logo

వర్షాకాలానికి ముందే తొంగి చూసిన డెంగీ

చినుకు రాలింది.. ‘ఖాళీ’ స్థలాలు..గుంతల్లో నిలిచిన నీటిలో దోమ పుట్టింది. నగర/పురపాలక, పంచాయతీ సిబ్బంది మేల్కొనక పోతే జనాలు రోగాల బారిన పడటం ఖాయం.

Updated : 29 May 2024 05:26 IST

నేనున్నానంటున్న మలేరియా
మేల్కొనకుంటే ముప్పే
న్యూస్‌టుడే, సీతానగరం

చినుకు రాలింది.. ‘ఖాళీ’ స్థలాలు..గుంతల్లో నిలిచిన నీటిలో దోమ పుట్టింది. నగర/పురపాలక, పంచాయతీ సిబ్బంది మేల్కొనక పోతే జనాలు రోగాల బారిన పడటం ఖాయం. వర్షాకాలం రాకమునుపే అప్పుడే కేసులు వెలుగు చూస్తున్నాయి. ప్రతిచోట అపరిశుభత్ర వెంటాడుతోంది. ఏటా పన్నుల రూపేణా ఆదాయం పొందుతున్న నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీలు ఆ స్థాయిలో ప్రజారోగ్యంపై దృష్టి సారించడం లేదు. వీధుల్లో చెత్తాచెదారం పేరుకుపోయినా తొలగించే పరిస్థితి కానరావడం లేదు. జనం జర్వాలు, డెంగీ, మలేరియా బారిన పడుతున్నారు. ప్రాణాల మీదికొస్తున్నా పట్టించుకునేవారే కరవయ్యారు. అధికార యంత్రాంగం మేల్కొనకపోతే జనాలకు రోగాల ముప్పు తప్పేలా లేదనేది సృష్టమవుతోంది.

పట్టించుకోని ప్రజారోగ్య వ్యవస్థ..

పంచాయతీల్లో ప్రజారోగ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. గ్రామ పంచాయతీలకు కేంద్రం అందించే ఆర్థిక సంఘం నిధుల్లో 60 శాతం టైడ్‌లో 30 శాతం తాగునీరు, 30 శాతం పారిశుద్ధ్యం పనులకు ఖర్చు చేయాలి. దోమల నివారణకు ప్రతి పంచాయతీలో రూ.లక్షకు పైబడి వెచ్చించవచ్చు. 2023 వరకు పంచాయతీల్లో నిధులను విద్యుత్తు బిల్లుల బకాయిల పేరుతో ప్రభుత్వం వెనక్కి లాగేసింది. 2023-24కు వచ్చేసరికి రెండు విడతల నిధులు మాత్రమే ఇచ్చింది. మూడో విడత ఇవ్వలేదు. 2024-25కు సంబంధించి ఆర్థిక సంఘం నిధులు ఒక్క విడత కూడా రాలేదు. మేజర్‌ పంచాయతీల్లోనే పారిశుద్ధ్య పనులు దారుణంగా ఉంటే మైనర్‌ పంచాయతీల్లో అసలు వీటి జోలికి పోవడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. జిల్లాలో అరకొరగా ఉన్న ఫాగింగ్‌ యంత్రాలు, పిచికారీ పరికరాలు పక్కన పెట్టేశారు. వీటికి గత నాలుగేళ్లుగా ఉపయోగించకుండా మూలనపెట్టేయడంతో తుప్పుపట్టి పాడైపోయాయి.

సీతానగరం మండలం ముగ్గళ్ల పంచాయతీ వద్ద మూలకు చేరిన ఫాగింగ్‌ వాహనం 

కానరాని ప్రత్యేక కార్యక్రమాలు..

2014-19 మధ్యకాలంలో ‘దోమలపై దండయాత్ర’ పేరుతో నివారణ చర్యలు చేపట్టేవారు. ఇవి ప్రజలను ఎంతగానో ఆలోచింపజేసేవి. ప్రతి శుక్రవారం ప్రై డే..డ్రై డే నిర్వహించేవారు. దోమల ఆవాసాలను గుర్తించి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకునేవారు. ఇక వార్డుల్లో నీటి తొట్టెలు, పాత సామగ్రి, అపరిశుభ్రత, ట్యాంకులను తెరిచి ఉంచడం, టెంకాయ చిప్పలు, టైర్లలో నీరు నిలిచి ఉండడం తదితరాలతో వచ్చే అనర్థాలను జనాలకు వివరించేవారు. వారిని చైతన్య పరిచే కార్యక్రమాలు చేపట్టేవారు. వైకాపా ప్రభుత్వంలో ఇలాంటివి కనిపించలేదు. కనీసం క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది.. కేసులు వచ్చిన చోట ఏం చేయాలి? భవిష్యత్తు కార్యచరణ ఏమిటి ? అనే ఆలోచన లేకపోయింది.

నిధుల లేమితో వాహనాలకు తుప్పు

నగరపాలక సంస్థలు/పురపాలకసంఘాలతోపాటు గ్రామ పంచాయతీలకు రూ.లక్షలు వెచ్చించి ప్రభుత్వమే వాహనాలు కొనుగోలు చేసి పంపించింది. తడి, పొడి చెత్తసేకరణతోపాటు దోమల మందు పిచికారీ చేసేలా ఫాగింగ్‌ యంత్రాల ఆటోలు వచ్చాయి. వీటిల్లో ఇంధనం నింపేందుకు కూడా చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో పలుచోట్ల వాహనాలను మూలన పడేశారు. చోదకులకు వేతనాలు ఇవ్వలేక ఇచ్చిన వాహనాలు మాకొద్దంటూ పలు పంచాయతీల పాలకవర్గాలు వెనక్కి ఇచ్చేశాయి. వాటిని ఏం చేయాలో తెలియక సచివాలయాల వద్ద అలంకార ప్రాయంగా ఉంచడంతో తుప్పుపట్టాయి. చాలాచోట్ల మరమ్మతులకు వచ్చిన వాహనాలను బాగు చేయకుండానే వదిలేశారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించే వాహనాలు మూలన పడి ఉన్నాయి. పంచాయతీల్లో ప్రస్తుతం అరువుపై తెచ్చిన నాసిరకం బ్లీచింగ్‌ తప్ప మలాథియన్‌ ద్రావణం అందుబాటులో లేదు. దోమల గుడ్లు వృద్ధిచెందకుండా చల్లే ఎబిట్‌ రసాయనం పూర్తిగా కనుమరుగైంది.

మండు వేసవిలోనే కేసులు..

జిల్లాలో గతేడాది రాజమహేంద్రవరంలోనే అత్యధికంగా 73 డెంగీ కేసులు నమోదయ్యాయి. కాకినాడ, అమలాపురం నగరాల్లోనే 178, , రాజానగరంలో 22 కేసులు బయటపడ్డాయి. మిగతాచోట్ల ఒకటి నుంచి అయిదు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభానికి ముందే ఉమ్మడి జిల్లాలో జనవరి నుంచి ఈ నెల 28 వరకు 53 డెంగీ, రెండు మలేరియా కేసులు రావడంతో ఆరోగ్యశాఖ ఉలిక్కిపడింది. రాజమహేంద్రవరం అర్బన్, గ్రామీణం, కాకినాడ నగరం, తుని, అమలాపురం, రావులపాలెం, కొవ్వూరు, రామచంద్రపురం తదితర ప్రాంతాల్లో ఈ కేసులు బయటపడడం, ఇవన్నీ అధికారికంగా ఆరోగ్యశాఖకు వచ్చిన లెక్కలు. ఇక డెంగీ, మలేరియాతో  ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నవారు ఎందరో ఉన్నారు. మండు వేసవిలోనే డెంగీ కేసులు రావడం చూస్తుంటే ఇక వర్షాకాలంలో పరిస్థితిని తలచుకుంటే ఆందోళన కలిగిస్తోందంటున్నారు.

పరిశుభ్రతపై అవగాహన పెంచుతున్నాం..

నగరపాలక/పురపాలకసంఘాలు, పంచాయతీల్లో పారిశుద్ద్య పరిస్థితులు మెరుగుపడేలా అధికార యంత్రాంగంతో ఇప్పటికే సదస్సులు పూర్తి చేశాం. వైద్య సిబ్బందితో కలిసి వార్డుల్లో పరిశుభత్రపై అవగాహన తీసుకొచ్చేలా పర్యటిస్తున్నాం. అన్ని పీహెచ్‌సీలు, సామాజిక ఆసుపత్రుల్లో డెంగీ, మలేరియా పరీక్షలు నిర్వహించేలా అవసరమైన రాపిడ్‌/స్లైడ్‌ కిట్‌లు అందుబాటులో ఉంచాం. ప్రాథమికంగా వైద్య పరీక్షల్లో సందేహం ఉంటే రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, రామచంద్రపురం, తుని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలీసా పరీక్షలు పెంచాం. ప్రధానంగా దోమలు వృద్ధి చెందకుండా స్థానిక సంస్థలు అవసరమైన చర్యలు చేపట్టాల్సి ఉంది. అవసరమైన రసాయనాలు కూడా సరఫరా చేస్తున్నాం. మురుగునిల్వల గుంతలు, పూడికతీత లేని కాలువలను ఆరోగ్యసిబ్బంది గుర్తించి సంబంధిత సంస్థలకు తెలియజేసి శుభ్రత పనులు చేయించేలా చర్యలు తీసుకుంటున్నాం.

 ఎస్‌.భాస్కరరావు, జిల్లా మలేరియా అధికారి, కాకినాడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు