logo

ఉపాధ్యాయులకూ పరీక్షే...!

ప్రస్తుతం పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఎఫ్‌ఏ-2 పరీక్షలు విద్యార్థులకే కాకుండా.. ఉపాధ్యాయులకూడా పరీక్షగానే ఉన్నాయి.

Published : 05 Dec 2022 06:16 IST

పరీక్ష విధానాన్ని పరిశీలిస్తున్న ఎంఈవో కిరణ్‌బాబు

అమలాపురం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ప్రస్తుతం పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఎఫ్‌ఏ-2 పరీక్షలు విద్యార్థులకే కాకుండా.. ఉపాధ్యాయులకూడా పరీక్షగానే ఉన్నాయి. ఇప్పటివరకు ప్రశ్నపత్రం చేతికి ఇస్తే వాటిని చూసి విద్యార్థులు సమాధానాలు రాసేవారు. ఇప్పుడు ప్రశ్నలను బోర్డుపై రాస్తే.. పిల్లలు వాటిని చూసి తెల్లకాగితాలపై రాసుకుని సమాధానాలు పూర్తి చేయాలి. శుక్రవారం నుంచి ప్రారంభమైన ఎఫ్‌ఏ-2 (ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌) పరీక్ష విధానం తీరుపై ఉపాధ్యాయులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్‌లో  ప్రశ్నపత్రాలు

ఎఫ్‌ఏ-2 పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రాలను పాఠశాలలకు ప్రభుత్వం సరఫరా చేయలేదు. పరీక్ష ప్రారంభం కావడానికి గంట ముందు ప్రధానోపాధ్యాయుల చరవాణికి వాట్సాప్‌లో ప్రశ్నపత్రం వస్తుంది. దాన్ని పాఠశాలలోని ఉపాధ్యాయులందరికీ పంపిస్తున్నారు. వారు గదుల్లో బోర్డులపై ప్రశ్నలను రాస్తుంటే విద్యార్థులు వాటిని చూసి రాసుకుని, జవాబులు రాయాల్సివస్తోంది. కొన్నిచోట్ల కొందరు ఉపాధ్యాయులు బోర్డుపై రాస్తుండగా, మరికొందరు చదివి వినిపిస్తున్నారు. ఇంకొందరు తమ సొంత ఖర్చుతో పరీక్ష గదిలో ఎంతమంది విద్యార్థులున్నారో అన్ని నకలు కాపీలు తీయించి విద్యార్థులకు అందజేస్తున్నారు. బోర్డుపై రాయడానికి కనీసం 20 నిమషాల సమయం పడుతుందని, దానిని విద్యార్థులు తిరిగి రాసుకోవడానికి మరో 20 నిమషాలు ఇలా సుమారు గంట వరకు సమయం వృథా అవుతోందని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు.

రోజుకో మార్పు..

పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఫార్మెటివ్‌-2 పరీక్షలు రెండు రోజులక్రితం ప్రారంభంకాగా.. నిర్వహణ తలనొప్పిగా మారిందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. రెండో రోజు శనివారం మరికొన్ని నిబంధనలను తీసుకురావడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు రాసిన ప్రశ్నపత్రాలను మూల్యాంకనం చేసి వారి తల్లిదండ్రులకు పంపించడం, ఆన్‌లైన్‌లో మార్కుల నమోదుకు తేదీలు నిర్ణయించడం వంటివాటిపై ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విద్యార్థులకు ప్రశ్నపత్రాలు అందించలేని స్థితిలో ప్రభుత్తం ఉందంటూ ఉపాధ్యాయులు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. పరీక్ష మొదటి రోజు రెండు పూటలకు సంబంధించిన పత్రాలు ఉదయం 8 గంటలకే ప్రధానోపాధ్యాయుల చరవాణికి వచ్చినా, రెండో రోజు మాత్రం ఉదయం 8.30 గంటలకు, మధ్యాహ్నం 1.30 గంటలకు వేరువేరుగా పంపించారని చెబుతున్నారు.

తప్పని  అవస్థలు

ఒకే ఉపాధ్యాయుడు రెండుమూడు తరగతులకు సంబంధించి ప్రశ్నపత్రాలు బోర్డుపై రాయాల్సిరావడం, విద్యార్థులు సరిగా రాసుకున్నారా, లేదా అనేది పర్యవేక్షించాల్సిరావడం కష్టతరంగా మారిందని వాపోతున్నారు. సీబీఏ(క్లాస్‌ రూం బేసిడ్‌ ఎసెస్‌మెంట్‌) పరీక్షలకు ఓఏంఆర్‌ జవాబు పత్రాల విధానం తీసుకొచ్చి రూ.లక్షలు ఖర్చుచేశారు. ఫార్మేటివ్‌ విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఒకటిరెండు తరగతులకు సంబంధించి శుక్రవారం ఇచ్చిన ప్రశ్నపత్రాల్లో కొన్ని బొమ్మలుకూడా ఉన్నాయి. వాటిని బోర్టుపై వేయాల్సిరావడం, తెలుగులో పేరాగ్రాఫ్‌ తరహా ప్రశ్నలు ఉండటం వాటిని బోర్డుపై రాయడానికే అధిక సమయం పట్టిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఎలా..?

 

అల్లవరం: ఓ పాఠశాలలో పరీక్ష రాస్తున్న విద్యార్థులు

ఈ పరీక్షను ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఎలా నిర్వహించాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా అనేక చోట్ల ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. వాట్సాప్‌లో వచ్చిన ప్రశ్నపత్రం చూసి బోర్డుపై రాస్తే.. విద్యార్థులు ప్రశ్నలు రాసుకుని.. వాటికి సమాధానాలు ఇస్తున్నారు. ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలల్లో అన్ని తరగతులవారికి బోర్డుపై రాయడమెలా సాధ్యమని పలువురు ప్రశ్నిస్తున్నారు. అన్ని తరగతులకు సంబంధించిన ప్రశ్న పత్రాలను జిరాక్స్‌ తీయించి విద్యార్థులకు అందజేయాల్సివస్తోందని, సొంతంగా డబ్బులు ఖర్చు చేయాల్సిందేనా అని ప్రశ్నిస్తున్నారు.


ముద్రణకు సమయం లేకనే..

ఫార్మేటివ్‌ పరీక్షల్లో మొదటిదానికి రెండో పరీక్ష నిర్వహణకు మధ్య సమయం తక్కువగా ఉన్న కారణంగా పరీక్ష పత్రాల ముద్రణకు సరిపడా సమయం లభించలేదు. దాంతో నేరుగా ఉపాధ్యాయుల వాట్సాప్‌కు ప్రశ్నపత్రం పంపిస్తున్నాం. దానిని వారు బోర్డుపై రాసి విద్యార్థులతో పరీక్ష నిర్వహిస్తున్నారు.

రవిసాగర్‌, డీఈవో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని