logo

రైతుల ఆశలపై నీళ్లు

మిగ్‌జాం తుపాను రైతులను నిండా ముంచేసింది. పంట చేతికొచ్చిన వేళ వారి ఆశలపై నీళ్లు చల్లింది. కళ్లెదుటే పంట వర్షార్పణమైంది. జిల్లాలో 12,053 హెక్టార్లలోని వ్యవసాయ, ఉద్యాన పంటలు తుపాను బారిన పడ్డాయి.

Published : 07 Dec 2023 05:38 IST

తడిచిన వరి పనలపై ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేస్తున్న రైతు

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: మిగ్‌జాం తుపాను రైతులను నిండా ముంచేసింది. పంట చేతికొచ్చిన వేళ వారి ఆశలపై నీళ్లు చల్లింది. కళ్లెదుటే పంట వర్షార్పణమైంది. జిల్లాలో 12,053 హెక్టార్లలోని వ్యవసాయ, ఉద్యాన పంటలు తుపాను బారిన పడ్డాయి. వీటిలో 10,871 హెక్టార్లలో వ్యవసాయ, 1,182 హెక్టార్లలో ఉద్యాన పంటలు ఉన్నాయి. అత్యధికంగా వరి దెబ్బతింది. ఖరీఫ్‌కు సంబంధించి మొత్తం 70,827 హెక్టార్లలో ఈ సాగు జరిగింది. ఇందులో 3,576 హెక్టార్లలో పంట ఒరిగిపోగా 2,446 హెక్టార్లలో నీట మునిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. గోకవరం, సీతానగరం, కోరుకొండ, పెరవలి, గోపాలపురం, దేవరపల్లి, తాళ్లపూడి మండలాల్లో ఎక్కువ నష్టం జరిగింది. ఇదికాక 4,849 హెక్టార్లలోని మొక్కజొన్న, పొగాకు, అపరాలు తదితర పంటలు పాడయ్యాయి. ఈదురుగాలుల కారణంగా 625 హెక్టార్లలోని మొక్కజొన్న, పొగాకు తోటలు విరిగిపోయాయి. మిగతా 4,224 హెక్టార్లలో పంటలు ముంపునకు గురయ్యాయి. నష్టాన్ని తగ్గించడానికి చర్యలు చేపట్టినట్లు జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు తెలిపారు. వరికి సంబంధించి 1,859 హెక్టార్లలోని ముంపునీటిని బయటకు పంపించే ఏర్పాట్లు చేశామన్నారు. నేలకొరిగిన గింజలు మొలకెత్తకుండా ఉండటానికి 5 శాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేయమని రైతులకు సూచించామన్నారు. 1,182 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగింది. 772 హెక్టార్లలో అరటి తోటలు, 410 హెక్టార్లలో పూలు, కూరగాయాల తోటలకు నష్టం జరిగినట్లు ఉద్యాన అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. పెరవలి, తాళ్లపూడి, చాగల్లు, కొవ్వూరు, నల్లజర్ల, ఉండ్రాజవరం మండలాల్లో ఎక్కువగా అరటి దెబ్బతినగా కడియం మండలంలో పూల తోటలు, సీతానగరం, కోరుకొండ తదితర మండలాల్లో కూరగాయాల తోటలు ముంపునకు గురైనట్లు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని