logo

పింఛనుదారులకు ఈసారీ పాట్లు తప్పవా!

సామాజిక భద్రత పింఛను డబ్బులు తీసుకునేందుకు రెండు నెలలు పింఛను డబ్బుల కోసం లబ్ధిదారులు అవస్థలు పడ్డారు.

Published : 29 May 2024 04:00 IST

న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం

బ్యాంకు వద్ద లబ్ధిదారుల పడిగాపులు (పాతచిత్రం)

సామాజిక భద్రత పింఛను డబ్బులు తీసుకునేందుకు రెండు నెలలు పింఛను డబ్బుల కోసం లబ్ధిదారులు అవస్థలు పడ్డారు. ముఖ్యంగా వృద్ధాప్య పింఛను తీసుకునేందుకు మండుటెండలో వచ్చి వృద్ధులు నానాయాతన అనుభవించారు. ఈసారీ లబ్ధిదారులు పాట్లు తప్పేట్లు లేదు. జూన్‌ నెలకు సంబంధించి పింఛను సొమ్మును కూడా ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని నిర్ణయించింది.

రాజమహేంద్రవరం డివిజన్‌లో సామాజిక భద్రత పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులు 1,42,920 మంది ఉన్నారు. వీరిలో వృద్ధాప్య, వికలాంగ, వితంతు, ఒంటరిమహిళ, కళాకారులు, చర్మకారులు తదితర సామాజిక భద్రత పింఛను లబ్ధిదారులు ఒక్క రాజమహేంద్రవరం నగరంలోనే 29,583 మంది వరకు ఉన్నారు. వీరికి మొత్తం రూ.8,94,07,000 వరకు పింఛను సొమ్ము విడుదల చేయాల్సి ఉంది.

రెండు నెలల పాటు తిప్పలు

లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సచివాలయాల సిబ్బంది ద్వారా పింఛన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఏప్రిల్‌ నెలలో గ్రామ, వార్డు సచివాలయాలకు పింఛనుదారులను రప్పించి ప్రభుత్వం లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేసింది. బ్యాంకుల్లో నగదు ఉపసంహరణ విషయంలో సాంకేతిక సమస్య ఏర్పడిందంటూ గంటల తరబడి లబ్ధిదారులు సచివాలయాల వద్ద పడిగాపులు పడే పరిస్థితి కల్పించింది. దీనిపై ఆందోళనలు వ్యక్తమవడంతో మే నెలకు సంబంధించిన పింఛన్లు డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా వారిని ఏకంగా బ్యాంకుల చుట్టూ తిప్పించింది. సామాజిక భద్రత పింఛన్లు ప్రత్యేక కేటగిరి కింద ఉన్న కొందరు లబ్ధిదారులకు మాత్రమే ఇళ్ల వద్ద సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేసి.. మిగతా వారందరికీ బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసింది. గత నెల దివ్యాంగులు, సైనిక సంక్షేమం కింద పింఛను పొందుతున్నవారు, అనారోగ్య కారణాల రీత్యా మంచం పైనుంచి లేవలేనిస్థితిలో ఉన్నవారు తదితరులు కొంతమందిని ప్రత్యేక కేటగిరి కింద గుర్తించి వారికి మాత్రమే ఇళ్ల వద్ద పింఛను పంపిణీ చేశారు. మిగతా వారందరికీ వారి బ్యాంకు ఖాతాలో పింఛను డబ్బులు జమ చేయడంతో వాటిని తీసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చాలామందికి బ్యాంకు వ్యవహారాలపై అవగాహన లేక నగదు ఉపసంహరణకు అవస్థలు పడ్డారు. ఈసారీ ఇదే పరిస్థితి ఉంటే ఇబ్బందేనని పలువురు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయాల సిబ్బంది ద్వారా లబ్ధిదారులందరికీ వారి ఇళ్ల వద్ద పింఛను అందించేలా ఏర్పాటు చేయాలని పలువురు పింఛనుదారులు అధికారులను కోరుతున్నారు. జూన్‌ నెలకు సంబంధించిన సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ బ్యాంకుల ద్వారానే జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించడంతో తమ బాధలు వినేదెవరని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని