logo

స్వామీ.. దర్యాప్తు భారం నీదే!

2020 సెప్టెంబర్‌ 5న అర్ధరాత్రి.. అప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆవరణలోని దివ్యరథం దగ్ధమైంది. 56 ఏళ్లపాటు స్వామికి వాహన సేవ అందించిన రథం ఇలా కావడం భక్తులకు ఆగ్రహం తెప్పించింది.

Updated : 01 Dec 2023 08:52 IST

అంతర్వేదిలో రథం దగ్ధమై ఏళ్లు దాటినా కిమ్మనని సర్కారు
ఈనాడు, కాకినాడ

2020 సెప్టెంబర్‌ 5న అర్ధరాత్రి.. అప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆవరణలోని దివ్యరథం దగ్ధమైంది. 56 ఏళ్లపాటు స్వామికి వాహన సేవ అందించిన రథం ఇలా కావడం భక్తులకు ఆగ్రహం తెప్పించింది. ఆందోళనలతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పది నెలల పాటు పోలీసు పికెట్‌ కొనసాగించాల్సి వచ్చింది. ఇది ప్రమాదమా..? కుట్రా? అనేది నేటికీ తేలలేదు. కేసును సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. మూడేళ్లు దాటినా ఆ పనిచేయలేదు. దోషులు ఎవరనేది తేల్చలేదు.

అంతర్వేది స్వామివారి దివ్యరథం దగ్ధమైన ఘటనకు సంబంధించి పోలీసుల విచారణలో వెలుగుచూసిన అంశాలు వెల్లడించలేదు. కేసు సీబీఐ స్వీకరించకపోవడం..దర్యాప్తు ముందుకు సాగకపోవడం విమర్శలకు తావిస్తోంది. సీఎం జగన్‌ ఆదేశాలతో మంత్రుల హోదాలో వెల్లంపల్లి శ్రీనివాసరావు, వేణుగోపాలకృష్ణ, ధర్మాన కృష్ణదాస్‌తోపాటు ఇతర నేతలు అప్పట్లో హాజరై కాలిన రథాన్ని పరిశీలించారు. దర్యాప్తు జరిపి దోషులను శిక్షిస్తామని ప్రకటించారు.

నిగ్గుతేలుస్తారా..? నీరుగారుస్తారా..?

అప్పట్లో అంతర్వేది ఆలయ ఇన్‌ఛార్జి ఏసీ చక్రధరరావు, మరో ఇద్దరు సిబ్బందిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. వీరికి మళ్లీ పోస్టింగులు ఇచ్చారు. మతిస్థితిమితం లేని వ్యక్తి ఆలయ పరిసరాల్లో ఆ రోజు రాత్రి తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 2021 జులైలో వాహనం కిందపడి ఆయన మృతిచెందడంతో అప్పట్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. డీజీపీ కార్యాలయం నుంచి సీబీఐకి లేఖ రాసినట్లు అప్పట్లో ప్రకటించినా.. నేటికీ సీబీఐ రంగంలోకి దిగలేదు. కొత్త రథం నిర్మించి 2021 ఫిబ్రవరి 19న సీఎం జగన్‌ ప్రారంభించినా, పాత రథం కాలిపోవడానికి కారణాలపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని