logo

డిజిటల్‌ బోధన.. కొందరికేనా..!

మానసిక, శారీరక లోపాలతో పుట్టిన పిల్లలకు ప్రత్యేకంగా విద్య అందించేందుకు భవిత కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వైకల్య శాతం తక్కువగా ఉన్నవారు సమీపంలోని పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు.

Published : 08 Dec 2023 03:38 IST

భవిత కేంద్రాల సిబ్బందికి ట్యాబ్‌లు అందిస్తున్న డీఈవో కమలకుమారి

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్‌: మానసిక, శారీరక లోపాలతో పుట్టిన పిల్లలకు ప్రత్యేకంగా విద్య అందించేందుకు భవిత కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వైకల్య శాతం తక్కువగా ఉన్నవారు సమీపంలోని పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. ప్రత్యేక అవసరాల కలిగిన బాలలకు బోధన పరంగా మరింత ప్రోత్సాహం అందించేలా సమగ్రశిక్షా చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా వారికి కూడా డిజిటల్‌ బోధన అందించేలా పాఠ్యాంశాలు, ప్రత్యేక ఫీచర్లు కలిగిన ట్యాబ్‌లు అందించనున్నారు.

ట్యాబ్‌ల మంజూరు

ఇప్పటివరకు వీరికి ఉపకరణాలు, పుస్తకాల ద్వారా మాత్రమే బోధన చేస్తున్నారు. తాజాగా సమగ్రశిక్షా కేంద్ర కార్యాలయం నుంచి వీరికి సులువుగా బోధన చేసేలా ట్యాబ్‌లు అందాయి. ఒక్కో దాని ధర రూ.20 వేల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. జిల్లాకు 160 ట్యాబులు పంపిణీ చేశారు. వీటిలో దృష్టిలోపం ఉన్నవారికి 48, బధిరులకు 90, ఉపాధ్యాయులకు 25 అందించనున్నారు. వీటిలో సుమారు 33 రకాల యాప్‌లను నిక్షిప్తం చేసి తద్వారా డిజిటల్‌ బోధన చేయనున్నారు. దృష్టిలోపం ఉన్నవారు తమకు సంబంధించిన పాఠ్యాంశాల యాప్‌లో పీడీఎఫ్‌ తెరిచి, పుస్తకంలో పేజీకి ఫొటో తీస్తే అది పాఠం చదివి వినిపించేలా ఏర్పాటు చేశారు. దీంతో వారు చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటారు. ఇక బాలలు రంగులు, బొమ్మలు గుర్తు పట్టే విధంగా సిబ్బందే బోధిస్తారు. ఇందుకోసం సిబ్బందికి జిల్లా కేంద్రంలో శిక్షణ ఇచ్చారు. ఇదిలా ఉండగా కేంద్రం నిధులతో కేవలం దృష్టి, వినికిడి లోపం ఉన్నవారికి మాత్రమే ట్యాబ్‌లు ఇస్తున్నారు. మిగతా వారికీ ఇవ్వాల్సిఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటా నిధులు ఇవ్వకపోవడంతో కొందరికే పరిమితమైంది.

ఈ వారంలో అందజేస్తాం..

ఇటీవలే జిల్లాకు 160 ట్యాబ్‌లు మంజూరయ్యాయి. జిల్లా కేంద్రం నుంచి మండలాలకు పంపిణీ చేశాం. ప్రస్తుతం జరుగుతున్న దివ్యాంగ వారోత్సవాల్లో భాగంగా వీటిని విద్యార్థులకు అందజేస్తాం. వీటి ద్వారా విద్యార్థులు సాధారణ విద్యార్థుల మాదిరిగానే పాఠాలు నేర్చుకునే అవకాశం ఉంది. సిబ్బంది బాధ్యతాయుతంగా విద్యార్థులకు వీటి వినియోగాన్ని నేర్పాలని సూచనలు జారీ చేశాం. అయిదు నుంచి పదో తరగతి వరకు దృష్టి, వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు వీటిని అందజేయనున్నాం.

ఎం.వి.వి.సత్యనారాయణ, సహిత విద్య జిల్లా సమన్వయకర్త

జిల్లాలో..

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని 22 మండలాల పరిధిలో 22 భవిత కేంద్రాలున్నాయి. వీటిలో 453 మంది ప్రత్యేక అవసరాల పిల్లలు చదువుతున్నారు. వీరు కాకుండా మరో 2,023 మంది దివ్యాంగ బాలలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. వీరిని తల్లిదండ్రులు భవిత కేంద్రాలు, పాఠశాలకు పంపుతున్నారు. ప్రత్యేక ఉపాధ్యాయులు వారికోసం విధులు నిర్వహిస్తు
న్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని