logo

సామర్లకోట రైల్వేగేటు మూసివేత

విజయవాడ-విశాఖపట్నం-విజయవాడ మార్గంలోని సామర్లకోట జంక్షన్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని రైల్వే గేటును అధికారులు బుధవారం నుంచి మూసివేశారు.

Published : 29 Feb 2024 05:36 IST

పై వంతెనపై ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు

గేటు మూసివేస్తున్నట్లు ఏర్పాటుచేసిన బోర్డు

సామర్లకోట, న్యూస్‌టుడే: విజయవాడ-విశాఖపట్నం-విజయవాడ మార్గంలోని సామర్లకోట జంక్షన్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని రైల్వే గేటును అధికారులు బుధవారం నుంచి మూసివేశారు. సామర్లకోట-కాకినాడ, విశాఖపట్నం, విజయవాడ మార్గాల్లో ప్రయాణించే ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్ట్‌, గూడ్సు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగకుండా ట్రాక్‌ను పటిష్ఠం చేసే పనులు చేపడుతున్న కారణంగా గేటు మూసివేసినట్లు స్టేషన్‌ మేనేజర్‌ ఎం.రమేశ్‌ తెలిపారు. పనులు వారం రోజుల పాటు జరుగుతాయని మార్చి 6వ తేదీ వరకు గేటును నిరంతరాయంగా మూసివేస్తామని వివరించారు. ప్రస్తుతం ఆయా మార్గాల్లో రైలు పట్టాలు కొంతవరకు కిందకు ఉన్నాయని, ట్రాక్‌ పటిష్టంతో పాటు ఎత్తు పెంచే పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నిత్యం వాహనాల రద్దీతో, ట్రాఫిక్‌ సమస్యతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొనే రైల్వే గేటును వారం రోజుల పాటు మూసివేస్తామని అధికారులు ప్రకటించడంతో వాహనదారులు, ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ మార్గంలో నిత్యం వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంటుంది. సామర్లకోట మీదుగా కాకినాడ వెళ్లే వాహనదారులకు రెండు మార్గాలు ఉన్నా అత్యధికులు రైల్వేగేటు మార్గంలోనే రాకపోకలు సాగిస్తుంటారు. మరో మార్గంగా రైల్వేస్టేషన్‌ సెంటర్‌ ఫ్లైఓవరు బ్రిడ్జి మీదుగా వెళ్లాలి. కాకినాడ వెళ్లేవారు గాంధీబొమ్మ సెంటర్‌ నుంచి రైల్వే గేటు మీదుగా కెనాల్‌రోడ్డుకు చేరుకుని రాకపోకలు సాగిస్తున్నారు. ఇలా రెండు మార్గాలు ఉన్నా పెరిగిన వాహనాలతో ట్రాఫిక్‌ సమస్య నిత్యం ఎదురవుతూనే ఉంది.

గేటువేస్తే గంటల తరబడి నిరీక్షణే..

సామర్లకోట నుంచి కాకినాడ వెళ్లాలన్నా, కాకినాడ నుంచి సామర్లకోట రావాలన్నా ప్రధాన మార్గంలో ఉన్న ఈ గేటు వద్ద గంటల తరబడి వేచి ఉండాలి. ప్రధాన పట్టణాలు, పరిసర ప్రాంతాలైన జగ్గంపేట, ప్రత్తిపాడు, పెద్దాపురం గోకవరం వాసులు దగ్గర దారని రైల్వే గేటులోంచే రాకపోకలు సాగిస్తుంటారు. విశాఖపట్నం-విజయవాడ మార్గంలో సామర్లకోట ప్రధానమైన రైల్వేజంక్షన్‌ కావడంతో రైళ్ల రాకపోకల తాకిడి అధికంగా ఉంటోంది. ఒక్కోసారి గేటు వేస్తే నాలుగైదు ప్రయాణికుల రైళ్లు, ఒకటీ, రెండు గూడ్సు రైళ్లు వెళ్లే వరకు తెరిచే అవకాశం ఉండదు. దీంతో వాహనదారులు ఎండ, వర్షంలో నిరీక్షించాల్సి వస్తుంది. ప్రస్తుతం ట్రాక్‌ పటిష్టం చేసే పనుల కారణంగా వారం రోజుల పాటు గేటును మూసివేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారుతుందని ప్రయాణికులు చెబుతున్నారు. మరో మార్గమైన రైల్వే వంతెన దాటి వెళ్లాలంటే బ్రిడ్జి ఇరుకు కావడం, అధిక సంఖ్యలో ఏడీబీ, కెనాల్‌ రోడ్డు, ఏజెన్సీ ప్రాంతాలకు నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు ఉంటాయి. ఇదే రోడ్డులో అధిక సంఖ్యలో ఉదయం, సాయంత్రం వేళల్లో పలు విద్యా సంస్థల బస్సులు వందల సంఖ్యలో తిరుగుతుంటాయి. అలాగే పరిశ్రమలు, గోదాములు, గ్రావెల్‌ తరలించే భారీ వాహనాలు మితిమీరిన వేగంతో రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రస్తుతం గేటు మూసివేసిన కారణంగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు మొత్తం వాహనాలన్నీ బ్రిడ్జిపై నుంచే వెళ్లాల్సి రావడంతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


వంతెనపై రెండు వైపులా సిబ్బంది..

గేటు మూసివేసిన నేపథ్యంలో పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య లేకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం. ట్రాఫిక్‌ పోలీసులను ఏర్పాటుచేసి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. బ్రిడ్జిపై రెండువైపులా సిబ్బందిని నియమించి రాకపోకలు క్రమబద్ధీకరిస్తాం.

సురేష్‌, సీఐ, సామర్లకోట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని