logo

నెత్తు‘రోడ్డు’తున్నాయ్‌!

సవ్యంగా లేని దారులు.. వాహనాలు నిర్లక్ష్యంగా నడిపే చోదకులు.. కనీస విశ్రాంతి ఇవ్వకుండా విధులకు వెళ్లమంటున్న యాజమాన్యాలు.. రహదారి భద్రత నిబంధనలపై అవగాహన లేమి.

Updated : 29 May 2024 05:25 IST

ప్రమాదాలతో గాల్లో కలుస్తున్న ప్రాణాలు
 వీడని నిర్లక్ష్యం.. రహదారి భద్రతలో వైఫల్యం
ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, దానవాయిపేట

పి.గన్నవరం మండలం ఊడిమూడి వద్ద ఆగిఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

సవ్యంగా లేని దారులు.. వాహనాలు నిర్లక్ష్యంగా నడిపే చోదకులు.. కనీస విశ్రాంతి ఇవ్వకుండా విధులకు వెళ్లమంటున్న యాజమాన్యాలు.. రహదారి భద్రత నిబంధనలపై అవగాహన లేమి.. కారణాలేమైతేనేం రహదారులపై రుధిర ధారలు పారుతున్నాయి. ఆనందంగా సాగిపోతున్న ప్రయాణాల్లో అంతలోనే అంతులేని విషాదం కమ్మేస్తోంది. అయినవారిని కోల్పోయిన కుటుంబాలు జీవితాంతం కోలుకోలేని శోకసంద్రంలో మునిగిపోతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న వరుస ప్రమాదాలు ఉలికిపాటుకు గురిచేస్తున్నాయి. 

నెత్తుటి మరకలు..

 • ఆరుగురి ప్రాణాలు ఆవిరి: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఊడిమూడి వద్ద ఈనెల 14న ఆగిఉన్న ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. చికిత్సపొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. రహదారి చెంత జట్టు కూలీలు ట్రాక్టర్‌లో ధాన్యం బస్తాలు వేసి పగ్గం కడుతుండగా.. రాజోలు నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
 • విశ్రాంత న్యాయమూర్తితో సహా మరొకరు..: కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం సమీప జాతీయ రహదారి వద్ద ఈనెల 26న జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్రాంత జడ్జి వి.మోహన్‌కుమార్, కారు డ్రైవర్‌ శ్రీను మృతిచెందారు. వీరి కారును వెనుక నుంచి వస్తున్న ప్రైవేటు బస్సు ఢీకొంది. దీంతో అదుపుతప్పి మరో వాహనంపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
 • దేవరపల్లి మండలం బందపురం సమీప హైవేపై జనవరి 2న రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన 19 నెలల చిన్నారితో సహా ముగ్గురు మృత్యువాత పడ్డారు.

దేవరపల్లి మండలం బందపురం సమీపంలో జాతీయ రహదారిపై ఢీకొని ధ్వంసమైన కార్లు

తరచూ ఘటనలు జరిగే ప్రాంతాలు

 • కాకినాడ జిల్లా: తుని, అన్నవరం, కత్తిపూడి, గొల్లప్రోలు, ప్రత్తిపాడు, జగ్గంపేట, తాళ్లరేవు
 • తూర్పుగోదావరి: రాజమహేంద్రవరం, రాజానగరం, దేవరపల్లి, నల్లజర్ల, గోపాలపురం పరిధి
 • కోనసీమ: ఐ.పోలవరం, ముమ్మిడివరం, అమలాపురం, రావులపాలెం. (కేంద్ర పాలిత ప్రాంతంలోని యానాంలో కూడా తీవ్రత ఎక్కువగానే ఉంది.)

ప్రమాదాలకు కారణాలు ఇవే..

 • మితిమీరిన వేగంతో వాహనం నడపడం
 • డ్రైవింగ్‌లో చోదకుని నిర్లక్ష్యం 
 • నైపుణ్యం లేనివారు బండి తీయడం
 • అధ్వాన రహదారులు
 • మద్యం మత్తు.. చరవాణిలో మాట్లాడుతూ ప్రయాణించడం
 • వాహనాల సామర్థ్యం సరిగ్గా లేకపోవడం 
 • ట్రాఫిక్‌ సమస్యలు  
 • రహదారి భద్రత నిబంధనలపై అవగాహన లేమి
 • జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌), రాష్ట్రీయ రహదారులు (ఎస్‌హెచ్‌) కొంతవరకు బాగానే ఉన్నా.. జిల్లా- మండల- గ్రామీణ రహదారులు గుంతలు పడి అధ్వానంగా ఉన్నాయి. కొన్ని కీలక మార్గాల నిర్మాణాల్లో ఏళ్లుగా జాప్యమే. రాకపోకల క్రమంలో ప్రమాదాలు తప్పడంలేదు.
 •  అపసవ్య దిశలో రాకపోకలు సాగించడం.. శిరస్త్రాణం, సీటు బెల్ట్‌లు పెట్టుకోకుండా దూసుకెళ్తుండంతో ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ నష్టానికి దారితీస్తోంది.
 •  నిర్దేశిత పార్కింగ్‌ ప్రాంతాల్లో కాకుండా జాతీయ రహదారి, పలు ప్రాంతాల్లో రోడ్లపైన, వాటిని ఆనుకుని వాహనాలు నిలిపివేస్తున్నారు. కనీసం అప్రమత్తం చేసేలా ఇండికేటర్లు, స్టిక్కరింగ్‌తో కూడిన ట్రయాంగిల్‌ గుర్తులూ వాడకపోవడంతో వేగంగా వస్తున్న వాహనాలు నిలిపి ఉన్నవాటిని గుర్తించలేక ఢీకొట్టి ప్రాణాలు కోల్పోతున్నారు. వాహనాలకు ముందు వెనక పసుపు, ఎరుపు రంగులతో రేడియం స్టిక్కర్లు (రిఫ్లెక్టర్లు) ఉన్నా అవి నాసిరకానివి కావడం.. దుమ్ముధూళితో ఉండడం వల్ల చీకట్లో వాహనం ఉందోలేదో తెలుసుకోలేని పరిస్థితి.

నియంత్రణకు చర్యలు

జిల్లాలో ప్రస్తుతం 15 బ్లాక్‌ స్పాట్లు ఉన్నాయి. తరచూ ప్రమాదాలు జరుగుతున్న మరో 17 బ్లాక్‌ స్పాట్లు గుర్తించి రిజిస్ట్రేషన్‌కు పంపించాం. గతేడాది ప్రమాదాలు 373 జరిగితే ఈఏడాది 286కి తగ్గాయి. మరణాలు 152 నుంచి 104కి తగ్గాయి. గాయపడిన వారి సంఖ్య 353 నుంచి 309కి తగ్గింది. కీలక మార్గాల్లో హెచ్చరిక బోర్డులు, డ్రమ్ముల ఏర్పాటు.. మలుపుల్లో ముళ్లపొదలు తొలగించడం.. సర్వీసు రోడ్ల దగ్గర స్పీడ్‌ బ్రేకర్ల ఏర్పాటు.. వాహనాలు నడిపేవారిని అప్రమత్తం చేసే చర్యలతో ఈ ఫలితాలు సాధించగలిగాం. హెల్మెట్లు, సీట్‌ బెల్టులు పెట్టుకుని అప్రమత్తంగా నడిపితే చాలావరకు ప్రమాదాలు తగ్గించవచ్చు. ప్రాంగణాలు అందుబాటులో లేక రోడ్ల పక్కనే దాబాల దగ్గర లారీలు నిలపడం సమస్యగా మారుతోంది. వీటిపైనా దృష్టిసారిస్తాం.  

పి.జగదీష్, ఎస్పీ, తూర్పుగోదావరి జిల్లా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు