logo

కీలక దశ.. అడుగులు వడివడిగా..

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాల వెల్లడికి గడువు సమీపించింది.

Published : 29 May 2024 04:07 IST

కౌంటింగ్‌ ఏర్పాట్లపై సూక్ష్మస్థాయి కార్యాచరణ 

కౌంటింగ్‌ అధికారుల విధులు, బాధ్యతలు వివరిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత

రాజమహేంద్రవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాల వెల్లడికి గడువు సమీపించింది. జూన్‌ 4న నన్నయ విశ్వవిద్యాలయంలోని కౌంటింగ్‌ కేంద్రాల్లో జరిగే ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లపై సూక్ష్మస్థాయి కార్యాచరణ ప్రణాళికను జిల్లా ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. కౌంటింగ్‌ రోజున ఎవరు ఏఏ విధులు నిర్వర్తించాలనే దానిపై స్పష్టత ఇచ్చారు. శాఖల వారీగా చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు.

కౌంటింగ్‌ అధికారుల విధులు, బాధ్యతలపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాధవీలత మంగళవారం కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీలకమైన కౌంటింగ్, ఫలితాల ప్రకటనకు సమయం సమీపిస్తున్నందున ఎవరూ ఏఏ విధులను నిర్వర్తించాలనే విషయమై ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు కౌంటింగ్‌పై అవగాహన కల్పించారు.

ఎవరెవరికీ ఏయే బాధ్యతలంటే..

  • నన్నయ విశ్వవిద్యాలయం ఆవరణలో రెండు అంబులెన్సులు, ప్రతి కౌంటింగ్‌ హాలు వద్ద మెడికల్‌ బృందం ఏర్పాటు చేసే బాధ్యతలు డీఎంహెచ్‌వోకు అప్పగించారు. కౌంటింగ్‌ రోజు అత్యవసర వైద్యసేవల కోసం జీఎస్‌ఎల్‌ ఆసుపత్రితో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.
  • విద్యుత్తు సరఫరాలో అటంకాలు లేకుండా ఈపీడీసీఎల్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌కు, తాగునీటి ఏర్పాట్ల విషయంలో డ్వామా పీడీకి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.
  • అభ్యర్థులు, ఏజెంట్లను కౌంటింగ్‌ కేంద్రం వద్దకు తీసుకురావడానికి దివాన్‌చెరువు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే పార్కింగ్‌ స్థలంలో బస్సుల సిద్ధం చేసే బాధ్యతలను జిల్లా రవాణా అధికారికి అప్పగించారు.
  • జిల్లా గ్రామపంచాయతీ అధికారి ఆధ్వర్యంలో కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఇవీ ఏర్పాట్లు

  • విశ్వవిద్యాలయం పరిపాలన భవనం రెండో అంతస్తులో పోస్టల్‌ బ్యాలెట్, ఈటీపీబీఎస్‌ ఓట్లు లెక్కింపు నిర్వహించనున్నారు. 50 చొప్పున పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలు బండిల్స్‌గా కట్టి 14 ప్లస్‌ 4 టేబుల్స్‌ ద్వారా ఓట్ల లెక్కింపు, తిరస్కరించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు సీలింగ్‌ వరకు ప్రణాళిక సిద్ధం చేశారు. కౌంటింగ్‌ సిబ్బంది హాజరు నమోదు, గుర్తింపు కార్డుల జారీ ఇతర అనుబంధ ఏర్పాట్లు, నివేదికలు, రౌండ్‌ వారీగా ఫలితాల ప్రకటన కోసం ఎవరు ఏ విధులు చేపట్టాలో సమగ్రంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
  • ఈవీఎం యూనిట్‌లలో పోలైన ఓట్లు లెక్కింపు కోసం నిర్ధిష్టమైన కార్యాచరణపై ఆయా నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సిబ్బందికి విధుల కేటాయింపులో భాగంగా ఆయా శాఖల అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
  • నన్నయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌ ప్రధాన మార్గంలో కౌంటింగ్‌ సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లకు గుర్తింపు కార్డు ఉన్నవారిని కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించేందుకు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ హోదా అధికారిని నియమించారు.
  • జూన్‌ 4న కౌంటింగ్‌ నేపథ్యంలో 2న లెక్కింపు నమూనా ప్రక్రియ ఉదయం 9 నుంచి నిర్వహిస్తారు. దీనికి కౌంటింగ్‌ సిబ్బంది అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్‌ ఆదేశించారు. దీనికోసం కలెక్టరేట్‌ నుంచి, దివాన్‌ చెరువు వద్ద బస్సులు అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని