logo

సాగుబాటలో సవాళ్లు!

జిల్లాలో ఖరీఫ్‌ సాగుకు ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 4న వెలువడనున్న నేపథ్యంలో ప్రస్తుతం సంధికాలం నడుస్తోంది.

Published : 29 May 2024 03:50 IST

జిల్లాలో ఖరీఫ్‌కు భారీ ప్రణాళిక
జూన్‌ 15 తర్వాతే నారుమడులు
న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్‌

జిల్లాలో ఖరీఫ్‌ సాగుకు ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 4న వెలువడనున్న నేపథ్యంలో ప్రస్తుతం సంధికాలం నడుస్తోంది. జూన్‌ ఒకటి నుంచి గోదావరి కాలువలకు నీటిని విడుదల చేయడం రివాజుగా ఉన్నా.. ఈ ఏడాది 15 తర్వాత గాని  నీరిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరో పక్క ఏలేరు ప్రస్తుతం డెడ్‌ స్టోరేజిలో ఉండటం, పంపా రిజర్వాయర్‌లో నీటి నిల్వలు లేకపోవడం వంటివి ఖరీఫ్‌ సాగుపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. జూన్‌ 15 నుంచి నారుమడులు సిద్దం చేసేసేలా యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. మెట్ట ప్రాంతాల్లో ఆగస్టు 31 నాటికి నాట్లు పూర్తి చేయాలని భావిస్తోంది.

ఇదీ ప్రణాళిక..

జిల్లాలో 28,616 హెక్టార్లలో వెదజల్లే విధానం, 29,994 హెక్టార్లలో బెంగాల్‌ విధానంలో వరుస క్రమంలో నాట్లు వేయడం, 27,451 హెక్టార్లలో నారు ద్వారా నాట్లు వేసేలా ప్రణాళికలు తయారు చేశారు. ఈ ఖరీఫ్‌లో 67వేల మందికి సీసీఆర్‌సీ కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా చేసుకున్నారు. వీరిలో 46వేల మందికి రూ.190 కోట్ల మేర రుణాలు కల్పించాలని యోచిస్తున్నారు.  వరితోపాటు ఇతర వ్యవసాయ పంటలు సాధారణ విస్తీర్ణం 2.40 లక్షల ఎకరాలు కాగా, 2.22 లక్షల ఎకరాల్లో  ఖరీఫ్‌ సాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దీనిలో 2.12 లక్షల ఎకరాల్లో వరి సాగు, మిగతా విస్తీర్ణంలో అపరాలు, ప్రత్తి, మొక్కజొన్న, చెరకు వంటి 11 రకాల వ్యవసాయ పంటల సాగు జరగనుంది.

41,522 క్వింటాళ్ల విత్తనాలు అవసరం..

జిల్లాలో 41,522 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని గుర్తించారు. రైతుల వద్ద 18,089 క్వింటాళ్లు, ప్రైవేటు డీలర్ల వద్ద 17,757 క్వింటాళ్లు, సహకార సంఘాల వద్ద 833 క్వింటాళ్లు, ఏపీఎస్‌ఎస్‌డీసీ వద్ద 4,843 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతోంది. ఈ విత్తనాలు ఏ మేరకు సరిపోతాయో చూడాలి.

ఎరువుల సరఫరా ఎలా..?:  ఖరీఫ్‌ సాగుకు 58,996 టన్నుల ఎరువులు అవసరమని గుర్తించారు. ప్రస్తుతం ఆర్బీకేల ద్వారా 17,812 టన్నుల ఎరువులు సరఫరాకు నిర్ణయించారు. సహకార సంఘాల వద్ద 7,252 టన్నులు, ప్రైవేటు డీలర్ల వద్ద 33,831 టన్నులు అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు. ఇది కేవలం ప్రణాళిక మాత్రమే. రానున్న రెండు నెలల్లో పూర్తిస్థాయిలో ఎరువులను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది.

ఉత్పాదకత పెంచడమే లక్ష్యం

ఖరీఫ్‌లో ధాన్యం ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు తయారు చేశాం. ఆరుతడి పంటలు ఎక్కువగా సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తాం. జూన్‌ 15 నుంచి నారుమడులు వేసేలా  ఏర్పాట్లు చేస్తాం. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుతాం. 

ఆరుతడి పంటలపై దృష్టి..

జిల్లాలో వరితో పాటు ఇతర వ్యవసాయ పంటలు సాధారణ విస్తీర్ణంలో 98 శాతం వరకు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎన్‌.విజయకుమార్, జిల్లావ్యవసాయ అధికారి, కాకినాడ
నారుమడులు త్వరగా సిద్ధం చేసే పరిస్థితి లేకపోతే వెదజల్లే విధానంలో నాట్లు వేసేలా ప్రణాళికలు తయారు చేశారు. పశ్చిమబెంగాల్‌ తరహాలో వరుసగా నాట్లు వేసే విధానాన్ని ఈసారి అమలు చేయాలని యోచిస్తున్నారు.  పూర్తిస్థాయిలో సాగునీరు లభ్యం కాకపోతే .. ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని భావిస్తున్నారు. ఎకర వరిసాగుకు వినియోగించే నీరు రెండున్న ఎకరాల ఆరుతడి పంటలకు సరిపోనున్న నేపథ్యంలో వీటిని ఎక్కువగా సాగు చేయాలని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు