logo

రైల్వే మెము కార్‌షెడ్‌కు పురస్కారం

రాజమహేంద్రవరంలోని దక్షిణ మధ్య రైల్వే మెము (మెయిన్‌ లైన్‌ ఎలక్ట్రికల్‌ మల్టీపుల్‌ యూనిట్‌) కార్‌షెడ్‌ ఉత్తమ నిర్వహణ విభాగంలో విశిష్ట రైల్‌ సేవా పురస్కార్‌-2023కి ఎంపికయ్యింది.

Published : 07 Dec 2023 05:23 IST

కార్‌షెడ్‌లో పిట్‌పై కోచ్‌కు మరమ్మతు

న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలోని దక్షిణ మధ్య రైల్వే మెము (మెయిన్‌ లైన్‌ ఎలక్ట్రికల్‌ మల్టీపుల్‌ యూనిట్‌) కార్‌షెడ్‌ ఉత్తమ నిర్వహణ విభాగంలో విశిష్ట రైల్‌ సేవా పురస్కార్‌-2023కి ఎంపికయ్యింది. సికింద్రాబాద్‌లో త్వరలో జరగనున్న దక్షిణ మధ్య రైల్వే-68వ వీక్‌ అవార్డు కార్యక్రమంలో షీల్డ్‌ అందుకోనుంది. గతంలోనూ పలు నాణ్యతా ప్రమాణ ధ్రువపత్రాలు సాధించి ఇక్కడి మెము కార్‌షెడ్‌ ప్రత్యేక గుర్తింపు పొందింది. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌ పరిధిలోని రాజమహేంద్రవరం, కాకినాడల నుంచి విశాఖపట్నం, పలాస వరకు, చెన్నై జోలార్‌పేట వరకు, గుంటూరులోని మాచర్ల, మచిలీపట్నం, నరసాపురం తదితర ప్రాంతాలకు 28 మెము రైళ్లు 108 సర్వీసులుగా నడుస్తున్నాయి. ఈ రైళ్ల నిర్వహణ కోసం రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్‌ సమీపంలో 1999 నవంబరులో మెము కార్‌షెడ్‌ను రైల్వే శాఖ ప్రారంభించింది. అప్పటి నుంచి ఇక్కడే మెము రైళ్లకు సంబంధించి 257 బోగీల నిర్వహణ (కోచ్‌ల మరమ్మతు, శుభ్రపరచడం) వంటి పనులు చేపడుతున్నారు. ఇక్కడ రెండు పిట్‌లు (రైలు బోగీల మరమ్మతు కోసం ప్రత్యేక ట్రాక్‌లు), వాషింగ్‌ ప్లాంట్‌పై బోగీలు పైకి లేపి మరమ్మతులు చేపట్టేందుకు భారీ క్రేన్లు ఉన్నాయి. సుమారు 250 మంది సిబ్బంది షిఫ్టుల వారీగా మెము రైళ్ల నిర్వహణ బాధ్యతలు చేపడుతుంటారు. రోజూ షెడ్యూల్‌ ప్రకారం మూడు, నాలుగు రైళ్లకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి, కోచ్‌లను శుభ్రపరుస్తారు. ఇలా ప్రతి సర్వీసుకు వారానికి ఒకసారి తప్పనిసరిగా పూర్తిస్థాయి నిర్వహణ జరుగుతుంది.

విశిష్ట అవార్డుకు ఎంపికైన సందర్భంగా మెము కార్‌షెడ్‌ అసిస్టెంట్‌ డివిజినల్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌(ఏడీఈఈ) డి.ప్రసాద్‌, సిబ్బందిని దక్షిణమధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ అసిస్టెంట్‌ డివిజనల్‌ కార్యదర్శి కె.విజయశంకర్‌ తదితరులు అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని