logo

92 హత్యలు.. 160 సైబర్‌ నేరాలు

హత్యలు.. వేధింపులు.. అపహరణలు.. దొంగతనాలు.. కొట్లాటలు.. సైబర్‌ నేరాలు.. ఇలా నేరాల చిట్టాకు అడ్డూఆపూ లేకుండా పోతోంది.

Published : 08 Dec 2023 03:17 IST

ఉమ్మడి జిల్లాలో గతితప్పుతున్న పరిస్థితులు
జాతీయ నేర గణాంకాలు- 2022లో వెల్లడి

హత్యలు.. వేధింపులు.. అపహరణలు.. దొంగతనాలు.. కొట్లాటలు.. సైబర్‌ నేరాలు.. ఇలా నేరాల చిట్టాకు అడ్డూఆపూ లేకుండా పోతోంది. 2022లో దేశంలో నమోదైన నేరాలకు సంబంధించిన నివేదికను జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గతి తప్పుతున్న పరిస్థితిని ఈ నివేదిక తెలియజేస్తోంది.

ఈనాడు, కాకినాడ

ద్దేశపూర్వక, అనుకోకుండా చేసిన హత్యలు కాకినాడలో అధికంగా ఉన్నాయి..

గతేడాది కాకినాడ జిల్లాలో అత్యధికంగా 42 హత్య కేసులు నమోదైతే.. తూర్పు గోదావరిలో 28, కోనసీమ జిల్లాలో 22 నమోదయ్యాయి.

మహిళలే సమిధలు: వరకట్న వేధింపుల మరణాలు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో మూడు చొప్పున నమోదయ్యాయి. హత్యాచారం కేసు తూర్పుగోదావరిలో ఒకటి, అత్యాచారం కేసులు 27 ఉన్నాయి. కోనసీమలో 23, కాకినాడలో 16 ఉన్నాయి. అత్యాచారయత్నం కేసులు కోనసీమలో ఏడు, కాకినాడలో అయిదు నమోదయ్యాయి. ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులు తూర్పు గోదావరిలో 12, కాకినాడలో ఎనిమిది, కోనసీమలో నాలుగు ఉన్నాయి.

ఉమ్మడి జిల్లాలో ఆర్థిక నేరాలు కలవరపెడుతున్నాయి. ఆన్‌లైన్‌, ఏటీఎం, క్రెడిట్‌కార్డు మోసాలు ఇలా పలు నేరాలపై కేసులు అధికమే. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 78 కేసులు నమోదైతే.. కాకినాడ జిల్లాలో 53, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 29 నమోదయ్యాయి.

నిర్లక్ష్యం.. నిండు ప్రాణం: వాహనాల కింద పడడం, నిర్లక్ష్యంగా నడపడంతో జరిగిన రోడ్డు ప్రమాదాలు, రైలు వస్తున్నప్పుడు అడ్డుగా వెళ్లడం, వైద్యసేవల్లో లోపాలు, ఇతరత్రా కారణాలతో అధిక మరణాలు నమోదయ్యాయి. ఇవి కాకినాడ జిల్లాలో 1,120 , తూర్పుగోదావరిలో వెయ్యి, కోనసీమలో 643 ఉన్నాయి.

వీరంతా ఏమైపోతున్నారు: పిల్లలు, పెద్దలు, మహిళలు, పురుషుల అదృశ్యం కేసులు కలవరపెడుతున్నాయి. కాకినాడ జిల్లాలో అదృశ్యం కేసులు అధికంగా నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని