logo

Annavaram: అంతా అడ్డగోలు.. భక్తుల సొమ్ము మట్టిపాలు

ఆలయాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారంటే ఎంత ప్రణాళిక ఉండాలి.. మరెంత ముందు చూపు ఉండాలి.. కానీ అన్నవరంలో అదే కొరవడింది.

Updated : 22 Feb 2024 09:35 IST

సత్యదేవుని సాక్షిగా పనుల్లో లోపాలు

సత్యగిరి నుంచి గిరి ప్రదక్షిణ రోడ్డుకు అనుసంధానం చేస్తూ నిర్మించిన కచ్చారోడ్డు

అన్నవరం, న్యూస్‌టుడే: ఆలయాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారంటే ఎంత ప్రణాళిక ఉండాలి.. మరెంత ముందు చూపు ఉండాలి.. కానీ అన్నవరంలో అదే కొరవడింది. గత ఏడాది కాలంలో దేవస్థానం వద్ద చేపట్టిన అభివృద్ధి పనుల్లో డొల్లతనానికి తావిచ్చారు. అంతర్గత రహదారులంటూ ఇష్టారాజ్యంగా రోడ్లు తవ్వేశారు.. అత్యవసరం అన్నట్లు అడ్డదారులు వేసేశారు. పచ్చదనం నాశనం చేశారు.. కనీసం నిపుణుల సలహా తీసుకోలేదు. ఇప్పటికే ఉన్న నిర్మాణాలకు సైతం సమస్య సృష్టించారు. ఇదే విషయాన్ని దేవాదాయశాఖ సాంకేతిక నిపుణులు, ఇతర నిపుణుల బృందం తేల్చింది. ఇప్పుడు ఈ అడ్డగోలు పనులను సరిచేసేందుకు మరిన్ని నిధులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. సిద్ధం చేసిన అంచనాలకు ఈ నెల 14న ధర్మకర్తల మండలిలో చర్చించి ఆమోదం సైతం తెలిపారు.


రక్షణ గోడ విస్మరించారు

త్న, సత్యగిరి కూడలి నుంచి హరిహరసదన్‌ వరకు అంతర్గత రహదారి, మల్టీ లెవెల్‌ పార్కింగ్‌కు కచ్చా రోడ్డును రూ.10 లక్షలతో నిర్మించారు. ఇందుకు కొండను తొలిచారు. ఒక పద్ధతి లేకుండా కొండను తొలిచారని, ఒకవైపు రాతి బండలు ఉండటంతో రక్షణ గోడ నిర్మించకపోతే వర్షాకాలంలో ఇబ్బందులు వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చరించారు. దీంతో కచ్చా రోడ్డు, కొండకు మధ్య రిటైనింగ్‌ వాల్‌ ఏర్పాటుకు ఇప్పుడు రూ. 9.50 లక్షలు అవసరమట.


ఇంతే కాదు.. ఇంకా ఉంది

అంతర్గత రహదారుల కోసం చేపట్టిన పనులను సరిచేసేందుకు ప్రస్తుతం సిద్ధం చేసిన అంచనాలు కొంత మొత్తమేనని తెలుస్తోంది. వీటికి మరింత వ్యయం చేయాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. నిర్లక్ష్య వైఖరి, ఏకపక్ష నిర్ణయాల వల్ల భక్తుల సొమ్ము వృథాగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.


పునాదులపై ప్రభావం

వనదుర్గ మార్గ్‌

గువ ఘాట్‌రోడ్డు మూడో మలుపు నుంచి వనదుర్గ ఆలయం వరకు కొండను తవ్వి వనదుర్గ మార్గ్‌ కచ్చా రోడ్డు నిర్మాణం చేశారు. సుమారు రూ. 17 లక్షలు వెచ్చించారని తెలుస్తోంది. తీరా నిపుణుల కమిటీ చూశాక గాని లోపాలు బయటపడలేదు. భూమి జారిపోయే అవకాశముందని, సమీపంలో (డార్మెటరీ, ప్రసాదం తయారీ భవనం, సెంటినరీ కాటేజీల ముందు సీసీ రోడ్డు) నిర్మాణాల పునాదులపై ప్రభావం చూపుతుందని తేల్చారు. రక్షణ చర్యలు చేపట్టాలని, రిటైనింగ్‌ వాల్‌ నిర్మించాలని నివేదిక ఇచ్చారు. దీంతో గేబియన్‌ వాల్‌ నిర్మించి మట్టి పూడ్చేందుకు రూ. 26 లక్షలతో మళ్లీ టెండర్లు పిలవాల్సి వచ్చింది.


కచ్చా రోడ్డులో ఎంత వ్యత్యాసమో..

త్యగిరి నుంచి కొండ దిగువన గిరిప్రదక్షిణ మార్గానికి అనుసంధానం చేస్తూ మూడవ ఘాట్‌రోడ్డు (1.5 కిలోమీటర్లు) నిర్మాణానికి ఆరు వరుసల్లో (ఐదు మలుపుల్లో రోడ్డు నిర్మాణానికి) కొండను కొట్టి కచ్చా రోడ్డు వేశారు. సుమారు రూ.18 లక్షలు వెచ్చించారు. పరిశీలించిన నిపుణుల కమిటీ వాలులో సుమారు 300 అడుగుల వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించింది. సమగ్ర పరిశీలనకు సూచించింది.అప్పటి వరకు ఈ మార్గాన్ని మూసివేయాలని పేర్కొంది. ఈ కచ్చా రోడ్డును తాత్కాలికంగా మూసివేయడానికి రాతి గోడ నిర్మాణం, రక్షణ నిమిత్తం తగిన మట్టితో నింపడానికి రూ.4.50 లక్షలతో అంచనాలు సిద్ధం చేశారు.


తుపానుకు కొట్టుకుపోయింది

ఆదిశంకర్‌ మార్గ్‌

కొండపై నుంచి దిగువ ఘాట్‌రోడ్డు మూడో మలుపు వద్ద కలుపుతూ అర కిలోమీటరు మేర ఆదిశంకర్‌ మార్గ్‌ నిర్మాణం చేపట్టారు. 5.5 మీటర్ల వెడల్పు, 470 మీటర్ల పొడవున రోడ్డుకు కొండను తొలచి ఎర్త్‌వర్క్‌ చేసి గ్రావెల్‌ నింపి బీటీ రోడ్డు వేశారు. ఇందుకు రూ.1.60 కోట్లు వెచ్చించారు. వేసిన నెల రోజుల్లోనే డిసెంబరులో తుపానుకు రోడ్డు పక్కన గ్రావెల్‌ బెర్మ్‌ పలు చోట్ల కొట్టుకుపోయింది. నిపుణుల కమిటీ పరిశీలించి రోడ్డుకు ఒకవైపు 30-60 అడుగుల లోయ కారణంగా వర్షాకాలంలో కొత్త రహదారి కోతకు గురయ్యే అవకాశముందని స్పష్టంచేశారు. రక్షణగోడ (రివిట్‌మెంట్‌) నిర్మించాల్సి ఉందని సూచించారు. దీంతో బీటీ రోడ్డు వెంబడి డ్రైయిన్‌కు, కొండకు మధ్య మట్టి ఫిల్లింగ్‌ చేసి కాంక్రీట్‌ వేసేందుకు రూ.6.30 లక్షలతో అంచనాలు సిద్ధం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని