logo

క్రీడాకారుల భవిష్యత్తుతో ఆటలు

క్రీడల గురించి ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో కనీస సౌకర్యాలు కొరవడి క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. కాకినాడలోని జిల్లా క్రీడామైదానం 19 ఎకరాల్లో విస్తరించి ఉంది.

Updated : 08 Dec 2023 06:08 IST

మూలకు చేరిన జిమ్‌ సామగ్రి

న్యూస్‌టుడే, గాంధీనగర్‌, మసీదుసెంటర్‌: క్రీడల గురించి ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో కనీస సౌకర్యాలు కొరవడి క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. కాకినాడలోని జిల్లా క్రీడామైదానం 19 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ(డీఎస్‌ఏ) ఆధ్వర్యంలో ఉంది. ఇక్కడ గతంలో 22 రకాల క్రీడల్లో శిక్షణ ఇచ్చేవారు. ప్రస్తుతం యువత ఎక్కువగా ఇష్టపడుతూ, పోటీపడే ఫుట్‌బాల్‌, యోగా, బాల్‌బ్యాడ్మింటన్‌, అథ్లెటిక్‌్్స, తైక్వాండో, టేబుల్‌ టెన్నిస్‌, వాలీబాల్‌కు కోచ్‌లు లేకపోవడంతో అనేక మంది ఆ క్రీడలకు దూరమవుతున్నారు. 1997-98లో కాకినాడలో రీజనల్‌ అకాడమీ స్థాపించి ఖోఖో, కబడ్డీలో శిక్షణ ప్రారంభించారు. తొలినాళ్లలో వీరి సంఖ్య పదుల సంఖ్యలో ఉండటంతో డీఎస్‌ఏ మైదానంలోని కార్యాలయంలోనే వసతి కల్పించేవారు. అనంతరం బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌, అనంతరం వెయిట్‌ లిఫ్టింగ్‌ తదితర క్రీడల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఇక్కడ వసతితో శిక్షణ అందేది. క్రీడాకారుల సంఖ్య పెరగడంతో అద్దె భవనాల్లో వారికి వసతి కల్పించారు.

నిరుపయోగంగా జిమ్‌ సామగ్రి..

జిల్లా క్రీడా మైదానంలో జిమ్‌ సౌకర్యం లేకపోవడంతో గత ప్రభుత్వ హయాంలో సామగ్రి సమకూర్చినా దానికి అవసరమైన స్థలం, భవనం లేకపోవడంతో అవి మూలకు చేరాయి. ఎక్కువమంది నేర్చుకునే షటిల్‌ బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌, స్విమ్మింగ్‌ ఆడిటోరియం, స్విమ్మింగ్‌ ఫూల్‌ను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చారు. దీంతో అనేక మంది క్రీడాకారులు ఈ క్రీడలకు దూరమయ్యారు. అధిక రుసుముల కారణంగా టెన్నిస్‌, స్విమ్మింగ్‌ నేర్చుకునే వారి సంఖ్య తగ్గడంతో లీజుదారులు వాటి నిర్వహణను తిరిగి డిఎస్‌ఏకు అప్పగించారు.  మైదానంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో విలువైన క్రీడా సామగ్రి చోరీకి గురవుతోంది.

ఫీజులు పెంచడంతో..

గతంలో క్రీడాకారుల నుంచి నామమాత్రపు రుసుం వసూలు చేసి ‘పే అండ్‌ ప్లే’ విధానం క్రీడాకారులకు శిక్షణ అందేది. దీంతో ఎక్కువమంది పేద, మధ్యతరగతి క్రీడాకారులు తమకిష్టమైన అంశాల్లో శిక్షణ పొంది, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లోనూ పాల్గొని పతకాలు సాధించేవారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక చెల్లించు-ఆడుకో(పేఅండ్‌ప్లే) విధానంలో ఫీజులను ఒక్కసారిగా మూడు నాలుగు రెట్లు పెంచేశారు. పేద, మధ్యతరగతి క్రీడాకారులు రుసుములు చెల్లించలేక క్రీడలకు దూరమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ఫీజులు నామమాత్రంగా ఉన్న సమయంలో సుమారు 1200 మంది వరకు క్రీడాకారులు వివిధ క్రీడల్లో శిక్షణ పొందితే, ప్రస్తుతం ఆసంఖ్య సగానికి పైగా తగ్గింది. రెండేళ్లుగా వసూలు చేసిన రుసుముల మొత్తాన్ని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(శాప్‌) ఖాతాలకు మళ్లించారు. దీంతో మైదానం నిర్వహణ, కనీస సౌకర్యాల కల్పన చేయలేని దుస్థితి నెలకొంది.

అసంపూర్తి నిర్మాణాలే..

2017లో క్రీడాకారుల వసతికోసం రీజినల్‌ అకాడమీ నిర్మించేందుకు జి ప్లస్‌ 2 భవన నిర్మాణానికి రూ. కోట్లు వెచ్చించారు. నిధుల కొరత, ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆ భవన నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. గ్రౌండ్‌ఫ్లోర్‌ నిర్మాణం పూర్తయింది. విద్యుత్తు సౌకర్యం, తలుపులు, మరుగుదొడ్లు నిర్మించినా క్రీడాకారులు వసతి కోసం కొంతవరకు ఆ భవనాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీనిని ఎవరూ పట్టించుకోవడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని