logo

మొక్కుబడిగా ముగించేశారు..!

కాకినాడ జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకుడిగా నియమితులైన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ ప్రధాన కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ జిల్లా పర్యటన తూతూమంత్రంగా సాగింది.

Published : 07 Dec 2023 05:33 IST

పోలింగ్‌ కేంద్రంలో దరఖాస్తులు పరిశీలిస్తున్న యువరాజ్‌

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకుడిగా నియమితులైన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ ప్రధాన కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ జిల్లా పర్యటన తూతూమంత్రంగా సాగింది. ఆయననే కాకినాడ జిల్లాకు తుపాను సహాయక చర్యలకు ప్రత్యేక అధికారిగానూ ప్రభుత్వం నియమించింది. తుపాను తీరం దాటిన ఒక రోజు తర్వాత బుధవారం వచ్చిన ఆయన తొలుత కలెక్టరేట్‌లో కలెక్టర్‌, జేసీ, ఈఆర్వోలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కాకినాడ నగర నియోజకవర్గంగాంధీనగర్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రం పరిశీలనతో పర్యటన ముగిసింది. ఓటర జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024 జరుగుతున్న నేపథ్యంలో కాకినాడ జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితాపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన, డూప్లికేట్లు, డబుల్‌ ఎంట్రీలు యథాతథంగా జాబితాలో ప్రచురితమయ్యాయి. కాకినాడ నగర నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు ఒక ప్రైవేటు ఆన్‌లైన్‌ సెంటర్‌ ద్వారా తెదేపా సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు భారీగా ఫారం-7లు దాఖలు చేశారు. దీనిపై స్థానికంగా విచారణ చేసి 13 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులలో పురోగతి లేదు. కాకినాడ నగర నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలపై తెదేపా నాయకులు ఆయనకు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గ ఈఆర్వో, కాకినాడ నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్‌ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటి వరకు పూర్తిస్థాయి ఈఆర్వోను నియమించలేదని, ఇన్‌ఛార్జి కమిషనర్‌కు బాధ్యతలు అప్పగించడంతో అవకతవకలు జరుగుతున్నాయని, ఆయనపై చర్యలు చేపట్టాలని కోరారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ తూతూమంత్రంగా ఓటరు జాబితాపై సమీక్షించి వెళ్లిపోవడం విమర్శలకు తావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని