logo

విత్తం లేదని వరద ఆగదుగా!

ఏటా జులై మాసం వచ్చిందంటే చాలు బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అనేక లంక ప్రాంతాలు బితుకుబితుకుమంటాయి.

Published : 29 May 2024 03:29 IST

తాత్కాలిక పనులతో ఎన్నాళ్లిలా
ప్రతిపాదనల వైపు కన్నెత్తి చూడని ప్రభుత్వం

సుందరపల్లి వద్ద ఇసుక బస్తాలతో అడ్డుకట్ట

ఈనాడు, రాజమహేంద్రవరం: ఏటా జులై మాసం వచ్చిందంటే చాలు బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అనేక లంక ప్రాంతాలు బితుకుబితుకుమంటాయి. భారీ ఎత్తున ప్రవాహం చుట్టుముట్టేయడం..పంట నష్టాలు, బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోవడం వంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఏటిగట్లు తీసికట్టుగా ఉన్నాయి. రెండేళ్ల క్రితం 36 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో అనేక చోట్ల నీళ్లు లీకై ఏటిగట్ల బలహీనతలను ఎత్తిచూపాయి. అప్పటికప్పుడు ఇసుక బస్తాలు, సర్వేబాదులు వేసి అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టారు. శాశ్వత పరిష్కారం లేదు. తాత్కాలిక పనులకు  రూ.2 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలైతే పంపారు. ఇటీవల జలవనరుల శాఖ అధికారులు వరద సన్నద్ధతపై సమావేశం నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఇసుక బస్తాలు, సర్వేబాదులు, పరికరాలు అందుబాటులో ఉంచాలని మాత్రమే నిర్ణయించారు.

ప్రమాద ఘంటికలే..

ఉమ్మడి జిల్లాలో గత వరదల కాలంలో ఏటిగట్లు బలహీనపడిన చోట ఇప్పటివరకు శాశ్వత చర్యలు లేవు. ప్రస్తుతం అయిదు ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ఫ్లడ్‌ స్టోర్ల వద్ద సామగ్రి సిద్ధం చేయాలని నిర్ణయించారు.

  •  కె.గంగవరం మండలంలోని కూళ్ల, సుందరపల్లి వద్ద ఓ మాదిరి వరదకే గట్టు నుంచి మట్టి ఒండులుగా విడిపోతూ కోతకు గురవుతోంది. రెండేళ్ల క్రితం వచ్చిన భారీ ప్రవాహానికి రాజోలు మండలం పరిధిలో మూడు చోట్ల గట్టు నుంచి నీరు బయటకురావడంతో అంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు.
  •  ఐ.పోలవరం మండలం పాత ఇంజిరం వద్ద (బోలావారిమండి) స్లూయిస్‌ దెబ్బతిని అందులోంచి వరద జలాలు బయటకు పోటెత్తాయి. ఇసుక బస్తాలు వేసి తాత్కాలిక చర్యలే చేపట్టారు.

మరమ్మతులకు ప్రతిపాదనలు

వరదలు వచ్చినప్పుడు గత అనుభవాల రీత్యా తాత్కాలిక చర్యలు చేపట్టాలని నిర్ణయించాం. అయిదారు చోట్ల సమస్యాతక పరిస్థితులున్నాయి. మరమ్మతులకు ఒక్కో చోట రూ.40 లక్షల చొప్పున అవసరమని ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం. మంజూరైన వెంటనే పనులు చేపడతాం.

 శ్రీనివాసరావు, పర్యవేక్షక ఇంజినీరు, జలవనరుల శాఖ, ధవళేశ్వరం సర్కిల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు