logo

సమరోత్సాహంతో ముందుకు...

సార్వత్రిక ఎన్నికల సమరానికి తెదేపా- జనసేన కూటమి సన్నద్ధమవుతోంది. కూటమి తొలి జాబితాను ఇరుపార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కలిసి శనివారం విడుదలచేశారు. కీలక అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలోకి దిగే అభ్యర్థులపై స్పష్టత ఇచ్చారు.

Updated : 25 Feb 2024 06:51 IST

11 నియోజకవర్గాల్లో తెదేపా
జనసేన అభ్యర్థుల ఖరారు
తొలి జాబితా ప్రకటనతో శ్రేణుల్లో ఉత్సాహం

సార్వత్రిక ఎన్నికల సమరానికి తెదేపా- జనసేన కూటమి సన్నద్ధమవుతోంది. కూటమి తొలి జాబితాను ఇరుపార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కలిసి శనివారం విడుదలచేశారు. కీలక అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలోకి దిగే అభ్యర్థులపై స్పష్టత ఇచ్చారు. కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లోని 21 అసెంబ్లీ స్థానాలకుగాను.. 11 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. దీంతో ఇరుపార్టీల శిబిరాల్లో సమరోత్సాహం కనిపిస్తోంది. కాకినాడ గ్రామీణం, రాజానగరం జనసేనకు.. తుని, పెద్దాపురం, జగ్గంపేట, రాజమహేంద్రవరం నగరం, అనపర్తి , ముమ్మిడివరం, కొత్తపేట, మండపేట, పి.గన్నవరం నియోజకవర్గాలను తెదేపాకు కేటాయించారు.

ఈనాడు, కాకినాడ, రాజమహేంద్రవరం- న్యూస్‌టుడే బృందం


‘దివ్య’మైన విజయం కోసం..

 యనమల దివ్య, తుని

వరుసగా ఆరుసార్లు తుని నియోజకవర్గం నుంచి నెగ్గిన తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పెద్ద కుమార్తె యనమల దివ్య. బీటెక్‌, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, ఎంబీఏ (యూకే)ను ఆమె పూర్తి చేశారు. సత్యం కంప్యూటర్స్‌లో సిస్టమ్‌ ఎనలిస్ట్‌గా పనిచేశారు. రాజకీయ అనుభవం లేకున్నా.. తండ్రి రామకృష్ణుడు, బాబాయ్‌ కృష్ణుడు ఆశీస్సులతో బరిలోకి దిగుతున్నారు. తుని నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా మీ ఇంటికి మీ దివ్య’ పేరుతో ప్రజలతో మమేకమవుతున్నారు.
ప్రజలకు మంచి చేయాలని: తుని నియోజకవర్గంలో 40 ఏళ్ల తర్వాత మహిళకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం దక్కింది.  ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాను. మహిళలు- యువతకు తెదేపా- జనసేన అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి.


పెద్దాపురం కోట నుంచి మరోసారి

నిమ్మకాయల చినరాజప్ప, పెద్దాపురం

మూడోసారి కూడా సిట్టింగ్‌ ఎమ్మెల్యే చినరాజప్ప పేరునే అధిష్ఠానం ఖరారు చేసింది. 1987లో ఉప్పలగుప్తం ఎంపీపీగా, 1995లో రాష్ట్ర మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఛైర్మన్‌గా, 1998లో రాష్ట్ర సివిల్‌ సప్లయ్స్‌ కమిటీ ఛైర్మన్‌గా, 1992 నుంచి 2014 వరకు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, 2007 నుంచి 2013 వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు. 2014లో 10 వేల ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థిపై గెలిచారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రూ.1,200 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. 2019లోనూ నాలుగు వేల ఓట్ల ఆధిక్యంతో నెగ్గారు.
నమ్మకమే నిలబెట్టింది: పార్టీకి, ప్రజలకు విధేయుడిగా ఉన్నాను. పెద్దాపురం నియోజకవర్గంలో రూ.కోట్లతో పనులు చేపట్టాను. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాను. తెదేపా- జనసేన ప్రభంజనంలో వైకాపా కొట్టుకుపోవడం ఖాయం.


జగ్గంపేటలో ‘జ్యోతుల’

జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ), జగ్గంపేట

ఎంఏ పాలిటిక్స్‌ చదివారు. 1984లో మామిడాడ సహకార సంఘ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1991 ఉప ఎన్నికల్లో తెదేపా నుంచి పోటీచేసి ఓటమి చూడగా 1994, 1999 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా విజయం సాధించారు. 2004లో తెదేపా అభ్యర్థిగా.. 2009లో ప్రజారాజ్యం నుంచి బరిలోకి దిగగా గెలవలేదు. 2014లో వైకాపా నుంచి పోటీ చేసి నెగ్గారు. 2016లో తెదేపాలో చేరారు. 2019లో తెదేపా నుంచి పోటీ చేసినా విజయం వరించలేదు. తాజాగా తెదేపా అభ్యర్థిగా మళ్లీ బరిలోకి దిగుతున్నారు.
చంద్రబాబుకు కానుకగా ఇస్తా..: తెదేపా అధినేత చంద్రబాబు ఎంతో నమ్మకంతో నా పేరు ప్రకటించారు. విజయం సాధించి కానుకగా ఇస్తాను.. ఆయన అడుగుజాడల్లో ప్రజల కోసం నిరంతరం పనిచేస్తాం.


అనపర్తి... పదో దఫా

నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,  అనపర్తి

రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నల్లమిల్లి బీఈ (సివిల్‌) చదివారు. తండ్రి మూలారెడ్డి ఏడు దఫాలు తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తరువాత రామకృష్ణారెడ్డి 2014లో విజయం సాధించగా.. 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మరో దఫా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
విజయమే లక్ష్యం: జనసేనతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. రెండు పార్టీల క్యాడర్‌ ప్రజల్లోకి వెళ్తున్నారు. నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలపై పోరాడుతున్నాం. విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం.


కొత్తపేట.. బరిలో ‘బండారు’

బండారు సత్యానందరావు, కొత్తపేట

సత్యానందరావు తెదేపా ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా ఉన్నారు. 1989లో తెదేపా నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 1994, 1999లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో స్వల్పఓట్ల తేడాతో ఓటమి పాలైనా.. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి విజయం సాధించారు. ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం తరువాత 2014లో తెదేపాలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఇప్పుడు తెదేపా నుంచి బరిలో ఉన్నారు.


రాజానగరం..ఉమ్మడి ‘బల’ం

బత్తుల బలరామకృష్ణ, రాజానగరం, జనసేన

వ్యాపార రంగం నుంచి వచ్చిన బలరామకృష్ణ ఇటీవలే రాజకీయాల్లో  ప్రవేశించారు. జనసేన బలోపేతానికి కృషి చేస్తూ నియోజకవర్గంలో గుర్తింపు తెచ్చుకున్నారు. పేదలకు ఆర్థిక సాయం చేస్తున్నారు. తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి, క్యాడర్‌ను కలుపుకొంటూ సాగుతున్నారు.
ఉమ్మడి సమావేశాలు నిర్వహిస్తాం: తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి బి.వెంకటరమణ చౌదరితో సమావేశమై పలు అంశాలపై చర్చించాం. మరింత ఐక్యంగా ఇరు పార్టీలు క్షేత్రస్థాయిలో పర్యటించేలా దిశానిర్దేశం చేస్తాం. విజయం సాధించి ప్రజలకు సేవలందిస్తాం.  


గ్రామీణంలో ‘పంతం’..

పంతం నానాజీ, కాకినాడ గ్రామీణం, జనసేన

జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడైన నానాజీకి కాకినాడ గ్రామీణం నుంచి పోటీచేసే అవకాశం దక్కింది. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా, జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా కాకినాడ నగరం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2018లో జనసేనలో చేరారు. 2019లో బరిలోకి దిగినా విజయం వరించలేదు. ‘‘వైకాపా పాలనతో ప్రజలు విసిగిపోయారు. ఈ ఎన్నికల్లో మా కూటమిదే విజయం ప్రజలు మా పక్షాన నిలబడతారు.’’ అని పంతం పేర్కొన్నారు.


‘దాట్ల’కే వరం..

దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు), ముమ్మిడివరం

వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. స్వగ్రామం కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్ల. 2005 నుంచి 2013 వరకు పీఏసీఎస్‌ అధ్యక్షులుగా, 2014-19 ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ప్రస్తుతం తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు, ముమ్మిడివరం నియోజకవర్గ బాధ్యులుగా ఉన్నారు.
అధినేత నమ్మకం నిలబెడతా: ముమ్మిడివరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉంది. 2014లో కూడా తొలిసారిగా నాకు చంద్రబాబు టికెట్‌ ఇచ్చారు. జనసేనతో కలిసి పార్టీ విజయానికి కలిసికట్టుగా పనిచేస్తాం. అధినేత నమ్మకాన్ని నిలబెడతాను.


పి.గన్నవరం..  మహాసేనకు

సరిపెళ్ల రాజేష్‌ కుమార్‌, పి.గన్నవరం

సరిపెళ్ల రాజేష్‌.. మహాసేన రాజేష్‌గా సుపరిచితులు.. వైకాపా పాలనలో వైఫల్యాలను, దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నిస్తూ ప్రభుత్వ విధానాలను ఎండగడుతుంటారు. ఈయనకు కీలకమైన పి.గన్నవరంలో పోటీచేసే అవకాశాన్ని కల్పించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి రాజేష్‌ స్వగ్రామం. 2017లో దళితుల హక్కులపై పోరాడేందుకు మహాసేన ఏర్పాటుచేశారు. దళితులపై ప్రభుత్వం అనుసరిస్తున్న దమనకాండను నిరసించి జైలుకు వెళ్లారు. ‘ప్రజలకు, దళితులకు అన్యాయం చేసిన జగన్‌ గద్దె దిగాలన్న లక్ష్యంతోనే తెదేపాలో చేరాను. ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించడం దళిత జాతికి ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాం. చంద్రబాబు, లోకేశ్‌కు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. .


మండపేట.. నాలుగోసారి సిద్ధం

వేగుళ్ల జోగేశ్వరరావు, మండపేట

1989లో రాజకీయ ప్రవేశం చేసిన వేగుళ్ల జిల్లా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. 1999లో తెదేపా చేరి 2000 మార్చిలో మండపేట మున్సిపల్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2004లో ఆలమూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. 2009, 2014, 2019 ఎన్నికల్లో మూడు దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. తాజాగా మరో దఫా బరిలో ఉన్నారు. ‘‘ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌కు కృతజ్ఞతలు. జనసేన ఇన్‌ఛార్జి లీలాకృష్ణను కలిసి సహకరించమని కోరగా సానుకూలంగా స్పందించారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్తాం.’ అని తెలిపారు.


రాజమహేంద్రవరం.. ‘వాసు’కే టిక్కెట్‌

ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు), రాజమహేంద్రవరం నగరం

తండ్రి ఆదిరెడ్డి అప్పారావు (మాజీ ఎమ్మెల్సీ), ఆదిరెడ్డి వీర్రాఘవమ్మ (మాజీ మేయర్‌)గా సేవలందించగా.. భార్య ఆదిరెడ్డి భవానీ ప్రస్తుతం ఎమ్మెల్యే. బీఈ చదివిన రాజకీయ వారసత్వాన్ని అందుకుని తొలిదఫా బరిలోకి దిగుతున్నారు. వైకాపా ప్రభుత్వం తమ వ్యాపారాలపై దాడులు చేయించి అరెస్టులు చేసి జైలుకు పంపినా ఎదుర్కొని పోరాడుతున్నారు. నగరంలో వైకాపా అవినీతి, దందాలపై గళమెత్తుతూ ప్రజలకు చేరువయ్యారు. భవానీ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
నగరాన్ని అభివృద్ధి చేస్తాం: మా కుటుంబాన్ని అధికారపార్టీ వేధించి తప్పుడు కేసులు పెట్టింది. ఆ కష్ట సమయంలో పార్టీ అండగా నిలిచింది. జనసేన తో కలిసి ముందుకెళ్తున్నాం. విజయం సాధించి నగరాన్ని అభివృద్ధి చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని