logo

మా ఓటు రంపచోడవరంలోనే ఉండాలి

మా గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలు ముంపులో ఉన్నందున అధికారులు సూచించిన మాదిరిగా కృష్ణునిపాలెంలో ఓటు హక్కు వినియోగించుకుంటామని.. మా ఓట్లు మాత్రం రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోనే ఉంచాలని దేవీపట్నం, తొయ్యేరుకు చెందిన పోలవరం నిర్వాసితులు స్పష్టం చేశారు.

Published : 01 Mar 2024 02:22 IST

తొయ్యేరు, దేవీపట్నం నిర్వాసితులు
న్యాయ పోరాటం చేస్తామని వెల్లడి

దేవీపట్నం పునరావాస కాలనీలో నిర్వాసితులతో మాట్లాడుతున్న సబ్‌కలెక్టర్‌ ప్రశాంత్‌కుమార్‌

ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, దేవీపట్నం, గోకవరం: మా గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలు ముంపులో ఉన్నందున అధికారులు సూచించిన మాదిరిగా కృష్ణునిపాలెంలో ఓటు హక్కు వినియోగించుకుంటామని.. మా ఓట్లు మాత్రం రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోనే ఉంచాలని దేవీపట్నం, తొయ్యేరుకు చెందిన పోలవరం నిర్వాసితులు స్పష్టం చేశారు. తమ ఓట్లు పాత ప్రాంతానికి బదిలీ జరగకపోతే న్యాయపోరాటం చేస్తామని.. శుక్రవారం ఎన్నికల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎన్నికల్లోగా పాత ప్రాంతానికి బదిలీ అవ్వకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఓట్ల బదిలీపై ‘ఈ అరాచకం.. అనంతం’ శీర్షికన ‘ఈనాడు, ఈటీవీ’ కథనానికి అధికారులు స్పందించారు. రంపచోడవరం సబ్‌కలెక్టర్‌, ఎన్నికల అధికారి ప్రశాంత్‌కుమార్‌ గురువారం కృష్ణునిపాలెం, దేవీపట్నం పునరావాస కాలనీలో గ్రామసభలు నిర్వహించి నిర్వాసితుల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఓటుహక్కు బదిలీ అయినంత మాత్రాన ప్యాకేజీ రాదనే ఆందోళన వద్దని సూచించారు. తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా తమ ఓట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం నుంచి జగ్గంపేట నియోజకర్గానికి ఎందుకు మార్చారని కొందరు నిర్వాసితులు ప్రశ్నించారు. తల దాచుకునేందుకు ఇళ్లు నిర్మించకుండా మూడేళ్ల క్రితం రాత్రికిరాత్రి గ్రామాలను బలవంతంగా ఖాళీ చేశారని, ఇప్పుడు ఓట్లు బదిలీ చేసి పూర్తిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా అని నిలదీశారు. ఇప్పటికి ఆరుగురు ఐఏఎస్‌ అధికారులు వచ్చి వెళ్లారని.. ఇప్పుడు మీరు వచ్చారని.. మా సమస్యలు పరిష్కరిస్తే మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటామని పలువురు మహిళలు కన్నీటి పర్యంతమై తెలిపారు. అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు ఈఆర్‌వో సమాధానమిచ్చారిలా..

ప్రశ్న: కనీస సమాచారం ఇవ్వకుండా గంపగుత్తగా 2,400కు పైగా ఓట్లు ఎలా మార్చుతారు. ఇప్పటికీ పునరావాసం, ప్యాకేజీలు అనేక మందికి అందలేదు.

ఈఆర్‌వో: అర్హులకు ప్యాకేజీ వేగంగా పడేలా చేస్తాం. కాలనీకి అధికారులను పంపించి అర్హుల వివరాలు వెల్లడిస్తాం. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు ఓటరు నివాసిత ప్రాంతానికి 2 కి.మీ. దూరం లేకుండా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. 

ప్రశ్న: దేవీపట్నం గ్రామస్థులకు ఇప్పటికీ ఇళ్లు నిర్మించి ఇవ్వలేదు. వారంతా వేర్వేరు గ్రామాలు, నియోజకవర్గాల్లో అద్దెకు ఉంటున్నారు. వాళ్లందరి ఓట్లు కృష్ణునిపాలెం పునరావాస కాలనీకి ఏవిధంగా బదిలీ చేశారు.

ఈఆర్‌వో: దేవీపట్నం, తొయ్యేరు గ్రామాల ఓట్లు బదిలీకి సంబంధించి 2021లో జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో తీర్మానించారు. దేవీపట్నం ప్రజలంతా మైదాన ప్రాంతానికి వచ్చారు కాబట్టి పునరావాసం కల్పించకపోయినా.. ఇక్కడే సౌకర్యవంతంగా ఉంటుందని మార్పుచేశాం.

ప్రశ్న: దేవీపట్నం, తొయ్యేరు ప్రజలు మూడేళ్ల క్రితం మైదాన ప్రాంతంలోకి రాగా.. దాదాపు ఏడేళ్ల క్రితం నుంచే 17 ముంపు గ్రామాల ప్రజలు కృష్ణునిపాలెంలో వీరితోపాటే ఉంటున్నారు. వాళ్ల ఓట్లు ఎందుకు బదిలీ చేయలేదు. 

ఈఆర్‌వో: కాకినాడలో 2021లో చేసిన తీర్మానంలో ఈ రెండు గ్రామాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి జరిగింది మరోటి ఎందుకు జరగలేదని అడిగితే.. అది యాంటీ క్వశ్చన్‌గా ఉంటుంది. తరువాత మిగతా గ్రామాల ఓట్ల బదిలీ చేసేందుకు ప్రయత్నించినా అది జరగలేదు. 

ప్రశ్న: ఓటు బదిలీ చేసినప్పుడు ఓటరుగానీ, గ్రామసభ ద్వారా అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత లేదా.

ఈఆర్‌వో: ఆ గ్రామాలు ముంపులో ఉన్నందున రేషనలైజేషన్‌ ప్రతిపాదన కింద అందర్నీ మార్చేస్తారు. 

ప్రశ్న: రెండు గ్రామాల ప్రజలు తమ ఓట్లను పాత ప్రాంతానికి బదిలీ చేయమని అడుగుతున్నారు. ఏం చర్యలు తీసుకుంటారు.

ఈఆర్‌వో: ప్యాకేజీలు, పునరావాసం అందదనే భయాందోళనతో పాత ప్రాంతానికి ఓటు బదిలీ చేయమని అడుగుతున్నారు. అలాచేస్తే ఎక్కడ ఓటు వేస్తారు. పోలింగ్‌ కేంద్రం ఉండాలి కదా. ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. 


ఇక్కడే ఉంచితే ఓటు వెయ్యం

మాకంటే ఏడేళ్ల ముందుగా కృష్ణునిపాలెంలో నివాసం ఉంటున్నవారి ఓట్లు బదిలీ చేయకుండా మా ఓట్లు ఎందుకు చేశారు. నిబంధనల మేరకు మార్చాల్సి వస్తే అందరివీ మార్చాలి కదా? రాజకీయ పార్టీల నాయకుల అనుమతి తీసుకున్నామని ఏడుగురి పేర్లు అధికారులు చదివి వినిపించారు. వారంతా ఎవరో కూడా మాకు తెలియదు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం. ఇప్పటికైనా మా ఓట్లను పాత ప్రాంతానికే మార్చాలి. 

 శివరామకృష్ణనాయుడు, నిర్వాసితుడు


గూడు గోడు పట్టకున్నా.. 

దేవీపట్నం నుంచి మమ్మల్ని ఖాళీ చేయించి మూడేళ్లు గడిచింది. ఇప్పటికీ పునరావాసం కల్పించలేదు. అద్దెలు చెల్లించుకుంటూ ఇబ్బందులు పడుతున్నాం. చాలా మందికి ప్యాకేజీలు రాలేదు. కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగుతున్నా పట్టించుకోని అధికారులు ఓట్లు మాత్రం మా ప్రమేయం లేకుండా బదిలీ చేసేశారు. మా ఆధార్‌, రేషన్‌కార్డులు దేవీపట్నంలో ఉన్నాయి. మా ఓట్లు దేవీపట్నంలోకే మార్చాలి.

 ఆనందరావు, నిర్వాసితుడు, దేవీపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని