logo

ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ముందే రావాల్సింది: వీహెచ్‌

ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి ఇంకా ముందు వస్తే ఈ ఎన్నికల్లో పరిస్థితి వేరుగా ఉండేదని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అభిప్రాయపడ్డారు.

Updated : 24 May 2024 07:53 IST

దేవీచౌక్‌(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి ఇంకా ముందు వస్తే ఈ ఎన్నికల్లో పరిస్థితి వేరుగా ఉండేదని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అభిప్రాయపడ్డారు. ఆలస్యంగా వచ్చినా వైకాపా ప్రభుత్వంపై ఆమె బాగా పోరాటం చేశారని తెలిపారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహం నమూనా పరిశీలించేందుకు గురువారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వచ్చిన ఆయన నగరంలోని రాజీవ్‌గాంధీ కళాశాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్‌ జైల్లో ఉన్నప్పుడు షర్మిల అన్న కోసం రాష్ట్రమంతటా పర్యటించారన్నారు. తర్వాత ఆమెకు రాజకీయంగా ఎటువంటి అవకాశం ఇవ్వలేదన్నారు. ఏపీ రాజకీయాల గురించి మాట్లాడటం సరికాదని, అయితే రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక సంఘటనల గురించి తనకు తెలుసన్నారు. 

పదేళ్లు మోదీ ఏం చేశారు: పదేళ్లు అధికారంలో ఉన్న మోదీ ఏం అభివృద్ధి చేశారని హనుమంతరావు ప్రశ్నించారు. యూపీఏ హయాంలోనే అభివృద్ధి అంతా జరిగిందన్నారు. భాజపా ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. ఇండియా కూటమి క్యాన్సర్‌ వంటిదని, పాకిస్తాన్‌ మద్దతుదారులంటూ మోదీ విమర్శించడాన్ని వీహెచ్‌ తప్పుబట్టారు. మోదీ, అమిత్‌షాలు మతాలు, కులాల మధ్య విద్వేషాలు సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. వారు మాటతీరు మార్చుకోవాలన్నారు. 400 సీట్లు వస్తే పీఓకేను స్వాధీనం చేసుకుంటామని చెబుతున్న భాజపా నాయకులు ఈ పదేళ్లు ఆ పని ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్‌ మాట్లాడుతూ దేశానికి భాజపా అరిష్టమన్నారు. పదేళ్ల పాలనలో కేవలం ధనవంతుల కోసమే ఆ పార్టీ పనిచేసిందని విమర్శించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని