logo

అభ్యర్థి.. గెలుపే గురి

తీర్పును దిశానిర్దేశం చేసే తూర్పు ప్రాంతమిది.. రాజకీయ చైతన్యం వెల్లివిరిసిన, సామాజికవర్గాల పట్టున్న ప్రాంతమిది.. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు..

Published : 25 Feb 2024 06:29 IST

తెదేపా - జనసేనలో కొత్త జోష్‌

జె.తిమ్మాపురంలో నిమ్మకాయల చినరాజప్పకు గజమాలతో సత్కారం

ఈనాడు, కాకినాడ, రాజమహేంద్రవరం: తీర్పును దిశానిర్దేశం చేసే తూర్పు ప్రాంతమిది.. రాజకీయ చైతన్యం వెల్లివిరిసిన, సామాజికవర్గాల పట్టున్న ప్రాంతమిది.. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు.. ఓట్లున్న ఉమ్మడి జిల్లా అంటే అన్ని పార్టీలకూ అందుకే గురి..  సార్వత్రిక ఎన్నికల వేళ తెదేపా- జనసేన-వైకాపా-కాంగ్రెస్‌ ఇలా ప్రధాన పక్షాలన్నీ ఈ జిల్లాలపైనే దృష్టిపెట్టాయి. ప్రచార కార్యక్రమాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే వైకాపా తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో సమన్వయకర్తలను మార్చి.. ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తే.. తెదేపా- జనసేన కూటమి ఉమ్మడి జిల్లాలో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి సమరభేరి మోగించింది.

కీలక సమయం. కష్టేఫలి..

పార్టీకోసం కష్టపడితే.. నియోజకవర్గంలో సమన్వయంతో ముందుకెళ్తే అధిష్ఠానం గుర్తిస్తుందనడానికి తెదేపా- జనసేన ప్రకటించిన తొలి జాబితా నిదర్శనం. పెద్దాపురం, మండపేట ఎమ్మెల్యేలుగా రెండుసార్లు నెగ్గిన నిమ్మకాయల చినరాజప్ప, వేగుళ్ల జోగేశ్వరరావులకు మూడోసారి పోటీచేసే అవకాశం కల్పించారు.. వివాదాలకు దూరంగా, పార్టీతో విధేయతతో ఉండడమే వీరికి విజయాలను, గుర్తింపును తెచ్చిపెట్టాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు చినరాజప్ప కీలకంగా వ్యవహరించారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. నియోజకవర్గంలో మట్టి దోపిడీ, జగనన్న లేఔట్లలో అవినీతిపై ప్రత్యక్షంగా పోరాడుతూనే, న్యాయపోరాటం చేస్తున్నారు. తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ పార్టీ అభివృద్ధికి కష్టపడుతున్నారు. ఈక్రమంలోనే సీనియర్‌ నేత నెహ్రూకు తొలి జాబితాలో చోటు దక్కింది. నియోజకవర్గంపై పట్టు, మిత్ర పక్షంతో సమన్వయంతో ముందుకెళ్తున్న ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందం పేర్లూ ప్రకటించడానికీ కారణం ఇదేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.
కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో ఆశావహులు ఎక్కువగా ఉన్నా.. జనసేన పార్టీలో జిల్లాలో కీలకంగా వ్యవహరించిన పంతం నానాజీని ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించారు.  


తొలి అడుగులు..

  • ఉమ్మడి జిల్లాలో తొలిసారిగా అసెంబ్లీకి పోటీచేసే అవకాశం తెదేపా- జనసేన పార్టీలు పలువురు యువనేతలకు కల్పించాయి.
  • తుని బరిలో మంత్రి దాడిశెట్టి రాజాను ఢీకొట్టేందుకు యనమల దివ్య సిద్ధమయ్యారు. విద్యావంతురాలు..సేవ చేయాలన్న సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చి తక్కువ కాలంలోనే ప్రజలకు చేరువయ్యారు.
  • వైకాపా ప్రభుత్వంలో దగాపడ్డ దళితుల కోసం సుదీర్ఘ పోరాటం చేస్తున్న యువకుడు మహాసేన రాజేష్‌కు ఊహించని రీతిలో తెదేపా టిక్కెట్‌ ఇచ్చింది
  • రాజమహేంద్రవరం సిటీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను వైకాపా ఎంపీ, నగర సమన్వయకర్త మార్గాని భరత్‌పై అధిష్ఠానం పోటీకి దింపింది. ప్రజాసమస్యలపై పోరుబాటే గుర్తింపు తెచ్చింది. చంద్రబాబు అరెస్టు సమయంలో ఆ కుటుంబం రాజమహేంద్రవరంలో 52 రోజులు బస చేస్తే.. వారికి అందుబాటులో ఉంటూనే ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
  • ఈ ఏడాది జనవరి 26న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రాజానగరం నుంచి జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ పేరును ప్రకటించారు. వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఈయన తెదేపాతో సమన్వయం చేసుకొని ముందుకెళ్తున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని