logo

అభ్యంతరాలు తెలిపే మిల్లర్లపై చర్యలు

తేమశాతం ఎక్కువగా ఉన్న ధాన్యాన్ని డ్రైయర్స్‌(ఆరబెట్టే మర) అందుబాటులో ఉన్న మిల్లులకు తక్షణం తరలించాలని కలెక్టర్‌ మాధవీలత సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published : 08 Dec 2023 03:19 IST

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): తేమశాతం ఎక్కువగా ఉన్న ధాన్యాన్ని డ్రైయర్స్‌(ఆరబెట్టే మర) అందుబాటులో ఉన్న మిల్లులకు తక్షణం తరలించాలని కలెక్టర్‌ మాధవీలత సంబంధిత అధికారులను ఆదేశించారు. డ్రైయర్స్‌ పని చేయడం లేదంటూ ధాన్యం దించుకునే విషయంలో అభ్యంతరాలు తెలిపే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని, అటువంటి వారిని రెండేళ్లు నిషేధిత జాబితా(బ్లాక్‌ లిస్టు)లో ఉంచాల్సి ఉంటుందని కలెక్టర్‌ హెచ్చరించారు. జిల్లా, డివిజన్‌, మండలస్థాయి అధికారులతో ధాన్యం కొనుగోళ్లు, పునరావాసం, పారిశుద్ధ్య పనులు తదితర అంశాలపై కలెక్టర్‌, జేసీ గురువారం జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ తుపాను కారణంగా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన, దెబ్బతిన్న పంటల వివరాలతో సమగ్ర నివేదిక అందజేయాలని సంబంధిత వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు ధాన్యాన్ని సేకరించి మిల్లులకు తరలించడంలో అధికారుల సమన్వయం  ముఖ్యమన్నారు. ముంపు ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని, పునరావాస కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు కొనసాగించాలని ఆదేశించారు. జేసీ మాట్లాడుతూ ఆఫ్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. నగరపాలకసంస్థ కమిషనర్‌ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ నగరంలో గాలులకు పడిపోయిన చెట్లు, విద్యుత్తు స్తంభాల తొలగింపు, శానిటేషన్‌ పనులు పూర్తికి ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టినట్లు తెలిపారు. నీ రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా సంయుక్త కలెక్టర్‌ తేజ్‌భరత్‌ తెలిపారు. ధాన్యం సేకరణకు సంబంధించి జిల్లాలో గురువారం నాటికి 26,123 కూపన్లు జనరేట్‌ చేసి ఆఫ్‌లైన్‌లో కొనుగోళ్లు నిలిపివేసినట్లు తెలిపారు. ధాన్యాన్ని విక్రయించే విషయంలో మిల్లర్లు, మధ్యవర్తులను రైతులు కలవాల్సిన అవసరంలేదన్నారు. ఆర్బీకేలో ఎఫ్‌టీవో, ట్రక్కు షీట్‌ తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్లిపోవచ్చని, మిల్లుల వద్ద ధాన్యాన్ని దిగుమతి చేసి రసీదు పొందే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని జేసీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని