logo

ఆర్భాటంగా ఆదేశాలు..అమలు చెత్తపాలు!

జిల్లాలోని కంపోస్టు యార్డులను ఎన్జీటీ బృంద సభ్యులు గతేడాది చివర్లో పరిశీలించారు. ప్రజారోగ్య రక్షణకు, కాలుష్య నివారణకు చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Published : 29 May 2024 03:55 IST

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్‌

అమలాపురంలోని డంపింగ్‌ యార్డులో పేరుకుపోయిన చెత్త

జిల్లాలోని కంపోస్టు యార్డులను ఎన్జీటీ బృంద సభ్యులు గతేడాది చివర్లో పరిశీలించారు. ప్రజారోగ్య రక్షణకు, కాలుష్య నివారణకు చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సత్వర చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. 15వ ఆర్థిక సంఘ నిధులు కేటాయిస్తున్నా.. పనులు కావడం లేదు. 

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఇలా..

జిల్లాలో అమలాపురం, మండపేట, రామచంద్రపురం, పురపాలికలు కాగా, ముమ్మిడివరం నగర పంచాయతీగా కొనసాగుతోంది. వీటిల్లో గడిచిన అయిదేళ్లలో వైకాపా సర్కారు చెత్తశుద్ధిపై కనీస దృష్టి సారించలేదు. కంపోస్టు యార్డుల్లో చెత్తను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తున్నా.. సద్వినియోగం చేసుకోవడంలో అయిదు సంవత్సరాలుగా వైకాపా సర్కారు పూర్తిగా విఫలం చెందిందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. డంపింగ్‌యార్డుల్లో వందల టన్నుల చెత్త పేరుకుని  పట్టణాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి.

జరిమానా విధిస్తామన్నా..

మార్గదర్శకాల ప్రకారం కంపోస్టు యార్డులు పచ్చదనంతో కనిపించాలని, లేదంటే జరిమానా విధిస్తామని ఇటీవల ఎన్జీటీ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో కళ్లు తెరిచిన అధికారులు ఆగమేఘాలపై చెత్తశుద్ధికి ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ నిధుల భారం మోయలేమని చేతులెత్తేశారు. చివరకు కేంద్రం 15వ ఆర్థిక సంఘ నిధులు వినియోగించుకోవాలని సూచించింది. ఇందులో కేంద్రం 33 శాతం, మిగిలిన 67 శాతం రాష్ట్ర ప్రభుత్వం, ఆయా పురపాలిక భరించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పనులు మందకొడిగా సాగుతున్నాయి.

అమలాపురం పురపాలికలో..

అమలాపురం మున్సిపాలిటీ పరిధిలో బైపాస్‌ రహదారిలో చెత్తను పోగేస్తున్నారు. ఇప్పటివరకు ఇక్కడ సుమారు 40 వేల మెట్రిక్‌ టన్నుల చెత్త కుప్పగాఉంది. ఇక్కడ శుద్ధిచేసే పనులకు సంబంధించి టన్నుకు రూ.600 నుంచి రూ.650 వరకు స్వచ్ఛాంధ్ర] కార్పొరేషన్‌ నుంచి చెల్లించేందుకు గుత్తేదారులకు పనులు అప్పగించారు. ఇక్కడ ఆరు నెలల కిందట యంత్రాలు బిగించి శుద్ధిపనులు చేపట్టారు. ఇప్పటివరకు కేవలం 20 శాతం మాత్రమే చెత్తను శుద్ధిచేసి కుప్పగా పోశారు. తూకం వేయకుండా పనులు చేపట్టడంతో బిల్లుల చెల్లింపులో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు సమాచారం. దీంతో గుత్తేదారులు పనులు నిలిపి వేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పురపాలికల్లో పేరుకుపోతున్న చెత్తను శుద్ధిచేసి కర్మాగారాలకు తరలించి, పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.

గతంలోనే ఆదేశాలున్నా..

జిల్లాలోని పురపాలికలు, నగర పంచాయతీ పరిధిలో నిత్యం 84 మెట్రిక్‌ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. ఇదంతా డంపింగ్‌ యార్డులకు తరలించి పోగు చేస్తున్నారే తప్ప..   శుద్ధిచేసే చర్యలు చేపట్టడం లేదు. గతంలో 13వ ఆర్థిక సంఘం సమయంలో పూర్తి నిధులు చెత్తశుద్ధికి వినియోగించుకోవాలని ఆదేశాలివ్వడంతో అప్పట్లో డంపింగ్‌యార్డుల్లో కొన్ని వసతులు కల్పించినా రోజువారీగా పోగవుతున్న చెత్తను శుద్ధి చేయడంలో మాత్రం సఫలీకృతం కాలేకపోయారు.

కాలుష్యమయంగా..

పురపాలికల్లో రోజువారీగా వస్తున్న చెత్తను శివారు ప్రాంతాల్లోని డంపింగ్‌యార్డుల్లో పోగు చేస్తున్నారు. దానికి నిప్పంటుకుని రావణకాష్టంలా కాలుతూనేఉంటోంది. దట్టమైన పొగ పరిసర వార్డుల్లోకి వస్తోంది. డంపింగ్‌ యార్డులకు వచ్చే చెత్తలో పలు రకాల వ్యర్థాలు ఉండటం, వాటికి నిప్పంటుకుని ఘాటైన వాసనతో కూడిన పొగ తమను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని పట్టణాల్లో నివాసం ఉంటున్నవారు వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు