logo

AP News: భూసేకరణ లేకుండానే.. డమ్మీ ఇళ్ల పట్టాలు సిద్ధం

అధికారం దక్కించుకోవాలనే స్వార్థంతో అధికార పార్టీ నాయకులు అడ్డదారులు తొక్కుతూ ప్రజలను మోసం చేస్తున్నారని..

Updated : 25 Feb 2024 09:38 IST

11 గ్రామాల్లో పంపిణీకి తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాట్లు
డిప్యూటీ తహసీల్దార్‌ను నిలదీసిన అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

బైఠాయించి నిరసన తెలుపుతున్న రామకృష్ణారెడ్డి, టీడీపీ శ్రేణులు

ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, అనపర్తి: అధికారం దక్కించుకోవాలనే స్వార్థంతో అధికార పార్టీ నాయకులు అడ్డదారులు తొక్కుతూ ప్రజలను మోసం చేస్తున్నారని.. అందులో అధికారులు భాగస్వాములవ్వడం దారుణమని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. అనపర్తి తహసీల్దార్‌ కార్యాలయంలో  డిప్యూటీ తహసీల్దార్‌ శశిధర్‌ ఆధ్వర్యంలో గుట్టుచప్పుడుకాకుండా తయారు చేస్తున్న డమ్మీ పట్టాల అక్రమ వ్యవహారం గురించి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, తెదేపా నాయకులు శనివారం సాయంత్రం కార్యాలయానికి వెళ్లి బట్టబయలు చేశారు. స్థల సేకరణ చేయకుండా పట్టాలు ఎలా సిద్ధం చేస్తున్నారని.. ఎవరు తయారు చేయమని సూచించారని డీటీని నిలదీశారు. తొలుత కలెక్టర్‌ ఆదేశించారని పేర్కొన్నాయి. ఆర్డర్‌ కాపీ చూపించమని కోరగా.. మౌఖికంగా చెప్పారని చెప్పారు. స్థానిక నాయకులు ఆదేశాల మేరకు చేస్తున్నారా? అని ప్రశ్నించగా... ఆయన మౌనం దాల్చారు. దీంతో పట్టాల వద్దనే బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి ఆ వివరాలు వెల్లడించారు. అనపర్తి తహసీల్దార్‌ కార్యాలయంలో ‘సూర్య’జాలం జరుగుతోందని, లేని భూములకు పట్టాలు తయారు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి ఆదేశాల మేరకు డీటీ సుమారు 2,000 దొంగపట్టాలు తయారు చేస్తున్నారని ఆరోపించారు. భూసేకరణ జరగని భూముల్లో 11 గ్రామాలకు చెందిన పట్టాలు సిద్ధం చేసి సర్వే నంబర్లు, సరిహద్దులను ఒక్కరే  రాసేస్తున్నారని నిప్పులు చెరిగారు.  మూడు గ్రామాల్లో 58 ఎకరాల సేకరణకు ప్రతిపాదనలు మాత్రమే పంపించారని.. ఇప్పటికీ రైతులకు డబ్బులు చెల్లించలేదని పేర్కొన్నారు. ఇదంతా కలెక్టరేట్‌ నుంచి వచ్చిన ఆదేశాలతో కాదని.. ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతోందని దుయ్యబట్టారు. మండలంలో నకిలీ పట్టాలు తయారు చేస్తున్న విషయమై డీటీపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే కనీసం విచారణ కూడా చేయలేదని ఆరోపించారు. ఇప్పుడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామన్నారు. మూడు గ్రామాలకు భూసేకరణ అని డీటీ చెబుతున్నారని, మరి 11 గ్రామాల ప్రజలకు పట్టాలు తయారు చేస్తూ ప్రజలను వంచిస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేయడంలో స్థానిక ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, సీఎం జగన్‌ను మించిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ ఉదంతంపై సమగ్ర విచారణ జరిపి డీటీపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని