logo

షరా మామూలే..

తాళ్లపూడి మండలం బల్లిపాడు ఇసుక ఓపెన్‌ ర్యాంపులో అక్రమ ఇసుక దందా మళ్లీ మొదలైంది. గత నెల 28న ర్యాంపులోకి వెళ్లే రోడ్డును నీటితో తడుపుతూ వాటర్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ కె.దుర్గారావు గోదావరిలో పడి మృతిచెందారు.

Published : 01 Dec 2023 06:42 IST

బల్లిపాడులో యథేచ్ఛగా తవ్వకాలు

నిఘా విభాగం, న్యూస్‌టుడే: తాళ్లపూడి మండలం బల్లిపాడు ఇసుక ఓపెన్‌ ర్యాంపులో అక్రమ ఇసుక దందా మళ్లీ మొదలైంది. గత నెల 28న ర్యాంపులోకి వెళ్లే రోడ్డును నీటితో తడుపుతూ వాటర్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ కె.దుర్గారావు గోదావరిలో పడి మృతిచెందారు. అప్పటి నుంచి గత నెల 30 మధ్యాహ్నం వరకు ర్యాంపులో ఇసుక సరఫరా తాత్కాలికంగా నిలిపేశారు. మళ్లీ తవ్వకాలు, తరలింపు మొదలుపెట్టారు. వందలాది లారీలు ర్యాంపులోకి తరలించి, ఇసుక లోడింగ్‌ చేసి వేరే జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. పాత ఏజెన్సీ పేరుతో బిల్లులు ఇస్తున్నారు.

ప్రమాదాలు జరుగుతున్నా..

ఇటీవల కొవ్వూరుకు చెందిన ఓ ప్రైవేటు పాఠశాల బస్సు, ఇసుక లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బడి బస్సులోని 40 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రెండు రోజుల క్రితం ర్యాంపులో దుర్గారావు మృతిపై హోంమంత్రి తానేటి వనిత వెంటనే పరిహారం ప్రకటించారు. దీంతో అక్రమ ఇసుక దందా మరోసారి బట్టబయలైందని పలువురు విమర్శించారు. హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు, తరలింపు జరగడంపై పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఏమాత్రం స్పందించకపోవడం గమనార్హం. ఇటీవల తెదేపా, జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు. అప్పుడు ఒకరోజు విరామం ఇచ్చి మళ్లీ మొదలుపెట్టారు.

లంకభూములు కొట్టుకుపోయే ప్రమాదం..

గోదావరి వరదల సమయంలో లంకదిబ్బ కారణంగా వరదనీటి ప్రవాహం తక్కువగా ఉంటుంది. ఇదంతా తవ్వేస్తే తర్వాత వరద నీటి వేగం పెరిగి పక్కన గట్టు, దానికి ఆనుకుని ఉన్న లంకభూములు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఏదైతే మాకేంటి అన్నట్లు తవ్వేస్తున్నారు. భారీ ఇసుక లారీలు వెళ్లే క్రమంలో వేసిన రహదారి కుంగితే మళ్లీ కంకర వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు