logo

కుప్పకూలేదాకా.. వేచి చూడాల్సిందేనా!

వాడబోది మీడియం డ్రెయిన్‌ వైనతేయ నదిలో కలిసే చోట కుడి కరకట్ట మధ్యలో మామిడికుదురు మండలం ఆదుర్రు వద్ద ఉన్న అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌ దశాబ్దమున్నర కాలంగా దుర్భరంగా మారింది.

Published : 07 Dec 2023 05:27 IST

శిథిల స్లూయిస్‌పైకి ఎవరూ వెళ్లొద్దంటూ పెట్టిన ఫ్లెక్సీ బోర్డు

న్యూస్‌టుడే, మామిడికుదురు: వాడబోది మీడియం డ్రెయిన్‌ వైనతేయ నదిలో కలిసే చోట కుడి కరకట్ట మధ్యలో మామిడికుదురు మండలం ఆదుర్రు వద్ద ఉన్న అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌ దశాబ్దమున్నర కాలంగా దుర్భరంగా మారింది. స్లూయిస్‌కు దెబ్బతిన్న తలుపులను మార్చడం మినహా 2007లో కరకట్ట విస్తరణలోనూ దీని ఆధునికీకరణకు నిధులు మంజూరుకాలేదు. కింది భాగంలో పెచ్చులూడి ఊచలు తేలిన స్లూయిస్‌పై గత నవంబరు 10న ట్రాక్టర్‌ వెళ్తుండగా స్లాబు ఒక వైపు కుంగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో అక్కడ వాహనాల రాకపోకలను నిలిపివేసి దానిపై ఎవరూ వెళ్లకూడదంటూ అధికారులు హెచ్చరిక బోర్డు పెట్టారు. 450 ఎకరాల వరి ఆయకట్టు, సుమారు 1,200 ఎకరాల కొబ్బరితోటల నుంచి మురుగు, ముంపు నీరు దిగడంతో పాటు తీర గ్రామాల్లో రాకపోకలకు ఆధారమైన వాడబోది స్లూయిస్‌ ప్రస్తుతం ఏ క్షణంలోనైనా కుప్పకూలే పరిస్థితికి చేరింది. దీనికి మోక్షం  కల్పించేందుకు గతంలో మూడు సార్లు ప్రతిపాదనలు చేసి పంపినా నిధుల జాడే లేదు. తాజాగా రూ.4.28 కోట్లు వ్యయమయ్యే ప్రతిపాదనలు చేసి ఆమోదానికి పంపారు. దీనికి సమీపంలో ఉన్న బచ్చలబంద, గోగన్నమఠంలోని కడలి అవుట్ఫాల్‌ స్లూయిస్‌లు ఇదే  తరహాలో స్లాబులు బలహీనంగా మారి దుర్భరంగా ఉన్నాయి. వీటి ఆధునికీకరణకు గతంలో రూ.6.50 కోట్ల వ్యయమయ్యే ప్రతిపాదనలు పంపినా వాటికీ అతీగతీ లేకపోవడంతో రైతులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు.


తాజాగా ప్రతిపాదనలు పంపాం
- టీవీఎల్‌ఎన్‌ మూర్తి, రాజోలు వశిష్ఠ కన్జర్వెన్సీ ఏఈఈ

ఆదుర్రులో స్లాబు కుంగిన వాడబోది అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌తో పాటు దాని సమీపంలో ఉన్న బచ్చలబంద స్లూయిస్‌ పునర్నిర్మాణానికి గాను ఇటీవల రూ.6.73 కోట్లు వ్యయమయ్యే ప్రతిపాదనలను చేసి ఉన్నతాధికారులకు పంపించాం. ప్రస్తుతం వాడబోది స్లూయిస్‌పై వాహనాలు వెళ్లకుండా కంచె కట్టి బోర్డు పెట్టాం. నిధులు మంజూరైన వెంటనే ఆధునికీకరణ పనులు చేపడతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని