logo

డ్రోన్లు ఎగరలేదు..!

రైతులకు అన్ని విధాలా అండగా ఉంటున్నాం.. సాగులో పెట్టుబడులు తగ్గించడానికి, కూలీల కొరత అధిగమించడానికి యాంత్రీకరణ తీసుకొస్తున్నాం.

Published : 29 Feb 2024 05:50 IST

ఏడాదిగా బృందాలకు తప్పని ఎదురుచూపులు

వరి చేలో కూలీతో పురుగు మందు పిచికారీ

రైతులకు అన్ని విధాలా అండగా ఉంటున్నాం.. సాగులో పెట్టుబడులు తగ్గించడానికి, కూలీల కొరత అధిగమించడానికి యాంత్రీకరణ తీసుకొస్తున్నాం. రైతు భరోసా కేంద్రాల స్థాయిలో సీహెచ్‌సీ బృందాలు ఏర్పాటు చేసి చేలో పురుగు మందులు చల్లడానికి రాయితీపై డ్రోన్లు అందిస్తున్నాం. వీటి వల్ల రైతులకు ప్రయోజనంతోపాటు యువతకు ఉపాధి లభిస్తుంది. డిసెంబరు నాటికి 1500 డ్రోన్లు రైతులకు అందించాలి’.. గత ఏడాది మార్చిలో వ్యవసాయ శాఖ సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్న మాటలివి..


న్యూస్‌టుడే, ముమ్మిడివరం: పంటల సాగుకు రోజు రోజుకూ పెరుగుతున్న పెట్టుబడులు.. కూలీల కొరతను అధిగమించడానికి యాంత్రీకరణ ఆవశ్యకత ఎంతో ఉంది. ఈ దిశగా ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం బాటలు వేస్తోందని పాలకులు హడావుడి చేయడం మినహా ఆచరణలో మాత్రం చూపడం లేదు. రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో సంఘాలు ఏర్పాటు చేసి.. రాయితీపై డ్రోన్లు అందించేందుకు కార్యాచరణ రూపొందించినా.. అమలుకు నోచుకోని పరిస్థితి. సాధారణ పిచికారీతో పోలిస్తే 30 శాతం ఆదా అవుతుందని.. సరైన మోతాదులో పంటలపై పురుగు, తెగుళ్ల మందులు పడి వాటి నిర్మూలనకు పని చేస్తాయని డ్రోన్లు వినియోగానికి రూపకల్పన చేశారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని 22 మండలాల్లో 1.85 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. మండలానికి మూడు చొప్పున జిల్లాలో 66 డ్రోన్లు అందించడానికి కార్యాచరణ రూపొందించారు. తొలివిడతగా 21 అందించాలనే లక్ష్యంతో గత ఏడాది రైతు భరోసా కేంద్రం పరిధిలో  ఇప్పటి వరకు 20 రైతు సంఘాలను ఎంపిక చేసి సంఘానికి ఒకరు చొప్పున 13 మందికి తాడేపల్లిలో శిక్షణ కూడా ఇచ్చారు. మరో ఏడుగురికి ఇవ్వాల్సి ఉంది. అయితే శిక్షణ ఇచ్చిన గ్రూపులకు సైతం డ్రోన్లు అందించని పరిస్థితి కనిపిస్తోంది. గత ఖరీఫ్‌ సీజన్‌లో ఇవ్వాల్సిన డ్రోన్లు.. ప్రస్తుత రబీ సాగు చివరి దశకు వస్తున్నా.. అందించకపోవడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ముందు చెల్లించండి.. తర్వాత ఇస్తాం..

వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అందించే డ్రోన్‌ యూనిట్‌ విలువ రూ.10 లక్షలు. ఇందులో 40 శాతం ప్రభుత్వం రాయితీ.. 10 శాతం సంఘం వాటాగా చెల్లించాలి. మిగిలిన 50 శాతం బ్యాంకుల ద్వారా రుణం అందజేస్తారు. అయితే సంఘం వాటా 10 శాతం అంటే రూ.లక్షతోపాటు ప్రభుత్వ రాయితీ 40 శాతం అంటే రూ.4 లక్షలు వెరసి రూ.5 లక్షలు లబ్ధిదారులు ముందుగా చెల్లిస్తే.. బ్యాంకు రుణం రూ.5 లక్షలతో కలిపి డ్రోన్‌ ఇస్తారు. ప్రభుత్వ రాయితీ రూ.4 లక్షలు తర్వాత రైతు గ్రూపు ఖాతాలకు వేస్తారు. నిధుల కొరతతో ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వం నుంచి నిర్థిష్టమైన ఆదేశాలు రాలేదని తెలుస్తోంది.


నిబంధనలతో ఇక్కట్లు..

డ్రోన్లు పొందేందుకు అయిదుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన బృందంలో ఒకరు తప్పని సరిగా పదో తరగతి ఉత్తీర్ణుడై.. మరొకరు పాస్‌పోర్టు కలిగి ఉండాలి. డ్రోన్‌ శిక్షణ పూర్తి చేసుకున్న వారు మూడేళ్ల పాటు సేవలు అందిస్తామని అంగీకారపత్రం సమర్పించాలి. ఈ లోపు ఎవరైనా గ్రూపు నుంచి బయటకు వెళ్లిపోతే ప్రభుత్వానికి రూ.75 వేలు చెల్లించాల్సి ఉంటుంది.


13 మందికి పైలట్‌ శిక్షణ పూర్తి..

తొలి విడతగా జిల్లాకు 20 డ్రోన్లు మంజూరయ్యాయి. వీటిని అందజేసేందుకు సంఘాలను గుర్తించాం. నాలుగు నెలల క్రితమే ఈ ప్రక్రియ పూర్తయింది. వీటికి సంబంధించి 13 మందికి శిక్షణ ఇచ్చాం. ప్రభుత్వం డ్రోన్లు విడుదల చేసిన వెంటనే రైతులకు అందిస్తాం. వరిలో ఆశించే చీడపీడలు, తెగుళ్ల నివారణకు డ్రోన్లు ద్వారా పురుగు మందు పిచికారీ చేస్తే రైతులకు సమయంతోపాటు పెట్టుబడి ఆదా అవుతుంది. కూలీల కొరత అధిగమించొచ్చు.

వి.బోసుబాబు, జిల్లా వ్యవసాయాధికార

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని