలచేయాలి.  
  • కాకినాడ జిల్లాలో జల్‌ జీవన్‌ మిషన్‌ పనులకు రూ.407.66 కోట్లు మంజూరైతే.. ఇప్పటిరకు రూ.120 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. మొత్తం పనుల్లో 541 పూర్తయితే.. 269 వివిధ దశల్లో ఉన్నాయి. జిల్లాలో 3.89 లక్షల గృహాలకు కుళాయిల ద్వారా జలాలు ఇవ్వాలి. గతంలోనే 1.25 లక్షల గృహాలకు ఉన్న కనెక్షన్లతో కలిపి 3.15 లక్షల కుళాయిలు ఏర్పాటుచేశారు. మరో 78వేల గృహాలకు ఇవ్వాలి.
  • తూర్పుగోదావరి జిల్లాలో జేజేఎం ప్రాజెక్టుకు రూ.480 కోట్లు మంజూరైతే.. ఇప్పటివరకు కేవలం రూ.68 కోట్లు మాత్రమే వెచ్చించారు. 216 పనులు పూర్తయితే.. మరో  450 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. జిల్లాలో 3.10 లక్షల కుళాయి కనెక్షన్లు ఏర్పాటు లక్ష్యంగా కాగా.. ఇప్పటికి 37వేలు కనెక్షన్లు మాత్రమే ఇవ్వగలిగారు.
  • కోనసీమ జిల్లాలో రూ.515.92 కోట్లతో జల్‌ జీవన్‌ మిషన్‌ ప్రాజెక్టు పట్టాలెక్కించాల్సి ఉంటే.. ఇప్పటికి రూ.171.18 కోట్లు ఖర్చుచేశారు. 966 పనులు పూర్తవగా, 853 ప్రగతిలో ఉన్నాయి. రెండు ప్రారంభం కాలేదు.


వేగవంతానికి చర్యలు

జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు ఈ ఏడాది మార్చికి పూర్తి చేయాలన్నది లక్ష్యమే అయినా ప్రతికూలతల వల్ల సాధ్యపడలేదు. డిసెంబర్‌ కల్లా చేయాలని నిర్దేశించుకున్నాం. ఎన్నికల కోడ్‌ కారణంగా నిర్మాణంలో ఉన్న పనులు, కొత్తగా ప్రారంభించాల్సినవి నిలిపివేయాల్సి వచ్చింది. ఆంక్షలు ముగిశాక మొదలవుతాయి. నిధులు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. పనులు వేగవంతం చేసి ఇంటింటికీ కుళాయిల లక్ష్యం సాధించేలా చర్యలు తీసుకుంటాం.

ఎం.శ్రీనివాస్, ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్, కాకినాడ జిల్లా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు