logo

అయిదేళ్ల పాలనకు ఆలోచించి ఓటేయాలి

నవ సమాజ నిర్మాణంలో భాగంగా విజ్ఞత కలిగిన అభ్యర్థులను ఎన్నుకోవాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందని సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ(సీఎఫ్‌డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ సూచించారు.

Published : 29 Feb 2024 06:08 IST

సదస్సులో మాట్లాడుతున్న ఎల్‌వీ సుబ్రహ్మణ్యం. చిత్రంలో నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌, ముప్పాళ్ల సుబ్బారావు తదితరులు

టి.నగర్‌(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: నవ సమాజ నిర్మాణంలో భాగంగా విజ్ఞత కలిగిన అభ్యర్థులను ఎన్నుకోవాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందని సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ(సీఎఫ్‌డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ సూచించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సీఎఫ్‌డీ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రస్థాయి కళాజాత నిర్వహించారు. ‘ఓటు వేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం’ పేరిట హోటల్‌ రివర్‌బేలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమేశ్‌కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఓటు హక్కును ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సి ఉందన్నారు. మేధావులు, విద్యావేత్తలు అంతా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కోరారు. ఓటుతోనే ప్రజాభిప్రాయంతో కూడిన పాలన తీసుకురాగలమని అభిప్రాయపడ్డారు. అయిదేళ్ల పాలన కోసం ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మార్పు మన దగ్గర నుంచి మొదలవ్వాల్సి ఉందన్నారు. గతంలో పేద, మధ్యతరగతి పరిస్థితుల నుంచి రాజకీయ నేతలు పుట్టుకొచ్చేవారన్నారు. అదే సంస్కృతి పునరావృతం కావాలంటే మేధావివర్గం మౌనం వీడి ముందుకు రావాల్సి ఉందన్నారు.  


రాష్ట్రంలో అరాచక పాలన

ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. ఇలాంటి సందర్భాల్లో మేధావుల మౌనం మంచిదికాదు. ఓటు హక్కు వినియోగించుకుని రాజులవుతారో, లేదంటే బానిసలుగా మిగిలిపోతారో ప్రజలే నిర్ణయించుకోవాలి. ప్రజాధనంతో గౌరవవేతనం ఇస్తున్న వాలంటీర్లను ప్రభుత్వం పార్టీకి వినియోగించుకుంటోంది. అన్ని వర్గాలు ఆమోదించే ప్రభుత్వం రావాలి.

ముప్పాళ్ల సుబ్బారావు, పౌరహక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు


యువత చేతుల్లోనే..

ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీ కూడా సిద్ధాంతాలు పాటించడం లేదు. దేశం బాగుపడాలంటే యువత చేతుల్లోనే ఉంది. నూతన సంస్కరణలు తీసుకొచ్చినప్పడే మార్పు సాధ్యమవుతుంది.

కంటిపూడి సర్వారాయుడు, వ్యాపారవేత్త


తప్పుడు ఓట్లు పోలవ్వకుండా చూడాలి

ప్రజాస్వామ్యాన్ని కాపాడం.. ఓటర్లలో చైతన్యం తేవడం.. సమాజంలో లోపాలను ఎత్తిచూపడమే లక్ష్యంగా సీఎఫ్‌డీ పనిచేస్తోంది. ఓటర్ల జాబితాలో లోపాలను ఎన్నికల కమిషన్‌, న్యాయస్థానం, మీడియా దృష్టికి తీసుకెళ్లి కొంత వరకు ప్రక్షాళన చేయగలిగాం. ఇంకా చనిపోయిన వారి పేరుతో ఓట్లున్నాయి. తప్పుడు ఓట్లు నమోదయ్యాయి. ఇలాంటి ఓట్లు పోలవ్వకుండా చూడాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వ యంత్రాంగం ఫలానా పార్టీకి ఓటెయ్యమని చెప్పదు. మన రాష్ట్రంలో మాత్రం అలాంటి పరిస్థితి ఉంది.

వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, సంయుక్త కార్యదర్శి, సీఎఫ్‌డీ


మేధావులు పోరాటం చేయాలి

కొత్త సమాజం కోసం మేధావులు పోరాటం కొనసాగించాలి. తద్వారా బలమైన పునాది వేయగలం. భవిష్యత్తులో దాని ఫలితాలు ఉంటాయి.

కృష్ణకుమార్‌, జర్నలిస్టు


సద్వినియోగం చేసుకోవాలి

అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసే ప్రభుత్వం అవసరం. మంచి పాలన కోసం ప్రతిఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలి. అందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి.

నిరూపరాణి, నన్నయ వర్సిటీ మాజీ వీసీ


మంచోడెవరో.. ముంచేదెవరో చూసిమరీ ఓటేద్దాం..

రంగం రాజేశ్‌ ఆధ్వర్యంలోని కళాకారుల బృందం ఓటు చైతన్యంపై నిర్వహించిన కళాజాత ఆహుతులను ఆలోచింపజేసింది. ‘నాయకుడు కాదు.. ఓటరు గెలవాలి.. ఓటేసే బాధ్యత స్వీకరించాలి.. మెరుగైన సమాజం స్థాపించాలి’.. ‘ఓటేద్దమా.. ఓటరూ ఓటేద్దమా.. మంచోడెవరో.. ముంచేది ఎవరో చూసిమరీ
ఓటేద్దామా..?’.. అంటూ సాగిన గీతాలు ఆకట్టుకున్నాయి.  చనిపోయినవారికీ ఓట్లున్నాయనే నృత్యరూపకం ఆలోచింపజేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని