logo

సవాలుకు సమాధానమివ్వని ఎమ్మెల్యే: నల్లమిల్లి

చర్చకు, సత్య ప్రమాణానికి నేను సిద్ధమే.. మీరు సిద్ధమా అన్న ప్రశ్నకు వైకాపా ఎమ్మెల్యే సమాధానమివ్వాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి డిమాండు చేశారు.

Published : 01 Mar 2024 02:26 IST

సమావేశంలో మాట్లాడుతున్న రామకృష్ణారెడ్డి

అనపర్తి, న్యూస్‌టుడే: చర్చకు, సత్య ప్రమాణానికి నేను సిద్ధమే.. మీరు సిద్ధమా అన్న ప్రశ్నకు వైకాపా ఎమ్మెల్యే సమాధానమివ్వాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి డిమాండు చేశారు. గురువారం రామవరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి అవినీతి అంశాల మీద చర్చకు ఆయన ఇంటికి మార్చి 1న వస్తానన్నా.. ఇంత వరకు సమాధానం ఇవ్వలేదన్నారు. ఆయన చేసిన అవినీతిలో కొన్నింటిని ఇటీవల కరపత్రం వేసి బహిరంగ లేఖరూపంలో గ్రామంలో పంచి పెట్టడమే కాకుండా వారి ఇంటికి, ఆసుపత్రికి వెళ్లి అందించామన్నారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ నల్లమిల్లికి ఇంగిత జ్ఞానంలేదా అని.. నేను ఉండగా వస్తే పార్టులు తీసేస్తానంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నారు. ఆయన చేసిన రూ.500 కోట్ల అవినీతిని నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నానని అనేక సందర్భాల్లో చెప్పినా దానికి స్పందించలేదన్నారు. ఇప్పుడు కార్యకర్తల సమావేశాల పేరిట, ఇళ్ల స్థలాలు ఇస్తామనే పేరిటా ప్రజలను సమీకరించడం చూస్తుంటే వారు ఏవిధమైన పరిస్థితులు సృష్టించదలుచుకున్నారో అర్థమవుతోందన్నారు. చర్చకైనా, సత్యప్రమాణానికైనా, యుద్ధానికైనా నేను సిద్ధమేనన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు నాగేశ్వరరావు, సుబ్బారెడ్డి, సత్తి దేవదానరెడ్డి, లాలయ్య, సత్య, బాసి, దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

  • తాడేపల్లిగూడెంలో తెదేపా జనసేన ఆధ్వర్యంలో జరిగిన సభ సూపర్‌ సక్సెస్‌ అయిందని రామకృష్ణారెడ్డి తెలిపారు. గురువారం అనపర్తి తెదేపా కార్యాలయంలో జరిగిన సమావేశం ఆయన పాల్గొని మాట్లాడారు. గూడెంలో జరిగిన ఈ సభపై వైకాపా నాయకులు అవాకులు, చవాకులు మాట్లాడడం మొదలు పెట్టారని విమర్శించారు. సిద్ధం పేరిట వైకాపా నాయకులు చేస్తున్న సభలకు బస్సులో ఉపాధిహామీ కూలీలు, అంగన్వాడీ టీచర్లు, ఇతర ఉద్యోగులను బలవంతంగా తరలించినా అవి వెలవెలబోతున్నాయని ఎద్దేవా చేశారు.
  • మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మార్చి 1న బహిరంగ చర్చకు వస్తానన్న నేపథ్యంలో వైకాపా ఎమ్మెల్యే ఆసుపత్రి ప్రాంగణంలో గురువారం టెంట్లు, కుర్చీలతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు డీఎస్పీ కిషోర్‌కుమార్‌, సీఐ శివగణేష్‌ ఆధ్వర్యంలో అదనంగా 70 మంది పోలీసులను బందోబస్తు నిమిత్తం వినియోగిస్తున్నామని సానిక ఎస్సై రామారావు తెలిపారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని