logo

మేమొస్తాం.. కష్టాలు తీరుస్తాం

ఆత్మీయ పలకరింపులు.. అఖండ స్వాగతాలు.. మంగళ హారతులు.. తీన్మార్‌ డప్పులు.. తెదేపా-జనసేన జెండాల రెపరెపలు.. బాణసంచా కాల్పుల హోరు నడుమ గురువారం తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర సాగింది.

Published : 01 Dec 2023 06:58 IST

వివిధ సామాజిక వర్గాలకు లోకేశ్‌ భరోసా
ఈనాడు, రాజమహేంద్రవరం; న్యూస్‌టుడే, తాళ్లరేవు, ముమ్మిడివరం, ఐ.పోలవరం

త్మీయ పలకరింపులు.. అఖండ స్వాగతాలు.. మంగళ హారతులు.. తీన్మార్‌ డప్పులు.. తెదేపా-జనసేన జెండాల రెపరెపలు.. బాణసంచా కాల్పుల హోరు నడుమ గురువారం తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర సాగింది. కల్లుగీత కార్మికులు, రైతులు, మత్స్యకారులు, వ్యాపారులు, మహిళలు సంఘీభావంగా అడుగులు వేశారు. గత కొన్నేళ్లుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని.. కష్టాలన్నీ తీరుస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెంలో తొలుత యాత్ర ప్రారంభమైంది. వేలాది మంది విద్యార్థులు మమేకమయ్యారు. 21 కి.మీ మేర సాగిన యాత్రలో ప్రతి గ్రామం వద్ద లోకేశ్‌ రాకకోసం మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపై వేచి చూడడం కనిపించింది. లచ్చిపాలెం, బాపనపల్లి, జార్జిపేట వైజంక్షన్‌, పి.మల్లవరం, సుంకటరేవు, గాంధీనగర్‌, సంతపేట, తాళ్లరేవు సెంటర్‌, సీతారాంపురం, కోరంగి మీదుగా యాత్ర సాగింది. కోరంగిలో భోజన విరామ సమయంలో శెట్టిబలిజ సామాజిక వర్గీయులతో సమావేశం నిర్వహించారు. అనంతరం తిరిగి పునఃప్రారంభించారు. చొల్లంగిపేట వద్ద లోకేశ్‌ రాత్రి బస చేశారు.

గుంతల్లో రోడ్డు వెతుక్కోవాలి

వైకాపా పాలనలో రోడ్లను అభివృద్ధి చేయలేదని.. చివరికి గుంతల్లో వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని లోకేశ్‌ పేర్కొన్నారు. గుత్తేదారులకు రూ.2 లక్షల కోట్ల బకాయిలు చెల్లించకపోవడం వల్ల ముందుకు రావడంలేదన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చాక రోడ్లన్నీ అభివృద్ధి చేస్తామన్నారు.

స్థానికంగా ఉద్యోగాల కల్పన

తాళ్లరేవులో రిలయన్స్‌, జీఎస్పీ, ఓఎన్జీసీ సంస్థలున్నా స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం లేదని యువత తెలపగా.. తమ ప్రభుత్వం వచ్చాక చర్చించి అవకాశాలు కల్పిస్తామన్నారు. అప్పటివరకు యువగళం నిధి కింద రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని.. ఏటా కొలువుల భర్తీ చేపడతామన్నారు.  

మీరు కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు

తాళ్లరేవు మండలం కోరంగి వద్ద శెట్టి బలిజ సామాజిక వర్గీయులతో లోకేశ్‌ సమావేశం నిర్వహించారు. ‘‘శెట్టిబలిజలకు మొహమాటం ఎక్కువ అని పెద్దలన్నారు.. కాదు ఆత్మగౌరవం ఎక్కువ. ముక్కుసూటిగా ఉంటారు.. కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు.. పది మందికీ సేవచేయాలనే తపన ఉన్నవాళ్ల’’ని లోకేశ్‌ పేర్కొన్నారు.


తన్నే దున్నపోతు జోలికి వెళ్లరు..


 

గీత కార్మికుడు చెట్టు పైనుంచి ప్రమాదవశాత్తు పడిపోతే ఇచ్చే పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచాలని కొప్పుశెట్టి సుబ్రహ్మణ్యేశ్వరరావు కోరగా.. లోకేశ్‌ స్పందిస్తూ.. మీరంతా తన్నే దున్నపోతు(వైకాపాను ఉద్దేశించి) జోలికి వెళ్లరని, ఏం అడిగినా చంద్రబాబు కాదనరనే దీమా ఉందన్నారు. తెదేపా-జనసేన ప్రభుత్వం వచ్చిన తరువాత తొలుత రూ.5 లక్షలు బీమా చెల్లిస్తామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తరువాత రూ.10 లక్షలకు పెంచుతామన్నారు. చక్కటి పాలసీలతో కల్లుగీత కార్మికులకు మేలు చేస్తామన్నారు.


కార్పెంటర్లకు చంద్రన్న బీమా

వైకాపా దుర్మార్గ పాలనతో చేతి వృత్తులన్నీ సర్వనాశనమైపోయాయని, ఆయా రంగాలపై ఆధారపడిన కుటుంబాలు దారుణంగా దెబ్బతిన్నాయని లోకేశ్‌ పేర్కొన్నారు. ఆదరణ పథకం కొనసాగిస్తామని, కార్పెంటర్లకు చంద్రన్న బీమా పథకం వర్తింపజేస్తామన్నారు. వడ్రంగి ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

కార్మికుల కష్టాన్నీ దోచుకుంటున్న వైకాపా

వైకాపా ఇసుక మాఫియా కారణంగా సామాన్యులు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేకుండా పోయిందని, భవన నిర్మాణ కార్మికులు ఉపాధికి దూరమయ్యారని లోకేశ్‌ అన్నారు. ఇసుక నావ కార్మికుల కష్టాన్నీ దోచుకోవడం దుర్మార్గమని.. వారిని ఆదుకుంటామన్నారు.

రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానం

రాష్ట్రంలో జగన్‌ పాలన వల్ల వ్యవసాయ రంగం నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలో మూడో స్థానం, కౌలు రైతుల బలవన్మరణాల్లో రెండోస్థానంలో ఉన్నామన్నారు. పంటలకు గిట్టుబాటు ధర చెల్లించకుండా, ప్రకృతి వైపరీత్యాల సమయంలో దెబ్బతిన్నవారికి పెట్టుబడి రాయితీలు, బీమా ఇవ్వకుండా అన్యాయం చేశారన్నారు. తాము వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని, రైతుమిత్ర గ్రూపులకు రుణాలు అందజేస్తామన్నారు.


ప్రభుత్వం తనపై 22 కేసులు పెట్టిందని లోకేశ్‌ అన్నారు.. తెదేపా నాయకులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అయ్యన్నపాత్రుడిపై కూడా పెట్టారన్నారు. చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టి, వ్యవస్థలను మేనేజ్‌ చేసి 53 రోజులు జైలులో నిర్బంధించారన్నారు. యనమల రామకృష్ణుడు, చిన్నరాజప్ప ఓ వివాహానికి వెళ్తే అట్రాసిటీ కేసు నమోదు చేశారన్నారు. * కోరంగి వద్ద పెద్దబొడ్డు వెంకటాయపాలెం మత్స్యకారులు లోకేశ్‌కు చేప బహుమతిగా ఇవ్వగా.. శెట్టిబలిజల సమావేశంలో ఓ కార్మికుడు ఇచ్చిన కల్లు లోకేశ్‌ తాగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని