logo

రోడ్డు ప్రమాదంలో నవ వరుడు దుర్మరణం

ఇంటికి కట్టిన తోరణాలు పచ్చగానే ఉన్నాయి. పెళ్లి సందడి కొనసాగుతోంది. వివాహమై పది రోజులైనా అవ్వకముందే జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో నవ వరుడు మృత్యువాతపడ్డాడు.

Published : 01 Mar 2024 06:58 IST

విషయం తెలిసి భార్య ఆత్మహత్యాయత్నం

అంజిబాబు (పాతచిత్రం)

గోపాలపురం, మొగల్తూరు, న్యూస్‌టుడే: ఇంటికి కట్టిన తోరణాలు పచ్చగానే ఉన్నాయి. పెళ్లి సందడి కొనసాగుతోంది. వివాహమై పది రోజులైనా అవ్వకముందే జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో నవ వరుడు మృత్యువాతపడ్డాడు. దీంతో ఆనందం నిండిన ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. ఆ యువకుడి దివ్యాంగ తల్లిదండ్రులు, నూరేళ్లు కలిసి కాపురం చేసేందుకు అత్తింట్లో అడుగుపెట్టిన భార్య.. ఆసరా కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. మొగల్తూరు మండలం కొత్తోటకు చెందిన ఏనుగుల అంజిబాబు(30) జనసేనాని వీరాభిమాని. అతని తల్లి ఆదిలక్ష్మికి మాటలు రావు. తండ్రి చక్రపాణికి కళ్లు కనబడవు. వీరి కుమార్తెకు గతంలోనే వివాహమైంది. వృద్ధ దంపతులు కుమారుడి కష్టార్జితంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గత నెల 24న అంజిబాబుకు పాలకొల్లు మండలం లంకలకోడేరుకు చెందిన శిరీషతో వివాహమైంది. అంతలోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటన తెలుసుకున్న ఆమె విషరసాయనం తాగి ఆత్మహత్మాయత్నం చేశారు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆమెను ఇంటికి తరలించారు. ఈ సంఘటనలతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అతని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

స్నేహితుడి ఇంటికి వెళ్లి వస్తూ..

తాడేపల్లిగూడెంలో గత నెల 28న నిర్వహించిన సభకు వెళ్లిన అంజిబాబు అక్కడి నుంచి ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలోని తన స్నేహితుడి ఇంటికి వెళ్లారు. బుధవారం రాత్రి అక్కడి నుంచి తిరిగి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం గ్రామశివారు పెట్రోలుబంకు సమీపంలో జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం డీకొట్టింది. ప్రమాదం జరిగిన సయయంలో ఎవరూ గమనించలేదు. పోలీసులు అర్ధరాత్రి సమయంలో గుర్తించి రహదారిపై పడివున్న అంజిబాబును పరీక్షించారు. అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అతని చొక్కాజేబులో ఉన్న కార్డుల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని