logo

అపార నష్టం.. కోలుకోలేని కష్టం

రెండే రెండు రోజులు రైతుల కలలను తలకిందులు చేసేశాయి.. ఇష్టపడి, కష్టపడి పండించిన పంట కళ్లెదుటే నేలవాలిపోయింది.

Published : 06 Dec 2023 04:35 IST

 ఆరుగాలాల శ్రమను మింగేసిన తుపాను
 వేలాది ఎకరాల్లో వరిపంటకు తీవ్ర నష్టం

బొమ్మూరులో ఈదురుగాలులకు పడిపోయిన పంటను చూపుతున్న రైతు

రెండే రెండు రోజులు రైతుల కలలను తలకిందులు చేసేశాయి.. ఇష్టపడి, కష్టపడి పండించిన పంట కళ్లెదుటే నేలవాలిపోయింది. గుప్పెళ్లతో తీసుకుంటే బంగారంలా మెరిసిపోయే ధాన్యపు రాశులను నీడలా వెంటాడిన శత్రువు మాదిరి నీరు చుట్టేసింది.. చేసిన అప్పులు, పెట్టుకున్న ఆశలు, కుటుంబమంతా కలిసి పడ్డ శ్రమ.. ఇలా అన్నీ ఆవిరైపోయాయి. మిగ్‌జాం తుపాను ఉమ్మడి జిల్లాలో తీవ్ర నష్టం మిగిల్చింది.

ఈనాడు, రాజమహేంద్రవరం, -న్యూస్‌టుడే: వి.ఎల్‌.పురం, దేవీచౌక్‌

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై విపత్తు తీవ్ర ప్రభావం చూపింది. కోతకు సిద్ధమైన వరి ఒరిగిపోయింది. పనల దశలో ఉన్నది తడిసింది.. కల్లాల్లో, రోడ్ల పక్కన రాశులు పోసి బరకాలు కప్పిన ధాన్యం కిందకు, వ్యవసాయ క్షేత్రాల్లోకి జలం చేరిపోయింది. వానలు తగ్గక, నీరు కదలక  రైతులు పంటలను కాపాడుకోవడానికి యాతన పడుతున్నారు. తేమతో సంబంధం లేకుండా ధాన్యం కొంటామని ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో పట్టించుకునేవారు కరవయ్యారు. కొత్తపేట, ముమ్మిడి వరం, పి.గన్నవరం, రాజోలు, అమలాపురం నియోజకవర్గాల్లో దయనీయ పరిస్థితి నెలకొంది.

తూర్పున 41 గ్రామాల్లో పంట నష్టం

తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలోని 11 మండలాల పరిధిలోని 41 గ్రామాల్లో వరి పంటకు నష్టం వాటిల్లే ప్రమాదముందని అధికార వర్గాలు అంచనా వేశాయి. వ్యవసాయశాఖ నివేదిక ప్రకారం మంగళవారం సాయంత్రానికి జిల్లాలో 377 హెక్టార్లలో కోత దశలో ఉన్న వరి ముంపునకు గురికాగా 502 హెక్టార్లలో పంట పడిపోయింది. 193 హెక్టార్లలో పనల మీద, 562 హెక్టార్లలో కుప్పలపై, 1,140 హెక్టార్లలో ధాన్యం కళ్లాల్లోనే ఉంది. ఖరీఫ్‌ సీజన్‌లో 70,827 హెక్టార్లలో వరిసాగు జరగగా ఇప్పటికే 46,416 హెక్టార్లలో కోతలు పూర్తయ్యాయి. ఇంకా 24,411 హెక్టార్లలో కోతలు జరగాల్సి ఉండగా తుపాను ముంచుకొచ్చింది. గోకవరం, గోపాలపురం, కోరుకొండ, సీతానగరం, ఉండ్రాజవరం తదితర మండలాల్లో సరాసరి మూడు వేల హెక్టార్లలో వరి కోతలు మిగిలి ఉన్నాయి.

రాజమహేంద్రవరం: ముంపు బారిన రామచంద్రరావుపేట-కృష్ణానగర్‌ ప్రాంతాలు

ఇబ్బందులెన్నో: ఒబ్బిడి చేసిన ధాన్యాన్ని జాగ్రత్త చేసుకోవడానికి టార్పాలిన్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్నిచోట్ల మిల్లులకు ధాన్యం తరలించడానికి హమాలీల కొరత ఉంది. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కూలీలను వినియోగించుకోవాలని జిల్లా యంత్రాంగం ఆదేశాలిచ్చినా వారికి ఈ పనులు అలవాటు లేకపోవడంతో ధాన్యాన్ని వాహనాల్లో ఎగుమతి చేయలేని పరిస్థితి.

కూలిన స్తంభాలు.. దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లు

వర్షాలు, ఈదురు గాలుల కారణంగా పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. రాజమహేంద్రవరం నగరంతోపాటు సఖినేటిపల్లి, జి.దొంతమూరు, గండేపల్లి, జగ్గంపేట, తాళ్లరేవు, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో నష్టం వాటిల్లినట్లు ఈపీడీసీఎల్‌ రాజమహేంద్రవరం సర్కిల్‌ ఎస్‌ఈ టీవీఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 200 విద్యుత్తు స్తంభాలు, 100 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఈదురుగాలులకు ఒక్క రాజమహేంద్రవరంలోనే 40 స్తంభాలు పడిపోవడంతోపాటు ఎనిమిది ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయన్నారు. విద్యుత్తు శాఖకు సుమారు రూ.కోటి నష్టం వాటిల్లిందని.. ఇంకా పెరిగే అవకాశముందన్నారు. పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సరఫరా పునరుద్ధరణకు మొత్తం 400 మంది సిబ్బందిని నియమించినట్లు ఎస్‌ఈ పేర్కొన్నారు.

పెరవలి: తీపర్రులో నేలవాలిన విద్యుత్తు స్తంభం

పాఠశాలలకు నేడూ సెలవు కంబాలచెరువు

(రాజమహేంద్రవరం): తుపాను నేపథ్యంలో భారీ వర్షాలు కొనసాగే పరిస్థితి ఉండడంతో బుధవారమూ జిల్లాలో పాఠశాలలకు స్థానిక సెలవు దినం ప్రకటించినట్లు డీఈవో ఎస్‌.అబ్రహాం ఓ ప్రకటనలో తెలిపారు. డిప్యూటీ డీఈవోలు, మండల విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని అన్ని పాఠశాలలకు ఈ సమాచారం అందేలా చూడాలని ఆదేశించారు.

సీఎం చెబుతారు.. క్షేత్రంలో అమలుకాదంతే..

తుపాను నేపథ్యంలో తేమ శాతం చూడకుండా మిల్లులకు హుటాహుటిన ధాన్యం తరలించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. అవి క్షేత్రస్థాయిలో అమలుకాక అన్నదాతలు ఉసూరుమంటున్నారు. రైతుభరోసా కేంద్రాలకు వెళ్లి లారీలు, దిగుబడి ఛార్జీలు తామే భరిస్తామని, ధాన్యం కొనాలని వేడుకుంటున్నా ప్రయోజనం లేకపోయింది. తేమ ఎక్కువ ఉంటే మిల్లరు ఎంత ధర నిర్ణయిస్తారో తెలియదని, ఈ తరహా ధాన్యం తరలింపుపై తమకు ఆదేశాలు రాలేదని సిబ్బంది చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలకు కోనసీమ జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు.

రాజమహేంద్రవరం: మోరంపూడి సమీప ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద సుడిగాలి బీభత్సం

60 వేల ఎకరాల్లో పంటపై ఆందోళన..

కోనసీమ జిల్లాలో 1.58 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా 1.01 లక్షల ఎకరాల్లో కోతలు జరిగాయి. 89 వేల మెట్రిక్‌ టన్నులు కొన్నట్లు అధికారులు చెబుతున్నారు. 40 వేల మెట్రిక్‌ టన్నులు ప్రైవేటు వ్యాపారులు తీసుకున్నట్లు అంచనా. మరో 60 వేల ఎకరాల్లోని పంట కోత, పనలు, కుప్పల మీద ఉంది. తుపానుతో నష్టపోయే పరిస్థితి నెలకొంది.

పైడిమెట్టలో రహదారి పక్కన రాశి కిందకు చేరిన వర్షం నీరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని