logo

నమూనాలయ నిర్మాణం భద్రమేనా..!

అన్నవరం జాతీయ రహదారిపై డిగ్రీ కళాశాల పక్కన (విశాఖపట్నం - రాజమహేంద్రవరం) మార్గంలో స్వామివారి నమూనాలయం నిర్మిస్తున్నారు. ప్రసాద విక్రయకేంద్రం, ఫుడ్‌ప్లాజా, దుకాణ సముదాయం, మరుగుదొడ్లు తదితర పనులు చేపడుతున్నారు.

Published : 08 Dec 2023 03:26 IST

నిర్మాణం చుట్టూ చేరిన వరద నీరు

అన్నవరం, న్యూస్‌టుడే: అన్నవరం జాతీయ రహదారిపై డిగ్రీ కళాశాల పక్కన (విశాఖపట్నం - రాజమహేంద్రవరం) మార్గంలో స్వామివారి నమూనాలయం నిర్మిస్తున్నారు. ప్రసాద విక్రయకేంద్రం, ఫుడ్‌ప్లాజా, దుకాణ సముదాయం, మరుగుదొడ్లు తదితర పనులు చేపడుతున్నారు. దేవస్థానానికి చెందిన 4.29 ఎకరాల్లో రూ.3.60 కోట్లతో నిర్మాణం చేస్తున్నారు. ఇలా ఉండగా నాలుగురోజులుగా కురిసిన వర్షాలకు పంపా రిజర్వాయర్‌లో నీటిమట్టం 104 అడుగుల ప్రమాద స్థాయికి చేరడంతో జలాలు విడుదల చేశారు. ఈ నీరంతా జాతీయ రహదారిపై ప్రవహిస్తూ నమూనాలయం చుట్టూ పెద్ద ఎత్తున చేరింది. ఈ నేపథ్యంలో ఈ నిర్మాణాల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మునిగిన మారేడు వనం..

అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో జాతీయరహదారిపై భారీగా మారేడు వనాలను పెంచుతున్నారు. వరద నీటికి అదీ మునిగిపోయింది. నమూనాలయం వెనుక సుమారు 2.63 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 500 మారేడు వనాలు పెంచుతున్నారు. రాష్ట్ర ఐఏఎస్‌ అధికారుల సతీమణుల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కొన్ని నెలల క్రితం మొక్కలు నాటారు. ఇక్కడే మరో 4.29 ఎకరాల విస్తీర్ణంలో 450 మొక్కలు నాటారు. మారేడుతో పాటు మామిడి, అరటి, తులసి తదితర మొక్కలు నాటారు. సుమారు రూ.11 లక్షలతో వనాలు పెంచుతుండగా వరద నీటిలో మునిగిపోయాయి.

గతంలోనూ అనుభవాలు..

గతంలోనూ నీలం తుపాను, ఇతర వరదల సమయంలో జాతీయ రహదారిపై నీరు పెద్దఎత్తున ప్రవహించింది. ఇక్కడ ప్రాంతం లోతుగా ఉండటంతో ముంపు నీరు చేరుతుంది. అక్కడే నమూనాలయం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పనులు ప్రాథమిక దశలో ఉన్నాయి. వరదలు, భారీ వర్షాలు వచ్చిన ప్రతిసారీ ఈ సమస్య ఎదురవుతుంది. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ ప్రణాళిక అమలు చేయాలని భక్తులు కోరుతున్నారు.

జాతీయరహదారి పై రాకపోకలకు అంతరాయం..

అన్నవరం: అన్నవరం జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండడంతో గురువారం వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు పర్యవేక్షించి వాహనాలను గ్రామం నుంచి మళ్లించారు. కొన్ని వాహనాలను జాతీయరహదారిపై ఓవైపు మార్గంలో అనుమతించారు. మిగ్‌జాం తుపాను కారణంగా గ్రామంలోని పంపా రిజర్వాయర్‌లో 105 అడుగుల సామర్థ్యానికి గానూ సుమారు 104 అడుగుల వరకు నీరు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి 1200 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో ముందుగా 800 క్యూసెక్కుల నీటిని బుధవారం సాయంత్రం విడుదల చేశారు. రాత్రికి ఇన్‌ఫ్లో ఎక్కువ కావడంతో నీటి విడుదలను పెంచారు. ఇన్‌ఫ్లో తగ్గడంతో గురువారం మద్యాహ్నాం 12.30 గంటలకు నీటి విడుదల నిలిపేశారు. వాహనాల రాకపోకలు యథావిధిగా సాగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని