logo

అందుబాటులోకి ఆధునిక వైద్యం

కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.91 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులతో యానాంలో నిర్మించిన జిప్‌మెర్‌ ఆసుపత్రి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆదివారం వర్చువల్‌ విధానంలో ప్రారంభం కానుంది.

Published : 25 Feb 2024 06:24 IST

నేడు జిప్‌మెర్‌ను ప్రారంభించనున్న ప్రధాని

జిప్‌మెర్‌ భవనం

యానాం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.91 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులతో యానాంలో నిర్మించిన జిప్‌మెర్‌ ఆసుపత్రి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆదివారం వర్చువల్‌ విధానంలో ప్రారంభం కానుంది. యానాంతోపాటు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వేలాది మంది రోగులకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో సేవలందించేందుకు కేంద్ర వైద్యారోగ్యశాఖ చేపట్టిన జిప్‌మెర్‌ ఆసుపత్రి నిర్మాణం గతేడాది పూర్తయింది. కొవిడ్‌ సమయంలో పని ప్రారంభమైనా అవాంతరాలు లేకుండా పూర్తి చేసేందుకు సీపీడబ్ల్యూడీ అధికారులు అంకితభావంతో శ్రమించారు. జిప్‌మెర్‌ మల్టీ స్పెషాలిటీ కన్సల్టింగ్‌ యూనిట్‌ నిర్మాణానికి  రూ.48.85 కోట్లు ఖర్చుకాగా యంత్ర సామగ్రి ఇతర మౌలిక సదుపాయాలు, నిర్వహణకు మిగిలిన సొమ్మును కేంద్రం కేటాయించింది. నూతన పన్ను విధానం, స్థానిక పరిణామాల నేపథ్యంలో పరిశ్రమలు మూతపడగా యానాంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోయిన నేపథ్యంలో ప్రస్తుత పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, అప్పటి సీఎం నారాయణ సామితోపాటు 2016లో ప్రధాని మోదీని కలిసి జిప్‌మెర్‌ ఆసుపత్రి, ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటుకోసం విన్నవించారు. 30 వేల మందికిపైగా ప్రజల సంతకాలతో మల్లాడి చేసిన వినతికి స్పందించి విద్య, వైద్యరంగాల్లో ఈ ప్రాంతం పురోగతిచెందేలా ఈ రెండింటినీ ప్రధాని మోదీ మంజూరు చేయించారు. పుదుచ్చేరి నుంచి వచ్చిన నలుగురు ఎండీల పర్యవేక్షణలో రెండు నెలల నుంచి ప్రయోగాత్మకంగా ఓపీ సేవలు ఆరంభించారు. వర్చువల్‌ విధానంలో ప్రధాని మోదీ నేడు జాతికి అంకితం చేశాక.. దశల వారీగా ఇక్కడ వైద్య సేవల విస్తరణ మొదలవుతుంది. ప్రమాదాలకు గురైన రోగులకు ట్రామా కేర్‌, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం వ్యాధులకు క్యాన్సర్‌ వంటి రోగాలకు చికిత్స ఇక్కడ లభిస్తుంది. అన్నీ సవ్యంగా జరిగితే యానాం నుంచి కాకినాడ జీజీహెచ్‌కు రోగులను సిఫార్సు చేసే సమస్య ఉండదని ప్రజలు ఆశిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని