logo

విచ్చలవిడి తవ్వకాలతో పొట్టకొట్టొద్దు

ధవళేశ్వరం పరిధిలో ఇసుక ర్యాంపులలో రేయింబవళ్లు జరుగుతున్న అక్రమ డ్రెడ్జింగ్‌ పనులకు నిలిపివేయాలని బోట్స్‌ మెన్‌ సొసైటీ కార్మికులు బుధవారం గాయత్రీ-1 ర్యాంపు వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు.

Published : 29 Feb 2024 05:59 IST

కార్మికుల ఆందోళన

ఆందోళన చేస్తున్న బోట్స్‌ మెన్‌ సొసైటీ కార్మికులు

ధవళేశ్వరం,(బొమ్మూరు): ధవళేశ్వరం పరిధిలో ఇసుక ర్యాంపులలో రేయింబవళ్లు జరుగుతున్న అక్రమ డ్రెడ్జింగ్‌ పనులకు నిలిపివేయాలని బోట్స్‌ మెన్‌ సొసైటీ కార్మికులు బుధవారం గాయత్రీ-1 ర్యాంపు వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాటన్‌ బ్యారేజీ సమీపంలో జరుగుతున్న ఇసుక అక్రమ డ్రెడ్జింగ్‌ను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. డ్రెడ్జింగ్‌ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరిపి తరలిస్తుండడంతో మూడువేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాటన్‌ బ్యారేజీ నుంచి మూడు కిలోమీటర్ల లోపు ఇసుక తవ్వకాలు జరపకూడదని, యంత్రాలను, భారీ వాహనాలను వినియోగించరాదన్న నిబంధనలు ఉన్నప్పటికీ.. రాత్రి పగలు తేడా లేకుండా ఇష్టానుసారం డ్రెడ్జింగ్‌ చేస్తున్నారని ఆరోపించారు. దీంతో బ్యారేజీ మనుగడకు ముప్పు ఏర్పడే ప్రమాదముందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ డ్రెడ్జింగ్‌ను అరికట్టాలని, లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బోట్స్‌ మెన్‌ సొసైటీ కార్మికుల ఆందోళనతో గోదావరి గట్టుపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ధవళేశ్వరం ఎస్సై క్రాంతికుమార్‌ ర్యాంపు వద్దకు చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. కార్యక్రమంలో లేబర్‌ యూనియన్‌ అధ్యక్షుడు వెంకటరావు, శ్రీను, సునీల్‌, అప్పన్న, పోతురాజు, ప్రసాద్‌, కిరణ్‌, వెంకటేశ్వరరావు, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని