logo

ఉద్యమ స్ఫూర్తితో ఎన్నికల్లో ఓటేద్దాం!

‘ప్రజాస్వామ్యానికి సవాలుగా మారిన ఈ ఎన్నికల్లో ఓటర్లు ఉద్యమ స్ఫూర్తితో ఓటు వేయాలి.. నిశ్శబ్ద విప్లవం మొదలైతే.. ఏ నియంతృత్వశక్తీ నిలవలేదు. చివరికి గెలిచేది ప్రజలే.. ప్రజాస్వామ్యమే..

Updated : 29 Feb 2024 06:21 IST

సీఎఫ్‌డీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌

సదస్సులో పాల్గొన్న విద్యార్థినులు

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, కాకినాడ నగరం: ‘ప్రజాస్వామ్యానికి సవాలుగా మారిన ఈ ఎన్నికల్లో ఓటర్లు ఉద్యమ స్ఫూర్తితో ఓటు వేయాలి.. నిశ్శబ్ద విప్లవం మొదలైతే.. ఏ నియంతృత్వశక్తీ నిలవలేదు. చివరికి గెలిచేది ప్రజలే.. ప్రజాస్వామ్యమే.. అని రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి, సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ(సీఎఫ్‌డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అన్నారు. కాకినాడలోని దంటు కళాక్షేత్రంలో బుధవారం నిర్వహించిన సీఎఫ్‌డీ రాష్ట్రస్థాయి కళాజాతలో ముఖ్య అతిథిగా మాట్లాడారు. అధికారులు.. ప్రజాప్రయోజనం కోసం పనిచేయాలని హితవు పలికారు. అక్రమాలు బహిర్గతం అయితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. యువ, పట్టణ, నిరాశక్తతతో ఉన్న ఓటర్లచేత ఓటు వేసే ఒక సామాజిక బాధ్యతను గుర్తుచేయాలన్నది కళాజాత ఉద్దేశమన్నారు. ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురికాకుండా.. వివేకంతో ఓటు వేసి రాజ్యాంగస్ఫూర్తిని కాపాడాలని కోరారు.


అంతా శపథం చేయండి

ప్రభుత్వాన్ని నిలబట్టే.. పడగొట్టే సామర్థ్యం ఓటుకే ఉంది. ప్రజా వ్యతిరేకతను చూపాలన్నా, సమర్థ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నా ఇదే కీలకం. నాది ఒక్క ఓటేకదా.. వేయకపోయినా ఏమవుతుందనే అభిప్రాయం వద్దు. విజేతలను నిర్ణయించేది కొద్ది ఓట్లే. అయిదేళ్ల పాలనను, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఆరోజు సద్వినియోగం చేసుకోవాలి. పట్టణ, నగరాల్లో ఓటింగ్‌ శాతం తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఓటు వేయాలనే శపథం ప్రతిఒక్కరూ తీసుకోవాలి.  

ఐ.వి.రావు, పూర్వ ఉప కులపతి, ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం


పరిష్కారం.. మంచి పాలన

రాజకీయం పవిత్ర గ్రంథం అనే రోజుల నుంచి.. ఇప్పుడు అనైతిక, ప్రజాకంటక వ్యవస్థగా మారిపోయింది. మార్పునకు ప్రజాచైతన్యమే మార్గం. ప్రజాహితం కాంక్షించని పార్టీలను మార్చుకోవాలి.. మరో ప్రత్యామ్నాయం లేదు. చెత్త పాలనకు పరిష్కారం మంచిపాలన. బాధ్యతగా ఓటు వేస్తే మార్పు వస్తుందన్నది యువత గుర్తెరగాలి. మెరుగైన సమాజం కోసం శ్రమించాలి.

ఉప్పలపాటి మాచిరాజు, సామాజిక ఉద్యమకారుడు


తప్పుడు ఓట్లు పోలవ్వకుండా చూడాలి

ప్రజాస్వామ్యాన్ని కాపాడం.. ఓటర్లలో చైతన్యం తేవడం.. సమాజంలో లోపాలను ఎత్తిచూపడమే లక్ష్యంగా సీఎఫ్‌డీ పనిచేస్తోంది. ఓటర్ల జాబితాలో లోపాలను ఎన్నికల కమిషన్‌, న్యాయస్థానం, మీడియా దృష్టికి తీసుకెళ్లి కొంత వరకు ప్రక్షాళన చేయగలిగాం. ఇంకా చనిపోయిన వారి పేరుతో ఓట్లున్నాయి. తప్పుడు ఓట్లు నమోదయ్యాయి. ఇలాంటి ఓట్లు పోలవ్వకుండా చూడాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వ యంత్రాంగం ఫలానా పార్టీకి ఓటెయ్యమని చెప్పదు. మన రాష్ట్రంలో మాత్రం అలాంటి పరిస్థితి ఉంది.

వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, సంయుక్త కార్యదర్శి, సీఎఫ్‌డీ


గత ప్రయత్నాలకు మించి ఉండాలి

17వ లోక్‌సభలో 540 మంది ఎంపీలు ఉంటే.. దాదాపు 240 మందికి నేర చరిత్ర ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మార్పుకోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవకతవకలు ఆగడంలేదు. మనం చేయాల్సిన ప్రయత్నం ఇంతకు ముందు చేసిన ప్రయత్నాలకు మించి ఉండాలి. విలువలున్న నాయకులను ఎన్నుకోవాలి.

జి.అబ్బయ్య, విశ్రాంత ఆచార్యుడు, జేఎన్‌టీయూకే


  • రంగం రాజేశ్‌ ఆధ్వర్యంలోని కళాకారుల బృందం ఓటు చైతన్యంపై నిర్వహించిన కళాజాత ఆహుతులను ఆలోచింపజేసింది. చనిపోయినవారికీ ఓట్లున్నాయనే నృత్యరూపకం ఆలోచింపజేసింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు