logo

యువత చేతుల్లో భవిత

రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో యువత భవిష్యత్తుకు మార్గదర్శకులుగా నిలిచి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించే బాధ్యతను భుజస్కంధాలపై వేసుకోవాలని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంశెట్టి లక్ష్మణరెడ్డి సూచించారు.

Published : 01 Mar 2024 02:35 IST

కళాజాత కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు

అల్లవరం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో యువత భవిష్యత్తుకు మార్గదర్శకులుగా నిలిచి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించే బాధ్యతను భుజస్కంధాలపై వేసుకోవాలని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంశెట్టి లక్ష్మణరెడ్డి సూచించారు. గురువారం అల్లవరం మండలంలోని ఓడలరేవు బీవీసీ ఇంజినీరింగ్‌ కళాశాలలో సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఆధ్వర్యంలో ‘ఓటు హక్కు వినియోగం’పై విద్యార్థులకు కళాజాత నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం కోసం పనిచేసే నాయకులు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. భావితరాలకోసం మంచి పాలకులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నవారు ఓటు వేస్తారని, మనదగ్గర అందుకు విరుద్ధంగా జరుగుతోందన్నారు. మద్యం, డబ్బు, కులం చూసి ఓట్లువేసే రోజులు పోవాలని, వాటిని నిలువరించడం కేవలం యువతకు మాత్రమే సాధ్యమన్నారు. అనంతరం ఓటుహక్కు వినియోగంపై సాంస్కృతిక చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు.


రకరకాల మాఫియాల వారు బరిలోకి దిగుతున్నారు..

రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఇసుక, మట్టి, మద్యం, గనులు, ఫ్యాక్షనిస్టులు వంటి మాఫియాలకు చెందినవారు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. దీంతో దేశంలోనే అత్యధిక ఎన్నికల వ్యయం అయ్యే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరించబోతోంది. ఓటింగ్‌ శాతం పెంచడం, విలువలున్న నాయకులను ఏ విధంగా గుర్తించాలనే అంశాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కళాజాత కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా యువతలో చైతన్యం రావాలని ఆకాంక్షిస్తున్నా.

 వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి


మేధావుల మౌనం  ప్రజాస్వామ్యానికి చేటు

అత్యున్నత ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత గల మేధావులు మౌనంగా ఉంటే ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం వాటిల్లి, నిరక్షరాస్యులు, గూండాలు రాజ్యమేలే పరిస్థితి వస్తుంది. ఆ విధంగా జరక్కుండా ఉండాలంటే మేధావులు, విద్యావేత్తలు ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉన్న ఏకైక ఆయుధం ఓటుహక్కు వినియోగంపై మిగతా అందరికీ అవగాహన కల్పించాలి. ఓటు హక్కు అనేది రామబాణం లాంటిది. దాని ద్వారా మంచి పాలకులను ఎన్నుకోవాలి.

 చంద్రమౌళి, బీవీసీ కళాశాల ప్రిన్సిపల్‌


నేర చరిత్ర ఉన్నవారిని బహిష్కరించాలి

ఒక విద్యార్థి ఎంతో కష్టపడి తన చదువు పూర్తి చేసుకుని ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే వ్యక్తిగత ప్రవర్తన, నేర చరిత్ర వంటి అంశాలకు సంబంధించి పోలీసుశాఖ ద్వారా విచారణ చేయించిన తరువాత మాత్రమే ఉద్యోగానికి ఎంపిక చేస్తున్నారు. అలాంటిది చట్టసభలకు ప్రాతినిధ్యం వహించి, ప్రజలకు అవసరమైన చట్టాలను రూపొందించే ప్రజాప్రతినిధులకు మాత్రం ఎలాంటి ఉన్నత విద్యార్హత అవసరం లేకుండాపోయింది. తీవ్రమైన నేరపూరిత కేసులు ఉన్నవారు కూడా చట్టసభల్లో కూర్చుని నేరాల నియంత్రణకు చట్టాలు చేసే దుస్థితి నెలకొంటోంది. యువత ఆలోచించి మంచివారిని ప్రజా
ప్రతినిధులుగా ఎన్నుకోవాలి.

 ఈఆర్‌ సుబ్రహ్మణ్యం, జనవిజ్ఞాన వేదిక ప్రతినిధి


అనర్హులతో  సమాజ తిరోగమనం

ఎన్నికల్లో డబ్బు, మద్యం, కులం వంటి ప్రలోభాలకులోనై అనర్హులను గెలిపిస్తే సమాజం తిరోగమనంలో పయనిస్తుంది. ఎన్నికల కమిషన్‌ ఎన్ని చర్యలు చేపట్టినా ఎన్నికల్లో రాజకీయ నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూనేఉంటున్నారు. వాటిని నిలువరించేందుకు యువత ముందుకు రావాల్సిన అవసరం ఉంది.

 ఉప్పుగంటి భాస్కరరావు, లోక్‌సత్తా ప్రతినిధి


ఉత్తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి

అయిదేళ్లుగా మన ఆంధ్రప్రదేశ్‌ రాష్టానికి రాజధాని అనేది లేకుండానే కాలం గడిచిపోయింది. ఉత్తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా అభివృద్ధికి నాంది పలకాలి. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా మాత్రమే రాష్ట్రం అభివృద్ధి పథంలో నిలుస్తుంది.

 జనార్ధనరావు, బీవీసీ అధ్యాపకులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు