logo

ఇక ఏముందని.. కన్నీరే మిగిలిందని!

తుపాను ధాటికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అతలాకుతలమైంది. ఈదురుగాలులు, వర్షాలకు తోడు మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి అపార నష్టం వాటిల్లింది. వరి పొలాలు చెరువులను తలపించాయి.

Published : 07 Dec 2023 05:50 IST

‘మిగ్‌జాం’ తుపాను మిగిల్చిన గాయాలెన్నో
92 వేల ఎకరాల్లో వ్యవసాయ- ఉద్యాన పంటలకు నష్టం
ఈనాడు, రాజమహేంద్రవరం, కాకినాడ, న్యూస్‌టుడే: వి.ల్‌.పురం, టి.నగర్‌, ఏవీఏ రోడ్డు

గోపాలపురం: పొగాకు పంట నుంచి నీటిని బయటకు పంపుతూ..

తుపాను ధాటికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అతలాకుతలమైంది. ఈదురుగాలులు, వర్షాలకు తోడు మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి అపార నష్టం వాటిల్లింది. వరి పొలాలు చెరువులను తలపించాయి. రైతులు విలవిల్లాడిపోయారు. బరకాలు కప్పి రోడ్లపై, మైదానాల్లో వేసిన ధాన్యం రాశుల్లోకీ నీరు చేరడంతో తోడుతూ వాటిని తరలించడం కలచివేసింది. ఉమ్మడి జిల్లాలో 92,876 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం జిల్లా కేంద్రాలతోపాటు అనేక గ్రామాల్లో ఇళ్లలోకి జలం చేరింది. విద్యుత్తు స్తంభాలు, ఇళ్ల గోడలు నేలకొరిగాయి.

తుపానుపై అన్నదాతలను అప్రమత్తం చేయాల్సిన అధికారులు తాత్సారం చేశారు. కోసిన ధాన్యాన్ని హుటాహుటిన సమీపంలోని మిల్లులకు తరలించాలని సీఎం ఆదేశించినా అమలుకాలేదు. ఆర్బీకేలకు వెళ్తే తేమ శాతం పేరిట కొర్రీలు పెట్టారు తప్ప సంచులివ్వలేదు. ధాన్యం తరలించేందుకు వాహనాలు సమకూర్చలేదు. ఉమ్మడి జిల్లాలో 86,354 ఎకరాల్లో వ్యవసాయ, 6,522 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.

పెరవలి: లంకమాలపల్లిలో నేలకొరగిన అరటి

  • కాకినాడ జిల్లాలో 26,852 ఎకరాల్లో వరిపంట నేలకొరిగింది. 13,300 ఎకరాల్లో ముంపునకు గురైంది. పనల మీద ఉన్నది 1,667 ఎకరాల్లో తడిసిపోయింది. జిల్లావ్యాప్తంగా 33 శాతం కంటే ఎక్కువ దెబ్బతిన్న పంట 33,340 ఎకరాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఉద్యాన పంటలు 2,067 ఎకరాల్లో దెబ్బతిన్నాయి.
  • కోనసీమ జిల్లాలో 16,601 ఎకరాల్లో వరిచేను వాలిపోతే, 12,887 ఎకరాల్లో పంట నీట మునిగింది. 1,500 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.
  • కొత్తపల్లి, పిఠాపురం మండలాల్లో 100 ఇళ్లు గాలులకు దెబ్బతిన్నాయి. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 147 పూరిళ్లు దెబ్బతిన్నాయి. 180 గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. 11కేవీ విద్యుత్తు ఫీడర్లు 107, 33కేవీ ఫీడర్లు 15 దెబ్బతిన్నాయి. ఎల్‌టీ, 11కేవీ విద్యుత్తు స్తంభాలు 146 పడిపోయాయి.

జలదిగ్బంధంలో చిక్కుకొన్న కోరుకొండ రోడ్డు


ఎంతెంత కష్టం

పొలాల్లో ధాన్యం రాశులుంటే తడిసిపోతాయనే భయంతో కొత్తపేట మండలం అవిడి జగనన్న లేఔట్‌కు ధాన్యం తరలించారు. సుమారు 50 ఎకరాల్లో వీటిని ఆరబెట్టారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లేఔట్‌ అంతా ముంపునకు గురైంది. దీంతో ధాన్యం రాశులన్నీ తడిసిపోయాయని కన్నీటిపర్యంతమయ్యారు. లేఔట్‌కు గండికొట్టి నీటిని బయటకు పంపించారు. అయినవిల్లి మండలంలో అధిక సంఖ్యలో రైతులు 1318 రకం కొత్త వంగడం సాగు చేశారు. వర్షాలు, గాలులకు వరి దుబ్బులు నేలవాలకపోయినా మొలకలు వస్తున్నాయని రైతులు వాపోతున్నారు. పి.గన్నవరం నియోజకవర్గంలో 19 వేల ఎకరాల్లో సాగవ్వగా సుమారు 10 వేల ఎకరాల్లో ముంపునకు గురైంది. 3,800 మెట్రిక్‌ టన్నుల ధాన్యం తడిసింది. ముమ్మిడివరం నియోజకవర్గంలో 42 వేల ఎకరాల్లో సాగవ్వగా సగానికి పైగా దెబ్బతింది. 12 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం తడిసినట్లు ప్రాథమిక అంచనా. కొత్తపేట మండలం అవిడిలో 3 వేల ఎకరాలు సాగు చేయగా, వెయ్యి ఎకరాలు దెబ్బతిన్నట్లు సమాచారం కోనసీమ జిల్లాలో పర్యటించిన ‘ఈనాడు-ఈటీవీ’ బృందానికి రైతుల దుర్భర పరిస్థితులు కనిపించాయి. కన్నీళ్లు దిగమింగుకుంటూ తడిచిన ధాన్యాన్ని దోసిళ్లతో బుట్టలో వేసి మెరక ప్రాంతానికి తరలిస్తున్నారు. పి.గన్నవరం మండలం రాజులపాలెంలో శ్రీనివాసరావు అనే కౌలు రైతు కుటుంబసభ్యులు, కూలీలతో కలిసి తడిసిన ధాన్యాన్ని బుట్టలతో మోసుకుంటూ రోడ్డుపైకి బురదలో తీసుకెళ్తున్నారు. పి.గన్నవరం మండలం నరేంద్రపురం పంచాయతీ పరిధిలోని బూరుగుగుంటలో రైతులు రాజారత్నం, తోట పాపారావు, కొంబత్తుల సత్యనారాయణ నీట మునిగిన తమ పంటను చూపుతూ తమను ఆదుకోవాలని వేడుకున్నారు.

నిడదవోలు: మునిపల్లిలో పూర్తిగా నీట మునిగిన ఇటుక బట్టి


ఆర్బీకేకు వెళ్తే ఆరుదల లేదన్నారు..
- నక్కా ప్రసాదరావు, బూరుగుగుంట, పి.గన్నవరం మండలం

రెండు ఎకరాలు సాగు చేశాను. ఎకరన్నరలో పంట కోసి ఆరు రోజులైంది. ఆర్బీకేకు వెళ్తే ధాన్యం ఆరుదల లేదన్నారు. ఇంతలో వర్షం వచ్చింది.. రూ.2 వేలతో బరకం కొని కప్పినా తడిసిపోయింది. సగానికి పైగా పోతుంది. మిగతా పంట ముంపులో ఉంది. ఎరాకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టా. మరో
రూ.30 వేలు కౌలు చెల్లించాలి.  


బిక్కుబిక్కుమంటూ గడిపాం..
-వేమగిరి పోలయ్యమ్మ, కొండెవరం , యు.కొత్తపల్లి

వానొస్తుందని ఇంట్లోనే ఉన్నాం. సుడిగాలి మొదలై పెంకులు టపటపమని పడిపోయాయి.. బయటకొస్తే చెట్టుకొమ్మ విరిగిపోయింది.. ప్రాణం అరచేతిలో పెట్టుకుని ఉండిపోయా. ఇంట్లోకి వర్షం నీరు చేరింది. నిలబడడానికీ దారిలేదు. ఊళ్లోని చర్చిలో రాత్రి తలదాచుకున్నాం. ఎలాంటి సాయమూ అందలేదు. ఉన్న నీడ కూడా పోయింది. ఆదుకోండయ్యా.


ఆర్బీకే సిబ్బంది, దళారులు కుమ్మక్కయ్యారు..
-కె.శ్రీనివాస్‌, అవిడి, కొత్తపేట మండలం

మూడెకరాలు కౌలుకు సాగు చేశాను. ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టాను. తుపాను భయంతో ధాన్యాన్ని 5 కి.మీ. దూరంలోని జగనన్న లేఔట్‌కు తరలించాను. అక్కడా నీరు చేరి తడిచింది. ఎలాంటి సాయం లేదు. ఇప్పుడు తడి, పొడి ధాన్యానికి వేర్వేరు రేట్లు చెబుతున్నారు. తేమ ఎక్కువ ఉందని, ఆరబెట్టాలని అంటున్నారు. దళారులు, ఆర్బీకే సిబ్బంది ఒక్కటై రైతుల్ని మోసం చేస్తున్నారు.


నిలువ నీడ లేకుండాపోయింది..
-వేమగిరి రత్నం, కొండెవరం ఇందిరా కాలనీ, యు.కొత్తపల్లి మండలం

సుడిగాలికి ఇంటి పెంకులు రాలిపోయాయి. కరెంటు తీగలు తెగి పడిపోయాయి. గోడ పట్టుకుని పాకుకుంటూ ప్రాణాలు కాపాడుకున్నాం.. నా ఆరోగ్యం బాగోదు. నా కుమారుడు కూలిపని చేసి పోషిస్తున్నాడు.. ఇల్లంతా కూలిపోయి నీడలేకుండా పోయింది. ప్రభుత్వం ఆదుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని