logo

చేతులు కాలాక.. ఆకులు పట్టుకుంటే ఎలా..!

చేతులు కాలాక ఆకులుపట్టుకుంటే ప్రయోజనం ఏమిటి...? అధికార యంత్రాంగం పరిస్థితి అలాగే ఉంది. తుపాను కారణంగా కురిసిన కుండపోత వర్షానికి జిల్లాలో వేలాది ఎకరాల విస్తీర్ణంలో వరిపంట ముంపుబారినపడింది.

Published : 07 Dec 2023 05:42 IST

పంటలు మునిగాక హడావుడిగా పనులు

బుధవారం రాజులపాలెంలో జేసీబీతో మురుగుకాల్వ పనులు

పి.గన్నవరం, న్యూస్‌టుడే: చేతులు కాలాక ఆకులుపట్టుకుంటే ప్రయోజనం ఏమిటి...? అధికార యంత్రాంగం పరిస్థితి అలాగే ఉంది. తుపాను కారణంగా కురిసిన కుండపోత వర్షానికి జిల్లాలో వేలాది ఎకరాల విస్తీర్ణంలో వరిపంట ముంపుబారినపడింది. ఇప్పటికిప్పుడు ఉపాధికూలీలు, ప్రత్యామ్నాయ మార్గాల్లో మురుగుకాలువలను శుభ్రం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఇప్పుడు అక్కడక్కడా వీటిని బాగుచేస్తున్నారు. వాస్తవానికి ఏటా వేసవి క్లోజర్‌ పిరియడ్‌లో మురుగుకాలువలు, పంటకాలువలు బాగుచేయాలి.  వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ తరహా పనులు చేయడం లేదు. ఒ.అండ్‌.ఎం. నిధులతో మాత్రం అరకొరగా పనులు చేస్తున్నారు. పంటకాలువలు, మురుగుకాలువలకు వేసవి క్లోజర్‌పిరియడ్‌లో పనులుచేసి తూడు, గుర్రపుడెక్క తొలగించటం, గట్లు పటిష్టం చేయటం వంటి పనులు చేయాలి. ఇలా చేస్తే ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభానికి అవి సర్వసన్నద్ధంగా ఉంటాయి. తుపానులు, అధికవర్షాలు కురిస్తే ముంపునీరు ఈ మురుగుకాలువల నుంచి వేగంగా బయటకు పోయేందుకు వీలుంటుంది. ఈ బాపతు పనులు చేయకపోవటం కారణంగా జిల్లాలో మురుగుకాలువలు, పంటకాలువలు అధ్వానంగా తయారై రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వ్యవసాయానికి సాగునీరు ఎంతముఖ్యమో మురుగునీటిపారుదల వ్యవస్థ అంతకంటే ముఖ్యం.  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 379 కిలోమీటర్లమేర 20 ప్రధాన, 363 కిలోమీటర్లమేర 45 మధ్యతరహా, 1184 కిలోమీటర్లమేర 272 చిన్నతరహా మురుగుకాలువలతోపాటు 700 కిలోమీటర్ల పొడవునా వెయ్యివరకు రెవెన్యూ మురుగుకాలువలు ఉన్నాయి. వీటిలో 50శాతం పైబడి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోనే ఉన్నాయి. ఇప్పుడు నష్టం కూడా కోనసీమ లోనే పెద్దఎత్తున జరిగింది. ప్రభుత్వం తీరుపై రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకనే తాము నష్టపోయినట్లు వాపోతున్నారు.

ముంపునీరు బయటకెళ్లక  రాజులపాలెంలో  మునిగిన వరిచేలు

ఎక్కడ చూసినా ఆక్రమణలే...

పంట కాలువలు, మురుగుకాలువలపై ఆక్రమణలకు అంతేలేకుండా పోతుంది. 2021లో జిల్లాలో తూర్పుడెల్టాలో 690, మధ్యడెల్టా అయిన కోనసీమలో 3,100 ఆక్రమణలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. వీటిని తొలగించే ధైర్యం చేయలేదు. దీనికి రాజకీయపైరవీలు మోకాలడ్డుతున్నాయి. ఇప్పటికైనా పంటకాలువలు, మురుగుకాలువలపై ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


ఇప్పుడు హడావుడిగా చేస్తున్నారు
- పోల్నాటి సుబ్బారావు, రైతు, రాజులపాలెం

మా గ్రామంలో బుధవారం నుంచి మురుగుకాలువలను జె.సి.బి.తో అధికారులు బాగుచేయిస్తున్నారు. ఇప్పుడుచేస్తే ప్రయోజనం ఏమిటి. తుపాను కారణంగా కురిసిన భారీ వర్షానికి చేలన్నీ ముంపులోనే ఉన్నాయి. ఏటా ఖరీఫ్‌సాగు ప్రారంభానికి ముందే పంటకాలువలు, మురుగుకాలువలు బాగుచేయాలి. అంతేకాని అంతా మునిగాక హడావుడి చేస్తే ప్రయోజనం ఏమిటి?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని