logo

కుమార్తెను చూసేందుకు వెళ్తూ మృత్యువాత

కుమార్తెను చూసేందుకు వెళ్తున్న ఓ తండ్రి రహదారి ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. ఈ ఘటన నల్లజర్ల మండలం వీరవల్లి టోల్‌ప్లాజా వద్ద గురువారం చోటుచేసుకుంది.

Published : 01 Mar 2024 02:16 IST

చవల కృష్ణమూర్తి

నల్లజర్ల, న్యూస్‌టుడే: కుమార్తెను చూసేందుకు వెళ్తున్న ఓ తండ్రి రహదారి ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. ఈ ఘటన నల్లజర్ల మండలం వీరవల్లి టోల్‌ప్లాజా వద్ద గురువారం చోటుచేసుకుంది. ఏఎస్సై మోహన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేట గ్రామానికి చెందిన చవల కృష్ణమూర్తి(55) వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈయనకు భార్య వీరలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె తేజ అంజలికి దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన బొట్టా వీరదుర్గారావుతో వివాహమైంది. చిన్న కూతురు డాలీ కల్పన 10వ తరగతి చదువుతోంది. అంజలిని చూసేందుకు ద్విచక్రవాహనంపై స్వగ్రామం నుంచి బయలుదేరారు. వీరవల్లి టోల్‌ ప్లాజా సమీపంలో విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. తీవ్రగాయాలైన కృష్ణమూర్తిని తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై మోహన్‌రావు తెలిపారు.


చికిత్స పొందుతూ వైద్యుడి మృతి

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వైద్యుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. కొవ్వూరు పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా మైదుకూరు మండలం తిక్కలవారిపల్లికి చెందిన అంకిరెడ్డిపల్లి కొండారెడ్డి (37) రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో వైద్యునిగా పని చేస్తున్నారు. గత నెల 25న రాత్రి విధులు నిర్వర్తించి 26న ఉదయం ద్విచక్ర వాహనంపై దేవరపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్తున్నారు. గామన్‌ వంతెనపై కొవ్వూరు వైపు 1వ స్తంభం వద్దకు వచ్చేసరికి వాహనం అదుపుతప్పి పడిపోగా తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్య సేవలు అందించారు. చికిత్స పొందుతున్న కొండారెడ్డి గురువారం ఉదయం మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి సంటి కొండారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ సీహెచ్‌ బాబూరావు తెలిపారు.


అవినీతికి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగికి మూడేళ్ల జైలు

రాజమహేంద్రవరం నేరవార్తలు: విధి నిర్వహణలో అవినీతికి పాల్పడిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ రాజమహేంద్రవరం అనిశా న్యాయస్థానం న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. అనిశా ఉమ్మడి జిల్లా డీఎస్పీ డి.శ్రీహరి రాజు తెలిపిన వివరాల మేరకు.. కాకినాడ పట్టణానికి చెందిన ముడుగుజాన్‌ కెనడి రాజ్‌కుమార్‌ అనే వ్యక్తి 2016లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏపీ స్టేట్‌ సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ జిల్లా మేనేజర్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌ మేనేజర్‌ (జనరల్‌)గా పనిచేసేవారు. ఆ సమయంలో మండపేట ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి నిత్యావసర వస్తువులను కపిలేశ్వరపురం, ఆలమూరు మండలాల్లోని దుకాణాలకు రవాణా చేసేందుకు సంబంధించిన వర్కు ఆర్డర్‌ నిమిత్తం ఆలమూరు మండలం పెనికేరు గ్రామానికి చెందిన వైట్ల వెంకట్రావు, అతడి కుమారుడు అప్పటి మేనేజర్‌ రాజ్‌కుమార్‌ను కలిశారు. ఆ పని నిమిత్తం రాజ్‌కుమార్‌ రూ.20 వేలు లంచం డిమాండ్‌ చేయడంతో బాధితులు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో 2016 సెప్టెంబరు 23న అనిశా అధికారులు వలపన్ని పట్టుకున్నారు. కేసును సీఐ బి.శ్రీనివాసరావు దర్యాప్తు జరిపి నిందితుడ్ని అనిశా న్యాయస్థానంలో హాజరు పరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి యు.యు.ప్రసాద్‌ తుది తీర్పును గురువారం వెలువరించారు. నేరం రుజువైనందున రాజ్‌కుమార్‌కు మూడేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే మరో మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు. ఈ కేసులో పీపీలుగా పి.శేషయ్య, ఎంవీ.దుర్గాప్రసాద్‌లు వారి వాదనలు వినిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని