logo

అధికారులూ.. అప్రమత్తంగా ఉండండి

మిగ్‌జాం తుపాను పట్ల అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి జిల్లావాసులకు అవసరమైన అన్ని సదుపాయాలు సమకూర్చాలని ప్రత్యేకాధికారి జి.జయలక్ష్మి ఆదేశించారు.

Updated : 06 Dec 2023 05:34 IST

కంట్రోల్‌ రూంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ప్రత్యేకాధికారి జయలక్ష్మి, కలెక్టర్‌ తదితరులు

అమలాపురం కలెక్టరేట్‌: మిగ్‌జాం తుపాను పట్ల అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి జిల్లావాసులకు అవసరమైన అన్ని సదుపాయాలు సమకూర్చాలని ప్రత్యేకాధికారి జి.జయలక్ష్మి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ హిమాన్షుశుక్లా, మంత్రి విశ్వరూప్‌తో కలిసి కలెక్టరేట్‌లో తుపాను సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ప్రభావిత ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. కళ్లాల్లో ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన మిల్లులకు తరలించాలన్నారు. డీఆర్వో సత్తిబాబు ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ హిమాన్షుశుక్లా మాట్లాడుతూ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు అందించడంలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైఉందన్నారు. ఎంపీడీవోల పర్యవేక్షణలో చేలల్లో ముంపునీరు డ్రెయిన్లలోకి దిగేలా ఉపాధి కూలీలతో తూడు, గుర్రపు డెక్క తొలగించాలని ఆదేశించామన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రజలకు నిరంతర విద్యుత్తు అందించేలా ట్రాన్స్‌కో సిబ్బంది పనిచేస్తున్నారన్నారు.

ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేస్తాం..

అల్లవరం: జిల్లావ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేస్తామని మంత్రి విశ్వరూప్‌ తెలిపారు. మంగళవారం జిల్లా ప్రత్యేకాధికారి, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, కలెక్టర్‌ హిమాన్షుశుక్లాతో కలిసి అల్లవరం మండలం రెళ్లుగడ్డలో ముంపునకు గురైన వరి పొలాలను పరిశీలించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 9,300 ఎకరాల్లో వరి చేలు ముంపుబారిన పడినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామన్నారు. మిగ్‌జాం తుపాను ప్రభావంతో ముంపుబారిన పడి, రంగు మారిన, మొలకెత్తిన ధాన్యాన్నికూడా మద్దతు ధరకే కొంటామన్నారు. ప్రత్యేకాధికారి మాట్లాడుతూ తుపానుతో మునిగిన పంటను ఒబ్బిడి చేసుకోవడానికి రైతులకు ఉపాధి కూలీలను కేటాయించి సహకారం అందిస్తామన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌ ప్రారంభం నుంచి డ్రెయిన్లను ఆధునికీకరించడం వల్ల ముంపునీరు వేగంగా సముద్రంలోకి దిగుతోందన్నారు. పల్లపు ప్రాంతాల్లోని చేలల్లో ముంపునీరు రెండుమూడు రోజుల్లో పూర్తిస్థాయిలో దిగువకు వెళ్తుందన్నారు. డ్వామా పీడీ మధుసూదన్‌, ఆర్డీవో కేశవర్ధన్‌రెడ్డి, ఎంపీపీ శేషారావు, మండల ప్రత్యేకాధికారి కర్నీడి మూర్తి, డ్రెయిన్స్‌ ఈఈ కిశోర్‌, జడ్పీటీసీ సభ్యురాలు గౌతమి పాల్గొన్నారు.

అయినవిల్లిలో 199.6 మి.మీ. వర్షపాతం

అమలాపురం కలెక్టరేట్‌, పి.గన్నవరం, న్యూస్‌టుడే: కోనసీమ జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు  మొత్తం 2,665 మి.మీ. మేర వర్షపాతం నమోదైంది. సరాసరి 121 మి.మీ. కురిసినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా అయినవిల్లి మండలంలో 199.6, అత్యల్పంగా మండపేటలో 39.4 మి.మీ. నమోదైంది.

  • ఉప్పలగుప్తం 195.2
  •  కాట్రేనికోన 177.6
  •  అమలాపురం 175.40
  •  ముమ్మిడివరం 167.6
  • ఐ.పోలవరం 156.20
  •  కొత్తపేట 149.2
  • రావులపాలెం 141.4
  •  కపిలేశ్వరపురం 132.2 
  •  అంబాజీపేట 137.6 
  •  కె.గంగవరం 124.00

చికిత్సలకు ఏర్పాట్లు చేశాం

అమలాపురం పట్టణం: తుపాను దృష్ట్యా జిల్లాలోని ఆసుపత్రుల్లో రోగులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశామని జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయకర్త పద్మశ్రీరాణి తెలిపారు. రెండు ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లకు, తొమ్మిది సీహెచ్‌సీలకు ఆదేశాలు, అత్యవసర సూచనలు ఇచ్చామన్నారు. గర్భిణుల సురక్షిత ప్రసవాలకు పడకలు సిద్ధం చేశామని, ఆసుపత్రుల వద్ద విద్యుత్తు సరఫరాలో సమస్యలు లేకుండా ఇన్వర్టర్లు, జనరేటర్లకు డీజిల్‌ అందుబాటులో ఉంచాం. వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశామన్నారు.

ట్రాన్స్‌కోకు రూ.57.45 లక్షల నష్టం

పి.గన్నవరం: తుపాను ప్రభావంతో విద్యుత్తు శాఖకు  ఎక్కువగా నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, తీగలు ధ్వంసం కావడంతో పలుప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కోనసీమలోని 16 మండలాల్లో తుపాను కారణంగా రూ.57.45లక్షలమేర నష్టం ఏర్పడిందని ట్రాన్స్‌కో ఈఈ ఎం.రవికుమార్‌ వెల్లడించారు. 49 స్తంభాలు, 45 ట్రాన్స్‌ఫార్మర్లు పునరుద్ధరించామన్నారు. ఎస్‌ఈ మూర్తి, ఈఈ రవికుమార్‌ కుందాలపల్లి తదితర గ్రామాల్లో పనులు పర్యవేక్షించారు.

 తుపానుతో మంగళవారం ఉదయం నుంచీ విద్యుత్తు సరిగా సరఫరా కాలేదు. గాలులతో వర్షం ఉద్ధృతం కావడంతో రాత్రి 8 గంటల తరువాత పూర్తిగా విద్యుత్తు నిలిపివేయడంతో జిల్లావాసులు ఇబ్బందిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని