logo

జగనన్న పాలన.. రైతన్న వేదన!

అన్నదాతకు అగచాట్లు తప్పడం లేదు. భారీ వర్షం కురిసినా.. వరదలు వచ్చినా పంటంతా నీట మునిగి నష్టం మిగుల్చుతుంటే.. రబీలో శివారు ఆయకట్టుకు సమర్థంగా నీరందకపోవడంతో పొలాలు బీళ్లుగా మారుతున్నాయి.

Updated : 29 Feb 2024 06:18 IST

శివారు ఆయకట్టుకు నీరందక అగచాట్లు

ఏకే మల్లవరంలో బీటలువారిన వరి పొలం

అన్నదాతకు అగచాట్లు తప్పడం లేదు. భారీ వర్షం కురిసినా.. వరదలు వచ్చినా పంటంతా నీట మునిగి నష్టం మిగుల్చుతుంటే.. రబీలో శివారు ఆయకట్టుకు సమర్థంగా నీరందకపోవడంతో పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత కాలువల నిర్వహణ పూర్తిగా గాలికొదిలేసింది. మరమ్మతులు, నిర్వహణకు నిధులు అవసరమని ప్రతిపాదనలు పంపిస్తున్నా మంజూరు కాకపోవడంతో సమస్య తీవ్రత పెరుగుతోంది. కేవలం రైతుల నుంచి వసూళ్లు చేసిన నీటి తీరువా డబ్బులతో కొన్నిచోట్ల పూడిక తొలగించి మమ అనిపిస్తున్నారు. ఎక్కువ ప్రాంతాల్లో రైతులే చందాలు వేసుకుని కాలువల్లో పూడిక తీసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి జగన్‌ ఏలుబడిలో నెలకొంది.


ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, పిఠాపురం, మామిడికుదురు, ముమ్మిడివరం: సమగ్ర నీటి యాజమాన్యం లేక.. కాలువల నిర్వహణ గాలికొదిలేయడంతో గోదావరి డెల్టా పరిధిలోని మామిడికుదురు, ముమ్మిడివరం, అల్లవరం, ఏలేరు ఆయకట్టు పరిధిలోని పిఠాపురం, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి మండలాల పరిధిలో వేల ఎకరాలు నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాయి. వంతులవారీ విధానంలో సాగునీరు అందిస్తున్నామని అధికారులు చెబుతున్నా.. శివారుకు జలాలు అందక రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి.

కోనసీమ జిల్లాలో..

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 1.84 లక్షల ఎకరాల్లో రబీ సాగు జరుగుతోంది. సాగు చేపట్టి రెండు నెలలు పూర్తయిన తరుణంలో ఇక్కడ నుంచి వరి చేలకు నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ జిల్లాలో జలవనరుల శాఖ అధికారులు వంతుల వారీ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీంతో శివారు భూములకు నీటి కష్టాలు మొదలయ్యాయి. ముమ్మిడివరం మండలంలో సోమిదేవరపాలెం, అయినాపురం, కాట్రేనికోన మండలంలో పల్లంకుర్రు, ఐ.పోలవరం మండలంలో కేశనకుర్రు, తిళ్లకుప్ప, అల్లవరం, మామిడికుదురు, రాజోలు, ఉప్పలగుప్తం తదితర మండలాల్లోని శివారు ఆయకట్టుకు సాగునీరు అందని పరిస్థితి. మామిడికుదురు మండలం నగరంలోని సుమారు 200 ఎకరాలు పొలాలు నీరందక ఎండిపోతోంది. జిల్లాలోని సుమారు 4 వేల ఎకరాల్లో శివారు వరి చేలు ఉన్నాయి. వంతుల వారీ విధానంలో నీటి విడుదల చేసినపుడు ఈ ప్రాంతాల్లోని కాలువలకు నీటిమట్టం పెంచాలని రైతులు కోరుతున్నారు.

ఎత్తిపోతలతో అదనపు భారం

శివారు ప్రాంత రైతులు ఆయిల్‌ ఇంజిన్లతో నీటిని తోడుకుంటున్నారు. ఎకరాకు రూ.3 వేలు వరకు భారం భరిస్తున్నారు. మురుగు కాలువల నుంచి ఆయిల్‌ ఇంజిన్లు ద్వారా నీటిని ఎత్తిపోయడానికి ప్రభుత్వం నిధులిస్తామని చెప్పడంతో కొందరు వాటిని ఏర్పాటు చేసినా పైసా రాలేదు.
ః సాగునీటి ఎద్దడి ఘంటికలు మోగుతున్నా ఎక్కడా క్రాస్‌బండ్‌ల ఊసేలేదు. మురుగు కాలువలకు క్రాస్‌ బండ్‌లు (అడ్డుకట్టలు) వేయడం ద్వారా ఎంతో కొంత నీటి ఎద్దడిని నివారించే అవకాశం ఉంటుంది.

పీబీసీ పరిధిలో ఆరు వేల ఎకరాల్లో..

పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ఏలేరు, పిఠాపురం బ్రాంచి కెనాల్‌(పీబీసీ) ఆధారంగా 17,000 ఎకరాల ఆయకట్టు ఉంది. గత డిసెబరులో రబీ పూర్తి ఆయకట్టుకు నీరందిస్తామని అధికారులు ప్రకటించడంతో రైతులు సాగుబాట పట్టారు. పొట్ట దశలో ఉన్న పంటకు 20 రోజులుగా నీరు అందకపోవడంతో పొలాలన్నీ బీళ్లుగా మారుతున్నాయి. పిఠాపురం మండలంంలో పి.దొంతమూరు, వెల్దుర్తి, పి.రాయవరం, పి.తిమ్మాపురం, జల్లూరులో 3,000 ఎకరాలు, గొల్లప్రోలు మండలంలో ఏపీ మల్లవరం, ఏకే మల్లవరం, సీతానగరం, గొల్లప్రోలు శివారులో 2,000 ఎకరాలు, కొత్తపల్లి మండలంలోని రమణక్కపేట, ఇసుకపల్లిలో సుమారు 1,000 ఎకరాల్లో సమస్య తీవ్రంగా ఉంది. సమస్య పరిష్కరించాలని రైతులు ఆందోళన బాట పట్టి కలెక్టర్‌కు సైతం వినతిపత్రం అందజేశారు.


ఆ పథకం ఉండుంటే సస్యశ్యామలం

గోదావరి జలాలను ఏలేరుకు అనుసంధానం చేయడం ద్వారా మెట్టలోని మొత్తం ఆయకట్టుకు రెండు పంట కాలాల్లోనూ పుష్కలంగా నీరందేది. పురుషోత్తపట్నం ప్రాజెక్టు న్యాయవివాదంలో ఉండడంతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. కిర్లంపూడి మండలం గెద్దనాపల్లి నుంచి సింహాద్రిరాజు కాలువలో తూడు పెరగడంతో నీటి ప్రవాహానికి ఆటంకం తప్పడం లేదు. 


ఇదే పరిస్థితి కొనసాగితే పంట ఎండిపోతుంది

మాది గొల్లప్రోలు మండలం ఏపీ మల్లవరం. 11 ఎకరాలు కౌలుకి చేస్తున్నా. పొట్టదశలో పంటకు సాగునీటి సమస్య నెలకొంది. ఇదే పరిస్థితి మరో రెండ్రోజులుంటే పంట ఎండిపోయే ప్రమాదం ఉంది. ఏలేరు రిజర్వాయర్‌ నుంచి అధికంగా ఈ ప్రాంతానికి నీరు విడుదల చేయాలి.

అబ్బిరెడ్డి లోవరెడ్డి  


నెర్రెలు తీస్తున్నా గోడు పట్టదా

మామిడికుదురు మండలంలోని నగరంలో రెండెకరాల్లో దాళ్వా వరి పంట వేశా. ఇప్పటి వరకు ఎకరాకు సుమారు రూ.20 వేలు ఖర్చుచేశా. మూడు వారాలుగా సాగునీరు అందకపోవడంతో చేలు నెర్రెలు తీస్తున్నాయి. నాట్లు వేసినప్పుడు తప్ప మళ్లీ సాగు జలాలు రాలేదు. వంతుల వారీగా ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారే తప్ప బోదెల్లోకి నీరు రావడం లేదు. సార్వా పంట వర్షం ముంపు కారణంగా మొత్తం దెబ్బతింది.

ఉచ్చుల వీరవెంకటసత్యనారాయణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు