logo

సృజన చూపుదాం.. సత్తా చాటుదాం..

విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టే సమయం ఆసన్నమైంది. సృజనాత్మకతను చాటేందుకు వేదిక సిద్ధమైంది.

Published : 06 Dec 2023 04:42 IST

నేటి నుంచి కౌశల్‌ పోటీల మాక్‌ టెస్టులు

న్యూస్‌టుడే, పామర్రు, ద్రాక్షారామ : విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టే సమయం ఆసన్నమైంది. సృజనాత్మకతను చాటేందుకు వేదిక సిద్ధమైంది. పర్యావరణం, నీటి ఆవశ్యకత, ప్లాస్టిక్‌ అనర్థాలపై భావి పౌరులకు అవగాహన కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక, భారతీయ విజ్ఞాన మండళ్లు సంయుక్తంగా రాష్ట్రస్థాయి విజ్ఞానశాస్త్ర ప్రతిభాన్వేషణ పరీక్ష కౌశల్‌-2023 పేరుతో పోటీలు నిర్వహిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 619 ఉన్నత పాఠశాలల్లో 8,9,10 తరగతులు చదివే సుమారు 37 వేల మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు.

పోటీలు ఇలా..

క్విజ్‌, పోస్టర్‌, ప్రజంటేషన్‌ పోటీలుంటాయి. వీటిని ఆన్‌లైన్లో నిర్వహిస్తారు.

అర్హత: క్విజ్‌ పోటీలకు 8,9,10 తరగతుల విద్యార్థులు ముగ్గురు బృందంగా ఉంటారు. వీరికి ఆన్‌లైన్లో పరీక్ష పెడతారు. పాఠశాల స్థాయిలో బృందంగా ఏర్పడిన విద్యార్థులు ఇక్కడ ప్రతిభ చూపితే జిల్లా స్థాయికి, అక్కడ విజేతలుగా నిలిస్తే రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధిస్తారు. అత్యధిక మార్కులు చొప్పున జిల్లాస్థాయిలో 36 బృందాలు ఎంపికవుతాయి. విజ్ఞానశాస్త్రంలో భారతీయుల కృషి అనే అంశం మీద క్విజ్‌ ఉంటుంది.

పోస్టర్‌ ప్రజంటేషన్‌..

8, 9 తరగతుల చెందిన విద్యార్థులు పాల్గొనేందుకు అర్హులు. పర్యావరణహిత జీవన విధానం, సుస్థిర అభివృద్ధికి హరిత శక్తి, ఇస్రో ప్రయాణం సాధించిన విజయాలు, ఎల్లాప్రగడ సుబ్బారావు జీవిత చరిత్ర పరిశోధనలు అంశాల మీద ఇది ఉంటుంది. పోటీదారులు కనీసం రెండు నిమిషాలు తన పోస్టర్‌ గురించి న్యాయనిర్ణేతలకు వివరించాల్సి ఉంటుంది. వారు అడిగే రెండు నుంచి అయిదు ప్రశ్నలకు కూడా జవాబు  చెప్పాల్సి ఉంటుంది.

ఎప్పుడంటే..

కోనసీమ జిల్లా నుంచి 198, కాకినాడ జిల్లా నుంచి 231, రాజమహేంద్రవరం నుంచి 190 పాఠశాలల విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. వీరందరికీ బుధవారం నుంచి 12వ తేదీ వరకు మాక్‌ టెస్టులు నిర్వహిస్తారు. జిల్లా స్థాయిలో 8వ తరగతి విద్యార్థులకు 13న ఉదయం 9.30 నుంచి 12.30, 9వ తరగతి వారికి అదే రోజు మధ్యాహ్నం 1.30 నుంచి 4.30 వరకు, పదో తరగతి వారికి 14న ఉదయం 9.30 నుంచి 12.30 వరకు పోటీలు పెడతారు. వీరిలో విజేతలుగా నిలిచిన 36 పాఠశాలల వారికి ఈ నెల 20న జిల్లాస్థాయి పోటీలుంటాయి. అక్కడ విజేతలుగా నిలిచిన వారికి 30న రాష్ట్ర స్థాయి పోటీలుంటాయి.

బహుమతులు..

ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన వారికి జిల్లా స్థాయిలో వరుసగా రూ.7,500, 6,000, 4,500 అందజేస్తారు. రాష్ట్ర స్థాయిలో రూ.15,000, 12,000, 9,000 ఇస్తారు. రాష్ట్ర స్థాయిలో కన్సొలేషన్‌ బహుమతులు రూ. ఆరువేలు చొప్పున నగదు బహుమతి ఇస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని