logo

ప్రచార ఆర్భాటంగా ఉద్యోగ మేళా

నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రాజమహేంద్రవరం ఎంపీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ మెగా ఉద్యోగ మేళాలో అధికార పార్టీ ప్రచార ఆర్భాటమే తప్ప నిరుద్యోగ యువత ఊహించినంత స్థాయిలో ఉపాధి అవకాశాలు లేవు.

Published : 29 Feb 2024 05:54 IST

జీతాల వివరాలతో ప్రదర్శించిన ఫ్లెక్సీ చూస్తున్న యువత

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రాజమహేంద్రవరం ఎంపీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ మెగా ఉద్యోగ మేళాలో అధికార పార్టీ ప్రచార ఆర్భాటమే తప్ప నిరుద్యోగ యువత ఊహించినంత స్థాయిలో ఉపాధి అవకాశాలు లేవు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిరుద్యోగ యువతను మభ్యపెట్టేందుకు అధికార పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి ఒత్తిడిపై ఏర్పాటు చేసిన ఈ మేళాలో 150కు పైగా ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించి సుమారు 6 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారని చెప్పుకొచ్చారు. దీని నిర్వహణకు నైపుణ్యాభివృద్ధి సంస్థతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేసి ఆయా అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు.  ప్రతి మండలం నుంచి కనీసం వంద మంది పాల్గొనేలా సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ద్వారా విస్తృత ప్రచారానికి ఆదేశించారు.  దీంతో జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత ఎంతో ఆశతో వచ్చారు.

తక్కువ జీతాలే..

ఇక్కడ చూస్తే 101 ప్రైవేటు కంపెనీల ప్రతినిధులే రాగా వీటిలో ఎక్కువగా చిన్నవే. రూ.10 వేల నుంచి రూ.15 వేలలోపు జీతాలిచ్చే కిందిస్థాయి, ఫీల్డ్‌ ఉద్యోగాలకే ఎక్కువగా అభ్యర్థుల ఎంపికలు నిర్వహించడం, కొన్ని ఉద్యోగాలకు దూరప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో యువత పెదవి విరిచారు. తమ విద్యార్హతలకు ఇవేం ఉద్యోగాలంటూ చాలామంది పేర్లు నమోదు చేయించుకోకుండానే వెనుదిరిగారు. 3,247 మంది మాత్రం వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు పేర్లు నమోదు చేయించుకోగా వీరిలో 1,012 మందిని ఎంపిక చేశారు. కొన్ని కంపెనీలు 15 నుంచి 30 మందిని ఎంపిక చేయగా మరికొన్ని ఇద్దరు, ముగ్గురిని ఎంపిక చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని