logo

తుపాను నష్టాలపై నివేదికలకు ఆదేశాలు

తుపాను కారణంగా సంభవించిన నష్టాలను నమోదు చేసి నివేదికలు అందజేయాలని జిల్లా ప్రత్యేక అధికారి, సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌యాదవ్‌, కలెక్టర్‌ మాధవీలత ఆదేశించారు.

Published : 07 Dec 2023 05:40 IST

దొమ్మేరులో పొలాలను పరిశీలిస్తున్న జిల్లా ప్రత్యేకాధికారి వివేక్‌ యాదవ్‌

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: తుపాను కారణంగా సంభవించిన నష్టాలను నమోదు చేసి నివేదికలు అందజేయాలని జిల్లా ప్రత్యేక అధికారి, సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌యాదవ్‌, కలెక్టర్‌ మాధవీలత ఆదేశించారు. బుధవారం తాడేపల్లి నుంచి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా కలెక్టరేట్‌ నుంచి ప్రత్యేక అధికారి, కలెక్టర్‌తో పాటు ఎస్పీ జగదీష్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ దినేష్‌కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. వీసీ అనంతరం వివేక్‌యాదవ్‌ అధికారులతో సమీక్షించారు. దెబ్బతిన్న రహదారులను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టి పూర్తి చేయాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టిసారించాలన్నారు. ప్రజల నుంచి ఎటువంటి ఫిర్యాదులు లేకుండా చూడాలన్నారు. రానున్న రెండు నెలల్లో ఎదుర్కొనే పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. విరిగిన విద్యుత్తు స్తంభాల స్థానంలో వెంటనే కొత్తవి ఏర్పాటు చేసి సరఫరా పునరుద్ధరించాలన్నారు. పాఠశాలల ఆవరణలో నిలిచిపోయిన నీటిని మోటార్ల ద్వారా తోడించేందుకు చర్యలు తీసుకోవాలని డీఈవోను ఆదేశించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పంట నష్టాలను నమోదు చేస్తున్నామని, రెండు రోజుల్లో నివేదిక అందజేస్తామని తెలిపారు. ఆఫ్‌లైన్‌లో ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు పంపిస్తున్నామన్నారు. గోదావరిలో నీటిమట్టం 11.75 అడుగులు ఉందని, ఎగువనున్న భద్రాచలం నుంచి నీరువచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎస్పీ మాట్లాడుతూ భద్రత విషయంలో తగు చర్యలు తీసుకున్నామన్నారు.  

తుపాను తగ్గే వరకు కోతలు వద్దు

కొవ్వూరు పట్టణం: వర్షంతో మునిగిన చేలలో కోతలు చేపట్ట వద్దని సీఆర్డీఏ కమిషనర్‌, జిల్లా ప్రత్యేకాధికారి వివేక్‌ యాదవ్‌ అన్నారు. కొవ్వూరు మండలం దొమ్మేరులోని పంట పొలాలను ఆయన పరిశీలించారు. వర్షంతో చేలు మునిగిపోయాయని, పంట దెబ్బతింటుందన్న అంశాన్ని రైతాంగం ఆయన దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌.మాధవరావు, తహసీల్దారు డి.నాగరాజునాయక్‌, ఏఓ గంగాధర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని